Telugu Global
NEWS

సభ్యత్వంలో మేమే బెస్ట్... అబ్బే మీది బోగస్

పార్టీ సభ్యత్వాలపై తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రోడ్డెక్కుతున్నాయి. వీధిలో కుళాయి దగ్గర మంచినీళ్ల కోసం మహిళలు బిందెలతో కొట్టుకున్నట్లుగా సభ్యత్వ నమోదులో మేమే ఫస్ట్ అని… కాదు కాదు… మీ సభ్యత్వం బోగస్ అంటూ విమర్శించుకుంటున్నారు. జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రాంతీయ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి ఒకేసారి తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాయి. రాష్ట్ర్ర వ్యాప్తంగా ఈ రెండు పార్టీలు సభ్యత్వ నమోదు ప్రక్రియను […]

సభ్యత్వంలో మేమే బెస్ట్... అబ్బే మీది బోగస్
X

పార్టీ సభ్యత్వాలపై తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రోడ్డెక్కుతున్నాయి. వీధిలో కుళాయి దగ్గర మంచినీళ్ల కోసం మహిళలు బిందెలతో కొట్టుకున్నట్లుగా సభ్యత్వ నమోదులో మేమే ఫస్ట్ అని… కాదు కాదు… మీ సభ్యత్వం బోగస్ అంటూ విమర్శించుకుంటున్నారు.

జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రాంతీయ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి ఒకేసారి తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాయి. రాష్ట్ర్ర వ్యాప్తంగా ఈ రెండు పార్టీలు సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టగా భావించాయి.

ఈ కార్యక్రమాల గడువు ముగిసిన తర్వాత రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు తమ పార్టీ సభ్యత్వం గతంలో కంటే నాలుగు రెట్లు, ఐదు రెట్లు పెరిగిందంటూ ప్రకటనలూ గుప్పించాయి.

భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అసలు సభ్యత్వమే లేదంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.

“భారతీయ జనతా పార్టీనా..తెలంగాణలో ఆ పార్టీ ఎక్కడుంది” అంటూ ఓ అడుగు ముందుకు వేసి బీజేపీ నాయకులను ఎద్దేవా చేశారు.

దీనికి కమలనాథులు కూడా సరైన సమాధానమే ఇచ్చారు.

“తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎక్కడుందో నిజామాబాద్ లో ఓడిపోయిన నీ చెల్లెలిని అడుగు” అంటూ కమలనాథులు కేటీఆర్ కు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తమ పార్టీ సభ్యత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.

“మా సభ్యత్వం 12 లక్షలకే ఉలిక్కిపడుతున్నారు. అసలు లెక్కలు తెలిస్తే కేటీఆర్ మూర్చపోతారు ” అని లక్ష్మణ్ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్ర్రంలో తమ సభ్యత్వం 18 లక్షలని, ఇది కేటీఆర్ కు తెలియదని, సభ్యత్వ విషయంలో ఆయన అమాయకుడని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది ప్రాధమిక సభ్యులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ…. ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత సభ్యత్వాన్ని కలిగి ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా 15 లక్షల సభ్యత్వం కలిగి ఉందని ఆ పార్టీ చెబుతోంది. అయితే ఇదే రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టని అంశంగా మారింది. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా సభ్యత్వం ఉందని, మరి వారి సభ్యులతో కలిపితే తెలంగాణలో ఏ పార్టీకి ఎంత సభ్యత్వం ఉన్నట్లు భావించాలని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర జనాభా కంటే వివిధ పార్టీలలో సభ్యులుగా చేరిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని, ఇదెలా సాధ్యమో ఆయా పార్టీల నాయకులకే తెలియాలని అంటున్నారు.

First Published:  24 Aug 2019 12:18 AM GMT
Next Story