Telugu Global
Others

సహజ సేద్యం ఓ ఎండమావి

మహారాష్ట్రకు చెందిన వ్యవసాయదారుడు సుభష్ పాలేకర్ కు 2016లో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయడంతో సహజ సేద్యం (జీరో బడ్జెట్ సేద్యం) అన్న మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. వాణిజ్య పంటలు పండించడానికి పెట్టుబడి ఎక్కువగా అవసరం కావడంతో సహజ సేద్యం ఆశాజనకంగా తయారైంది. ఈ పద్ధతిలో వాణిజ్యపరంగా విత్తనాలు, రసాయనిక ఎరువులు కొనకపోవడంవల్ల ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుందని అనుకున్నారు. వీటన్నింటినీ నివారించడంవల్ల రైతు అప్పులకోసం వెంపర్లాడి, అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండగలగుతాడు అనుకోవడం ఈ […]

సహజ సేద్యం ఓ ఎండమావి
X

మహారాష్ట్రకు చెందిన వ్యవసాయదారుడు సుభష్ పాలేకర్ కు 2016లో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయడంతో సహజ సేద్యం (జీరో బడ్జెట్ సేద్యం) అన్న మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. వాణిజ్య పంటలు పండించడానికి పెట్టుబడి ఎక్కువగా అవసరం కావడంతో సహజ సేద్యం ఆశాజనకంగా తయారైంది.

ఈ పద్ధతిలో వాణిజ్యపరంగా విత్తనాలు, రసాయనిక ఎరువులు కొనకపోవడంవల్ల ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుందని అనుకున్నారు. వీటన్నింటినీ నివారించడంవల్ల రైతు అప్పులకోసం వెంపర్లాడి, అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండగలగుతాడు అనుకోవడం ఈ పద్ధతి మీద ఆశ పెరగడానికి రెండో కారణం. ఈ కారణాలవల్లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహజ సేద్య విధానానికి ప్రాధాన్యత ఇస్తోంది.

2018-19 ఆర్థిక సర్వేలో కూడా ఈ విషయమే నొక్కి చెప్పారు. అయితే ఇది కొన్ని కఠిన వాస్తవాలను అధిగమించగలదా అన్నదే అసలు ప్రశ్న.

నిజానికి పాలేకర్ చేసిన ప్రయోగం ఆయనకు 2016లో పద్మశ్రీ ఇవ్వడానికన్నా ఓ దశాబ్దం కిందటిదే. ఈ పద్ధతి సేద్యం గురించి ఆయనకు పద్మశ్రీ ఇచ్చినప్పుడు బాగా ప్రచారంలో పెట్టారు. పాలేకర్ స్వయంగా ఈ అంశంపై ఓ గ్రంథం ప్రచురించారు. కానీ ఈ పద్ధతిపై స్వతంత్రమైన పరిశోధన, ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందో లేదోనన్న అంశంపై పరిశోధనలు ఏమీ జరగలేదు. జరిగినా అవి జనానికి అందుబాటులో లేవు.

182 రైతు సంఘాల కూటమి అయిన లా వయా కాంపెసిన (ఎల్.వి.సి.) అనే సంస్థ ఈ విషయమై అధ్యయనం చేసింది. ఈ సంస్థ 81 దేశాల రైతులతో కూడింది. కర్నాటకలోని రైతులు ఈ పద్ధతి అనుసరించారంటున్నారు. వారూ మధ్య తరగతి రైతులే. ఇది అందరికీ వర్తించే విధానమేనన్నది వివాదాస్పదంగానే ఉంది. భారీ ఎత్తున ఈ రకమైన సేద్యం సాధ్యమేనా, నిలకడగా ఉండే ఫలితాలు ఇస్తుందా అనేది కూడా సందేహాస్పదమే.

ఈ రంకంగా పండించిన పంటలకు మార్కెట్ అంతగా ఉండదేమోనన్న అనుమానం ఈ అధ్యయనంలోనే వ్యక్తమైంది. ఈ పద్ధతిని అనుసరించి సేద్యం చేసిన రైతులు మునుపటి పద్ధతినే అనుసరిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. పెట్టుబడి అధికంగా ఉండే సేద్య విధానమే లాభసాటిగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఈ విధానం చిన్న రైతులకు సరిపడదన్న వాదన ఉంది.

