Telugu Global
NEWS

హుజూర్‌న‌గ‌ర్‌లో క‌మ‌లం క్యాండిడేట్ అడ్డం తిరిగాడా?

హుజూర్‌న‌గ‌ర్‌లో బీజేపీకి ఏమైంది? క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేదు. పార్టీ పెద్ద‌లు ప్ర‌చారం చేశారు. మండ‌లాల వారీగా ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. అంతో ఇంతో ప్ర‌చారం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ కూడా వెళ్లారు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఒక‌రోజు హుజూర్‌న‌గ‌ర్‌లో తిరిగారు. కానీ తీరా చూస్తే బీజేపీకి వ‌చ్చిన ఓట్లు 2,639. ఓట్ల శాతం 1.31. బీజేపీకి ప‌దివేల నుంచి 15 వేల వ‌ర‌కు ఓట్లు వ‌స్తాయ‌ని టీఆర్ఎస్ నేత‌లే కాదు…. కాంగ్రెస్ నేత‌లు కూడా అనుకున్నారు. […]

హుజూర్‌న‌గ‌ర్‌లో క‌మ‌లం క్యాండిడేట్ అడ్డం తిరిగాడా?
X

హుజూర్‌న‌గ‌ర్‌లో బీజేపీకి ఏమైంది? క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేదు. పార్టీ పెద్ద‌లు ప్ర‌చారం చేశారు. మండ‌లాల వారీగా ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. అంతో ఇంతో ప్ర‌చారం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ కూడా వెళ్లారు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఒక‌రోజు హుజూర్‌న‌గ‌ర్‌లో తిరిగారు. కానీ తీరా చూస్తే బీజేపీకి వ‌చ్చిన ఓట్లు 2,639. ఓట్ల శాతం 1.31.

బీజేపీకి ప‌దివేల నుంచి 15 వేల వ‌ర‌కు ఓట్లు వ‌స్తాయ‌ని టీఆర్ఎస్ నేత‌లే కాదు…. కాంగ్రెస్ నేత‌లు కూడా అనుకున్నారు. తీరా చూస్తే మూడు వేల ఓట్లు కూడా రాలేదు. దాదాపు 11 వేల స‌భ్య‌త్వాలు ఉన్నాయ‌ని బీజేపీ నేత‌లు చెప్పారు. పార్టీ కార్య‌క‌ర్త‌లే ఓట్లు వేయ‌లేదా? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

మొన్నటి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 1,550 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో 1100 ఓట్లు పెరిగాయి. బీజేపీకి ఎక్క‌డ తేడా కొట్టింది అని ఆరాతీస్తే…పార్టీ క్యాండిడేట్ మైన‌స్ అని ఇప్పుడు తెలుస్తోంది.

అభ్యర్థి డాక్టర్ కోట రామారావు ఆ పార్టీ నాయకత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వైద్యుడిగా పని చేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో మూడు నెలల కింద‌ట‌ రాజీనామా చేశారు.

బిజెపి టికెట్ కోసం రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీకళా రెడ్డి కూడా పోటీ పడ్డారు. చివరకు బిసి సామాజిక వర్గానికి చెందిన కోట రామారావును ఎంపిక చేశారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ముగ్గురూ అగ్ర‌కులాల‌కు చెందిన వారే. దీంతో బీసీ కార్డు ఫలిస్తుంద‌ని పార్టీ పెద్దలు ఆశించారు.

బి-ఫాం తీసుకునే సమయంలో కూడా ఎన్నికల వ్యయాన్ని సొంతంగా భరిస్తానని చెప్పిన రామారావు ఆ తర్వాత స్వరం మార్చాడట. తన దగ్గర డబ్బేమీ లేదని పార్టీ సమకూరిస్తేనే ప్రచారం చేస్తానని తెగేసి చెప్పాడట‌.

దీంతో పార్టీయే ప్ర‌చార బాధ్య‌త తీసుకుంద‌ట‌. క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌ను కూడా రామారావు క‌ల‌వ‌లేద‌ట‌. అంతో ఇంతో రాష్ట్ర పార్టీ ఫోక‌స్ పెట్ట‌డంతోనే ఇన్ని ఓట్లు వ‌చ్చాయ‌నేది క‌మ‌లం నుంచి వినిపిస్తున్న గుస‌గుస‌.

మ‌రోవైపు రామారావు బీజేపీ పెద్ద‌ల‌ను బ్లాక్ మెయిల్ చేశారనే ప్ర‌చారం న‌డుస్తోంది. నామినేష‌న్ల ప‌రిశీల‌న పూర్తయినప్ప‌టి నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పాడట‌. గులాబీ కండువా క‌ప్పుకుని ప్ర‌చారం చేస్తాన‌ని టీఆర్ఎస్ పెద్ద‌ల‌కు మెసేజ్ పంపాడ‌ట‌. అయితే అభ్య‌ర్థిని కొన్న అప‌వాదు వ‌స్తుంద‌ని ఆ పార్టీ పెద్ద‌లు తిర‌స్క‌రించార‌ట‌.

మొత్తానికి బీజేపీ పెద్ద‌లు క‌నీసం ప‌దివేల ఓట్లు వ‌స్తే చాలు అనుకున్నారు, కానీ తీరా చూస్తే రైతు ట్రాక్ట‌ర్ గుర్తు, రోడ్డు రోలర్ గుర్తుతో పోటీలో ఉన్న సపావట్ సుమన్ (2693) కంటే తక్కువగా కేవలం 2621 ఓట్లు మాత్రమే పడ్డాయి. రామ‌రావు అడ్డం తిరగ‌డం వ‌ల్లే ఇదంతా జరిగింద‌ని ఇప్పుడు బీజేపీ పెద్ద‌లు అనుకుంటున్నార‌ట‌.

First Published:  26 Oct 2019 2:00 AM GMT
Next Story