Telugu Global
Others

సమస్యాత్మక జి.ఎస్.టి.

కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ విభాగంలో కమిషనర్లు, సూపరింటెండెంట్ స్థాయిలో పని చేస్తున్న 37 మంది అధికారులను ప్రభుత్వం బలవంతంగా పదవీ విరమణ చేయించింది. అవినీతి తదితర ఆరోపణల కారణంగా ఈ చర్య తీసుకున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) తీరు బాగా లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో నిరాశ వ్యక్తం చేసినందువల్ల ఈ అధికారుల చేత ఉద్యోగ విరమణ చేయించారు. “ఉన్నతాధికార వర్గాన్ని” ప్రక్షాళనం చేయడానికి కేంద్ర […]

సమస్యాత్మక జి.ఎస్.టి.
X

కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ విభాగంలో కమిషనర్లు, సూపరింటెండెంట్ స్థాయిలో పని చేస్తున్న 37 మంది అధికారులను ప్రభుత్వం బలవంతంగా పదవీ విరమణ చేయించింది. అవినీతి తదితర ఆరోపణల కారణంగా ఈ చర్య తీసుకున్నారు.

గత రెండు సంవత్సరాల నుంచి వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) తీరు బాగా లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో నిరాశ వ్యక్తం చేసినందువల్ల ఈ అధికారుల చేత ఉద్యోగ విరమణ చేయించారు. “ఉన్నతాధికార వర్గాన్ని” ప్రక్షాళనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న రీతిలో ప్రవర్తించిందనుకోవాలా? 1972 నాటి కేంద్ర సివిల్ సర్వీసు ఉద్యోగుల నియమావళి, 1958నాటి అఖిల భారత సర్వీసుల నియమావళి ఆధారంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం ద్వారా అవినీతికర, అసమర్థ అధికారులపై కొరడా ఝళిపించింది.

పన్నుల వ్యవహారానికి సంబంధించి చూస్తే “తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిన కొంత మంది కళంకిత అధికారులు నిజాయితీగా పన్నులు చెల్లించే వారిని వేధించారని, చిన్న చిన్న అంశాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకున్నారు” అని ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు.

అయితే ఇలాంటి ఇంటి దొంగలపై చర్య తీసుకునే క్రమంలో ప్రభుత్వం వ్యవస్థలో ఉన్న లోపాలను, వాటి పర్యవసానాలను ప్రభుత్వం విస్మరిస్తోందా, ఇలాంటి వారిని కట్టడి చేయడానికి చర్య తీసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటోందా? దురుద్దేశంతో వ్యవహరించే అధికారులు ఉన్నారనుకున్నప్పుడు తగ్గించవలసిన “ఇన్వాయిస్ మాచింగ్” వ్యవస్థ లాంటి వాటిని ఎందుకు కట్టడి చేయలేదు? పన్నుల ఎగవేతను ఎందుకు నిరోధించలేదు? ఇన్వాయిస్ ఆధారంగానే 100 శాతం జి.ఎస్.టి. విధానాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు? ఇన్వాయిస్ మాచింగ్ వ్యవస్థ పకడ్బందీగా లేనందువల్లే పెట్టుకున్న లక్ష్యాలు సాధించడం సాధ్యం కావడం లేదు.

ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ లో మోసాలు జరుగుతున్నాయని, ఇన్వాయిస్ మాచింగ్ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణం అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో తెలియజేశారు. ఇన్వాయిస్ మాచింగ్ వ్యవస్థ, ఎక్కువ పన్ను చెల్లిస్తే తక్షణం తిరిగిచ్చి చెల్లించే పద్ధతి లేకపోవడంవల్ల జి.ఎస్.టి. అనుకున్నంతగా వసూలు కావడం లేదు.

