Telugu Global
NEWS

భారీగా ముడుపులు డిమాండ్ చేసిన బాబు కోటరి ?... షాక్‌కు గురి చేస్తున్న ఇండో యూకే హెల్త్‌ కేర్‌ ఎండీ వ్యాఖ్యలు

చంద్రబాబు ఐదేళ్లలో సాగించిన ముడుపుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒక్క దరఖాస్తు పెడితే చాలు అన్ని అనుమతులను తక్షణం చేసి పెడుతామని చంద్రబాబు చెబుతూ వచ్చినా పరిశ్రమలు, సంస్థలు మాత్రం ఏర్పాటు కాలేదు. పేరుకు మాత్రం లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను చేసుకున్నారు చంద్రబాబు హయాంలో. ఒప్పందాలు జరిగినా సంస్థలు ఏర్పాటు కాకపోడానికి చంద్రబాబు అండ్ టీం భారీగా ముడుపులు డిమాండ్ చేయడమేనని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు ఊతం […]

భారీగా ముడుపులు డిమాండ్ చేసిన బాబు కోటరి ?... షాక్‌కు గురి చేస్తున్న ఇండో యూకే హెల్త్‌ కేర్‌ ఎండీ వ్యాఖ్యలు
X

చంద్రబాబు ఐదేళ్లలో సాగించిన ముడుపుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒక్క దరఖాస్తు పెడితే చాలు అన్ని అనుమతులను తక్షణం చేసి పెడుతామని చంద్రబాబు చెబుతూ వచ్చినా పరిశ్రమలు, సంస్థలు మాత్రం ఏర్పాటు కాలేదు.

పేరుకు మాత్రం లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను చేసుకున్నారు చంద్రబాబు హయాంలో. ఒప్పందాలు జరిగినా సంస్థలు ఏర్పాటు కాకపోడానికి చంద్రబాబు అండ్ టీం భారీగా ముడుపులు డిమాండ్ చేయడమేనని గతంలో ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థ ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు కోటరీ డిమాండ్ చేసిన వందల కోట్లు ముడుపులుగా ఇవ్వలేక ఆ సంస్థ వెనక్కు వెళ్లిపోయింది. ఆ సంస్థ ఎండీ నేరుగా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.

టీడీపీ ప్రభుత్వం 2016లో లండన్‌లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ఓ సమావేశం జరగ్గా… ఎంత భూమి కావాలంటే అంత ఇస్తామని, అన్ని అనుమతులను 21రోజుల్లోనే మంజూరు చేస్తామని అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.

దీన్ని నమ్మిన ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌) అమరావతిలో వెయ్యి పడకల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఆ సంస్థకు అమరావతిలో 150 ఎకరాలకు కేటాయించేందుకు అంగీకరించింది.

తొలుత 50 ఎకరాలు కేటాయించడంతో ఐయూఐహెచ్‌ 2017లొ సీఆర్డీఏకు డిపాజిట్‌ కింద రూ.25 కోట్లు చెల్లించింది. కానీ సీఆర్‌డీఏ భూమిని మాత్రం చూపించలేదు. ఐయూఐహెచ్‌ ప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బృందం చుట్టూ మూడేళ్లపాటు కాళ్లరిగేలా తిరిగినా స్పందించలేదు.

చంద్రబాబు సర్కారు తమకు చేసిన భూకేటాయింపులు, ఇతర డాక్యుమెంట్లను న్యాయ నిపుణులతో పరిశీలించుకున్న ఐయూఐహెచ్‌ షాక్‌ అయింది. భూమిపై నిజమైన యాజమాన్య, విక్రయ హక్కులు లేకుండానే భూమిని కేటాయించినట్లు తెలుసుకుంది.

ప్రభుత్వం మోసం చేసిందంటూ ఈ అంశంపై చంద్రబాబుతో చర్చించేందుకు పలుమార్లు కంపెనీ ప్రతినిధులు ప్రయత్నించినా నాటి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. రెండుసార్లు అపాయింట్‌మెంట్ ఖరారు చేసి ఆఖరిలో రద్దు చేశారు. చివరకు తాము చెల్లించిన డబ్బును కూడా వెనక్కు ఇవ్వకుండా నాటి ప్రభుత్వం వేధించిందని… 40కిపైగా లేఖలు రాసినా స్పందించలేదని కంపెనీ చెబుతోంది.

అయితే ప్రభుత్వం ఎందుకు ఇలా తమను వేధిస్తోందో అర్థం కాక కంపెనీ సతమతమవుతున్న సమయంలోనే చంద్రబాబు కోటరీ మనుషులు కంపెనీ పెద్దలను కలిశారు. ఎకరాకు రూ.కోటి చొప్పున 150 ఎకరాలకు రూ.150 కోట్లు కమీషన్‌ కావాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. దాంతోపాటు అమరావతిలో నెలకొల్పే మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 25 శాతం వాటా కూడా కావాలని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న ఐయూఐహెచ్‌ ప్రతినిధులు అమరావతిలో ఆస్పత్రి ప్రతిపాదన నుంచి తప్పుకున్నారు.

అమరావతిలో ఆస్పత్రి నిర్మాణం విషయంలో చంద్రబాబు కోటరీ వేధించిన విషయాన్ని స్వయంగా ఇండో యూకే హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అండ్ సీఈవో డాక్టర్ అజయ్ రంజన్ గుప్తా స్వయంగా ఒక మీడియా సంస్థకు వెల్లడించడం విశేషం. టీడీపీ హయాంలో వారు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి నమ్మి మోసపోయామన్నారు. తమ దగ్గర డబ్బులు తీసుకుని మరీ వేధించారన్నారు.

పెట్టుబడిదారులతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు. ఈ నేపథ్యంలోనే తాము ప్రాజెక్టు ఏర్పాటుపై వెనక్కి తగ్గి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చిందని అజయ్ రంజన్ గుప్తా వెల్లడించారు.

First Published:  7 Sep 2019 12:18 AM GMT
Next Story