Telugu Global
Others

సజీవమైన గాంధీ భావజాలం

గాంధీ గురించి చాలా మంది చాలా చాలా రాశారు. ఆయనను ద్వేషించిన వారూ కొల్లలుగానే ఉన్నారు. కొంతమంది ఆయనను ప్రజా నాయకుడు అంటే మరి కొందరు పట్టించుకోలేదు. జాతీయోద్యమ కాలంలో ఆయన ఆలోచనా విధానాన్ని, రాజకీయ వైఖరిని విమర్శించిన వారూ ఉన్నారు. ఆయనను ద్వేషించే వారికి ఆ పని చేయడానికి సహేతుకమైన కారణం ఏమీ లేదు. ఎందుకంటే ద్వేషించే వారికి జ్ఞానంతో పని లేదు. ద్వేషం, తృణీకార భావం ఉన్న వారికి సహేతుకమైన ఆలోచన ఉండదు. వారికి […]

సజీవమైన గాంధీ భావజాలం
X

గాంధీ గురించి చాలా మంది చాలా చాలా రాశారు. ఆయనను ద్వేషించిన వారూ కొల్లలుగానే ఉన్నారు. కొంతమంది ఆయనను ప్రజా నాయకుడు అంటే మరి కొందరు పట్టించుకోలేదు. జాతీయోద్యమ కాలంలో ఆయన ఆలోచనా విధానాన్ని, రాజకీయ వైఖరిని విమర్శించిన వారూ ఉన్నారు.

ఆయనను ద్వేషించే వారికి ఆ పని చేయడానికి సహేతుకమైన కారణం ఏమీ లేదు. ఎందుకంటే ద్వేషించే వారికి జ్ఞానంతో పని లేదు. ద్వేషం, తృణీకార భావం ఉన్న వారికి సహేతుకమైన ఆలోచన ఉండదు. వారికి ప్రతికూల అభిప్రాయాలు మెండుగా ఉంటాయి. అలాంటి వారికి గాంధీతో కానీ, గాంధీ ఆలోచనా విధానం తెలిసిన వారితో గానీ ఎలాంటి సంబంధమూ ఉండదు. గాంధీని సమర్థించే వారిని నిష్కారణంగానే వీరు వ్యతిరేకిస్తుంటారు.

జ్ఞాన దృష్టితోనూ, ఒక పద్ధతి ప్రకారం అంచనా వేసే వైఖరితోనూ చూస్తే గాంధీ పండితులకు, వ్యాఖ్యాతలకు అందకుండానే ఉండిపోతారు. అందుకని ఆయన ఆలోచనా విధానం మీద వీరు అంతిమంగా చెప్పేది ఏమీ ఉండకపోవచ్చు. గాంధీ రాతలన్నీ నిష్కపటమైన రీతిలో భావ వ్యక్తీకరణకే పరిమితవుతాయి…. కనక వాటిని ఒక మూసలోకి దించి చూడడం కుదరదు.

ఆయన ఆలోచనా ధోరణి నిష్కపటమైంది కనక గాంధీని భిన్నమైన “అవతారాల్లో” చూస్తారు. అందుకే చాలా మందికి గాంధీ వలసవాదం తరవాతి జాతీయవాదిగా, అంతర్జాతీయ వాదిగా, స్త్రీవాదిగా, అట్టడుగు వర్గాల సమర్థకుడిగా, ఆధునికతకు ప్రత్యామ్నాయ ఆలోచనాపరుడిగా, సమాజ హితం కోరే వాడిగా, అంతిమంగా ఉదారవాదిగా కనిపిస్తారు.

నిజానికి గాంధీలో ఉన్న ఈ నిష్కపట ధోరణే ఆయనను వ్యతిరేకించే వారిలో నైతికత లోపించినట్టు కనిపిస్తుంది. రాజకీయంగా కపట స్వభావంతో వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి వారిలో మేధోపరమైన నిస్సహాయత కనిపిస్తుంది. దిక్కుతోచని స్థితి ద్యోతకం అవుతుంది. నిరాశ కూడా ప్రస్ఫుటంగానే వ్యక్తం అవుతుంది. గాంధీని అంచనా వేయడంలో వారికి సహేతుకమైన విధానం ఏమీ ఉండదు కనక గాంధీ వారికి గర్హించదగిన వ్యక్తిగా గోచరిస్తారు.