2018 ఏప్రిల్ లో 87 శాతం మంది పన్నుల రిటర్నులు దాఖలు చేస్తే 2018 డిసెంబర్ లో అది 79 శాతానికి పడిపోవడమే పన్ను చెల్లింపులు సక్రమంగా జరగడం లేదనడానికి నిదర్శనం. సమీకృత వస్తు సేవల పన్ను అంతరాష్ట్ర వస్తువులు, సేవలు, దిగుమతుల మీద విధిస్తారు. 2017-18లో ఈ వసూళ్లు రూ. 1,76,688 కోట్లు ఉంటే అది 2018-19లో రూ 28,947 కోట్లకు తగ్గిపోయింది. పెట్రోలియం, పొగాకు మీద కేంద్రానికి అందే ఎక్సైజ్ సుంకాన్ని మినహాయిస్తే జి.ఎస్.టి. ద్వారా ప్రభుత్వ ఆదాయం 2016-17తో పోలిస్తే 2017-18లో 10 శాతం తగ్గిపోయింది.

జి.ఎస్.టి. విధానంలో ఉన్న లోపాలను ప్రభుత్వం విస్మరిస్తోందా అని ప్రశ్నించుకుంటే లేదు అన్న సమాధానమే వస్తోంది. ఉదాహరణకు జి.ఎస్.టి.లో ప్రధానమైన అంశం ఇన్వాయిస్ మాచింగ్ వ్యవస్థే. ఈ విధానం పన్ను చెల్లించే వారికి, పన్ను వసూలు చేసే వారికీ అవసరమే. కనీసం తొలి దశలోనైనా ఇది అవసరం.

ఎందుకంటే ఈ వ్యవస్థ గురించి అసలు తెలియకపోవడమో, అత్యంత స్వల్పంగా తెలియడమో అనే సమస్యలు ఉంటాయి. పన్ను విధానాన్ని అమలు చేయడంలో ఉన్న లొసుగులను దశలవారీగా పరిష్కరిస్తారు. అలాగే 2017 నవంబర్ నుంచి మొదలు పెట్టి పన్ను రేట్లను తగ్గిస్తూ వస్తున్నారు. దీని ప్రభావం వసూళ్లపై తక్షణం ఉంటుంది.

2017 లో 65 లక్షల మంది పన్ను చెల్లించే వారు ఉంటే వారి సంఖ్య 1. 20 కోట్లకు పెరిగింది. పన్ను చెల్లించే వారి సంఖ్య పెరుగుతోందన్న మాట వాస్తవమే… కానీ ఇలా పన్ను చెల్లించే వారిలో కేవలం 5శాతం మందే 95 శాతం పన్ను చెల్లిస్తున్నారు.

సాంకేతికమైన అంశాలను పరిష్కరించినప్పటికీ టాక్స్ రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య మాత్రం పెరగడం కష్టమే. ఎందుకంటే అవ్యవస్థీకృత రంగం జి.ఎస్.టి. పరిధిలోకి రాదు. వారికి దీనివల్ల ప్రయోజనమూ లేదు. ఈ అవ్యవస్థీకృత రంగం ద్వారానే జాతీయ ఉత్పత్తిలో అయిదింట రెండు వంతులు సమకూరుతోంది, 90 శాతం ఉపాధి కల్పిస్తోంది.

అవ్యవస్థీకృత రంగానికి ఇన్ పుట్ క్రెడిట్ కు అర్హత లేదు. విలోమ చార్జీలు విధిస్తే అది వ్యవస్థీకృత రంగానికి ప్రయోజనమూ లేదు. కేంద్ర పరోక్ష పన్నుల అధికారుల మీద చర్య తీసుకోవడం దగ్గరకు వస్తే జి.ఎస్.టి. వ్యవస్థలో ఏ లోపమూ లేనట్టే లెక్క. కానీ జి.ఎస్.టి. వ్యవస్థలో ఉన్న పక్షపాత దృష్టిపై సామాన్యులకు అవగాహనే తక్కువ.

జి.ఎస్.టి. వ్యవస్థలో ఇలాంటి లోపాలను ప్రశ్నించడానికి బలమైన రాజకీయ ప్రతిపక్షం లేనందువల్ల అతిశయోక్తులు సృష్టించి ప్రభుత్వమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తోంది. అయితే ప్రభుత్వంలో ఆత్మ పరిశీలన ఛాయలు ఉన్నా అది నైతిక ప్రాతిపదిక మీద ఆధారపడ్డదే తప్ప, సమస్యలను ఆచరణాత్మక దృక్పథంతో చూసేది కాదు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  17 Sep 2019 9:35 AM GMT
Next Story