వాస్తవ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, అది చిన్న రైతులకు అంతగా ఉపయోగపడేది కానప్పుడు 2020కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటున్న ప్రభుత్వం ఈ విధానం గురించి ఇంత ప్రచారం ఎందుకు చేస్తున్నట్టు? సహజ సేద్యంవల్ల మేలు కలిగేది మధ్య తరహా రైతులకే అయినప్పుడు ఈ విధానాన్ని ప్రచారంలో పెట్టడం రాజకీయ ప్రయోజనాలకోసమే అని అనుమానించక తప్పదు.

మధ్య తరహా రైతులు చారిత్రకంగా ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో జయాపజయాలను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా దేశంలోని హిందీ మాట్లాడే రైతులు ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తు తేల్చే స్థితిలో ఉన్నారు. అదే సమయంలో చిన్న, సన్నకారు రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఈ విధానంవల్ల ఫలితం లేనప్పుడు వీరు రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చే స్థితిలో లేనందువల్లే దేశంలో రైతుల ఉద్యమం ఊపందుకోలేక పోతోంది. ఈ స్థితిలో ప్రభుత్వ విధానాలు రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడానికే పరిమితమవుతాయి తప్ప రైతుల పరిస్థితి రూపాంతరం చెందడానికి ఉపకరించవు.

2013నాటి భూ సేకరణ చట్టం ప్రకారం సముచిత పరిహారం చెల్లించే విషయంలో రైతుల “సమ్మతి” అన్న మాటను సవరిస్తూ 2015లో రెండో సారి ఆర్డినెన్స్ జారీ చేసే సమయంలోనే సహజ సేద్యం, దాని గురించి చెప్పిన పాలేకర్ ప్రస్తావన వచ్చిందన్న విషయాన్ని గమనించాలి.

భూ యాజమాన్యం ఎవరిది అన్న విషయంలోనే స్పష్టత లేనప్పుడు వ్యవసాయ సాంకేతికతపై ఏ సిఫార్సువల్లనైనా ఒరిగేది ఎముంటుంది? దీనివల్ల రైతులకు కలిగే మేలేమిటి? పైగా సహజ సేద్యం అంటే రైతులకు అసలు ఖర్చే ఉండదని కాదు. దీని అర్థం ఏమిటంటే రైతులకు అయ్యే ఖర్చులకు “అంతర్ పంటల” ద్వారా పరిహారం రూపంలో అందుతుంది. అందువల్ల జీరో బడ్జెట్ వ్యవసాయం సాధ్యమవుతుంది.

రైతులను అంతర్ పంటలవేపు ప్రోత్సహించి వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే వ్యవస్థ లేనప్పుడు ఒకే రకమైన పంటలకు మద్దతు ధర ప్రకటించినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుంది? దీన్నిబట్టి “రైతులకు అనుకూలమైన” వ్యవసాయ విధానం విషయంలో ప్రభుత్వ సంకల్పం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

“మళ్లీ మౌలిక విధానాల వేపు” అన్న ప్రభుత్వ విధానం జాతీయతా భావనలు రేకిత్తించడానికి ఉపయోగపడవచ్చు. సమగ్రమైన వ్యవసాయ విధానం విషయంలో ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించకుండా ఉండడానికి తోడ్పడవచ్చు. ఈ వాగాడంబరంతో దుష్పరిపాలనకు సంబంధించిన అంశాలు నిశితంగా పరిశీలించే వారికి కనిపిస్తూనే ఉంటాయి.

ఉదాహరణకు “మళ్లీ మౌలిక విధానాల వేపు” అన్నదే ప్రధానమైతే జీరో బడ్జెట్ విధానాన్ని భుజాన వేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహజ సేద్యం కోసం రూ. 17,000 కోట్లు కేటాయించడం ఎందుకు? ఇంత భారీ మొత్తం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, వ్యవసాయ రంగ వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టేటట్టయితే ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రచారానికి, ఆచరణకు మధ్య ఉన్న తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది.

పైగా ఈ విధానం వల్ల నయా ఉదారవాద విధానాలు అనుసరించే రాజ్య వ్యవస్థలు కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సాహకాలు అందించడం ఒక వేపు మరో వైపు ప్రాధాన్య రంగాలలో ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేసే ప్రయత్నం అనే రెండు పద్ధతులు గోచరిస్తూనే ఉన్నాయి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  6 Sep 2019 12:13 AM GMT
Next Story