Telugu Global
NEWS

ఇప్పటికే జీతం 50వేలు.... ఇక ఉపేక్షించం- జయలలిత బాటలో కేసీఆర్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. సమ్మెను ఒక బ్లాక్‌మెయిల్ చర్యగా అభివర్ణించిన కేసీఆర్‌ దానికి లొంగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం 6 గంటల లోపు విధులకు హాజరుకాని వారంతా ఉద్యోగాలు మానేసినట్టుగానే భావించాలని అధికారులకు ఆదేశించారు. రిపోర్టు చేసిన వారు కేవలం 12 వందల మందే కాబట్టి… ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది సంఖ్యను 12 వందలుగానే పరిగణించాలని ఆదేశించారు. సమ్మెకు వెళ్లిన వారి స్థానంలో కొత్త వారిని […]

ఇప్పటికే జీతం 50వేలు.... ఇక ఉపేక్షించం- జయలలిత బాటలో కేసీఆర్
X

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. సమ్మెను ఒక బ్లాక్‌మెయిల్ చర్యగా అభివర్ణించిన కేసీఆర్‌ దానికి లొంగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

శనివారం సాయంత్రం 6 గంటల లోపు విధులకు హాజరుకాని వారంతా ఉద్యోగాలు మానేసినట్టుగానే భావించాలని అధికారులకు ఆదేశించారు. రిపోర్టు చేసిన వారు కేవలం 12 వందల మందే కాబట్టి… ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది సంఖ్యను 12 వందలుగానే పరిగణించాలని ఆదేశించారు. సమ్మెకు వెళ్లిన వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని అధికారులను ఆదేశించారు.

కేసీఆర్ చాలా కఠినంగా ఉండడంతో ఇప్పటికే ఆయా డిపోలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. సమ్మెలో ఉన్న వారు తిరిగి విధులకు హాజరైతే వారిని చేర్చుకోవద్దని ఆయా డిపోల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల ప్రసక్తే లేదని… సమ్మెకు వెళ్లిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీని గట్టెక్కించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ప్రకటించారు. అతి త్వరలోనే ఆర్టీసీలో అనేక మార్పులు ఉంటాయని చెప్పారు. దేశం మొత్తం తెలంగాణ ఆర్టీసీ వైపు చూసేలా చేస్తామన్నారు. రెండు మూడేళ్లలో సంస్థను లాభాల బాట పట్టిస్తామన్నారు.

ఇకపై ఆర్టీసీలో సగం ప్రైవేట్‌ బస్సులు, మిగిలిన సగం ఆర్టీసీ సొంత బస్సులు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు.

పండగ పూట సమ్మె చేసి కార్మిక సంఘాలు పెద్ద తప్పు చేశాయని వ్యాఖ్యానించారు. దేశంలోనే ఆర్టీసీ కార్మికులకు అత్యధిక జీతాలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. సగటున ఆర్టీసీ కార్మికుల నెల వేతనం 50వేల రూపాయలుగా ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. ఇంత చేసినా తిరిగి సమ్మె అనడం ముమ్మాటికి బ్లాక్‌మెయిల్ చర్యే అని అభిప్రాయపడ్డారు.

సమ్మెలో ఉన్న వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని చెప్పిన కేసీఆర్… వారు భవిష్యత్తులో కార్మిక సంఘాల్లో చేరకుండా సంతకాలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్న సీపీఎం, కాంగ్రెస్‌, బీజేపీలు… వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పని ఎందుకు చేయడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు.

ఆర్టీసీలో సగం ప్రైవేట్‌ బస్సులుంటేనే వ్యవస్థ సరిగ్గా నడుస్తుందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. భారీగా జీతాలు తీసుకుంటూ పండగ పూట సమ్మె చేసిన కార్మికులపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో…. ఒకసారి సోషల్ మీడియాలో ప్రజల స్పందన చూస్తే తెలుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. పండగ పూట ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదని పలుమార్లు అధికారుల సమావేశంలో కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఏఏ కేటగిరిల్లో ఎంత మంది ఉద్యోగాలు మానేశారో గుర్తించి … ఆ స్థానాల్లో కొత్తవారిని భర్తీ చేసేందుకు వీలుగా ఖాళీలు ప్రకటించాలని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరానికి చెందినంత వరకు ఆర్టీసీకి వచ్చే నష్టాలను ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని కేసీఆర్ చెప్పారు. కేవలం 15 రోజుల్లోనే ఆర్టీసీలో పరిస్థితిని పూర్వ స్థితికి తీసుకొస్తామని ప్రకటించారు.

ఆర్టీసీలో సమ్మెలు, ఇతర వివాదాలు 40ఏళ్లుగా సంస్థను వెంటాడుతున్నాయని… వీటికి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఆర్టీసీలో మొత్తం 49వేల 860 మంది పనిచేస్తున్నారు. వారిలో కేవలం 12 వందల మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. హాజరుకాని 48వేల 660 మందిని విధుల నుంచి తొలగించినట్టుగానే అధికారులు భావిస్తున్నారు. ఇలా ఒకేసారి 48వేల మందిపై వేటు చరిత్రలోనే ఒక సంచలం అవుతుందని భావిస్తున్నారు. 2003లో తమిళనాడులో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.

2003లో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో అక్కడి టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు దాదాపు లక్షా 70వేల మంది సమ్మెకు దిగారు. ప్రభుత్వం బుజ్జగించినా వారు దిగిరాకపోవడంతో లక్షా 70వేల మందిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ జయ సర్కార్ అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయడం అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉద్యోగులంతా దిగిరావడంతో డిస్మిస్ ఉత్తర్వులను జయ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.

First Published:  6 Oct 2019 8:37 PM GMT
Next Story