గాంధీ ఆలోచనా ధోరణిని సహేతుకంగా బేరీజు వేసే ఓర్పు కూడా వారికి ఉండదు. గాంధీని మేధోపరంగా ఎలా ఎదుర్కోవాలో తెలియని వారు నిరాశలో ముణిగి తేలుతుంటారు. కొంత మంది గాంధీ ఉత్తరదాయిత్వాన్ని తుడిచి పెట్టాలని చూస్తారు. అది సాధ్యం కాకపోయే సరికి అలంకార ప్రాయంగా ఆయనను సమర్థించే వారిగా మారిపోతారు. గాంధీ తన ఆలోచనలను సంభాషణా రూపంలో వ్యక్తం చేసే వారు. పచ్చి మితవాదులను సైతం సంభాషణలోకి దించడానికి గాంధీకి అపారమైన శక్తి ఉండేది. ఎందుకంటే ఆయనకు సాంప్రాదాయిక భారత జ్ఞాన వివేచనా పద్ధతులు బాగా తెలుసు. ఆయన ఆలోచనలు చాలా వరకు ఆంతరికమైనవి. ఆయన ఆలోచనా విధాన ప్రభావం పండితులందరిపై ఒకేలా ఉండేది కాదు. భారతీయ ఆలోచనాపరులు పశ్చిమ దేశాల ఆలోచనా ధోరణికి బానిసలు కావడాన్ని ఆయన గుర్తు చేసే వారు.

అయితే ఆయన తన జ్ఞానాన్ని బట్వాడ చేయడానికి సరళమైన విధానాన్నే ఎన్నుకునే వారు. వలస వాదులతో సంభాషణకైనా, బ్రాహ్మాణీక భావజాలం అధికంగా ఉన్న మన సమాజంతో సంభాషణా సమయంలోనూ ఆయన భిన్న విధానాన్ని వినియోగించే వారు. జాతీయోద్యమంలో జన సమీకరణకు ఆయన ఈ పద్ధతిలోనే వ్యవహరించారు. ఈ కారణంవల్లే సహిష్ణుత, అహింస, శాసనోల్లంఘనవంటి ఆయన భాష ప్రజలకు బాగా అర్థం అయింది. విదేశీ పాలనకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించడానికి తోడ్పడింది.

ఆయన చెప్పిన సేవ, సానుభూతి, ధర్మ కర్తృత్వం వంటివి మామూలు జ్ఞాన పరిధిలో గ్రహించదగ్గవి కావు. గాంధీ వాడిన భాష జనం సంవేదనలను తట్టి లేపింది. వారికి హేతుబద్ధంగా అర్థం అయింది. గాంధీ తరచుగా వాడిన “హరిజన్” అన్న మాట కూడా మామూలుగా వాడుకలో ఉన్నది కాదు. కానీ ఇది సవర్ణులను, కింది కులాల వారిని ఐక్యం చేయగలిగింది.

గాంధీ నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించినందువల్లే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించగలిగారు. గాంధీ వాడిన భాష ప్రజలకు అనువుగా ఉండేది. ఈ భాషవల్ల ప్రత్యర్థులకు తక్షణ ఆగ్రహం కలిగేది కాదు. గాంధీ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి నిష్కపటంగా ఉండగలగాలి. ఈ లక్షణం వల్లే ఆయన జనాన్ని సమీకరించగలిగారు.

గాంధీ ఆలోచనా ధోరణిలో ఎలాంటి అరమరికలు, దాపరికాలు ఉండవు. భాషలోనూ, సారంలోనూ దాపరికం బొత్తిగా కనిపించదు. ఆయన భావజాలం భిన్న రకాల వ్యాఖ్యానాలకు, ఆరోగ్యకరమైన విమర్శకు తావిస్తుంది. ఆయన ఆలోచనలకు నిబంధనల నిగళాలు ఉండవు. భావ ప్రకటనకు ఆటంకాలు ఉండవు.

ఆయన భావాలు అర్థం చేసుకోవడానికి ఉపయుక్తమైనవి. అంత మాత్రం చేత గాంధీ భావాలలో అరమరికలు లేవు అంటే అవి ఏకపక్షమైనవని కాదు. ఆయన ఆలోచనలు మానవతా దృక్పథంతో నైతిక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి వీలైనవి. ఆ భావాలకు సమకాలీనత ఉంది. ఇవి భారత్ ను బహిరంగ ప్రదేశాలలో మల విసర్జనను విడనాడడానికి మాత్రమే కాక మౌలికంగా మన సమాజంలో పాతుకుపోయిన అంటరానితనాన్ని రూపుమాపడానికి ఉపకరిస్తాయి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  11 Oct 2019 11:01 PM GMT
Next Story