Telugu Global
NEWS

142 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో అరుదైన ఘట్టం

ఆటగాళ్ల జెర్సీలపై తొలిసారిగా పేర్లు, నంబర్లు బర్మింగ్ హామ్ వేదికగా సరికొత్త చరిత్ర టెస్ట్ క్రికెట్…క్రికెట్ ఆటకు తల్లిలాంటిది. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒకే ఒక్క ఫార్మాట్. సాంప్రదాయాలకు మరోపేరుగా నిలిచే టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త ఘట్టానికి బర్మింగ్ హామ్ స్టేడియంలో తెరలేచింది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా జరుగుతున్న 2019 యాషెస్ సిరీస్ లోని తొలిటెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్, ప్రత్యర్థి ఆస్ట్ర్రేలియా జట్ల ఆటగాళ్లు ..తమ పేర్లతో పాటు ఇష్టమైన నంబర్లు ముద్రించిన జెర్సీలు […]

142 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో అరుదైన ఘట్టం
X
  • ఆటగాళ్ల జెర్సీలపై తొలిసారిగా పేర్లు, నంబర్లు
  • బర్మింగ్ హామ్ వేదికగా సరికొత్త చరిత్ర

టెస్ట్ క్రికెట్…క్రికెట్ ఆటకు తల్లిలాంటిది. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒకే ఒక్క ఫార్మాట్. సాంప్రదాయాలకు మరోపేరుగా నిలిచే టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త ఘట్టానికి బర్మింగ్ హామ్ స్టేడియంలో తెరలేచింది.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా జరుగుతున్న 2019 యాషెస్ సిరీస్ లోని తొలిటెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్, ప్రత్యర్థి ఆస్ట్ర్రేలియా జట్ల ఆటగాళ్లు ..తమ పేర్లతో పాటు ఇష్టమైన నంబర్లు ముద్రించిన జెర్సీలు ధరించి మరీ మ్యాచ్ లో పాల్గొన్నారు.

ప్రస్తుత ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు వరకూ జరిగిన 2వేల 352 మ్యాచ్ ల్లో లేనిది..2353టెస్ట్ మ్యాచ్ లో చోటు చేసుకొంది. అంతేకాదు.. టెస్ట్ చాంపియన్షిప్ లో తలపడుతున్న మొత్తం తొమ్మిది దేశాలజట్ల ఆటగాళ్లు తమ తమ జెర్సీలపై నంబర్లు, పేర్లతోనే ఆడనున్నారు.

ఇప్పటి వరకూ వన్డే, టీ-20 క్రికెట్ కు మాత్రమే పరిమితమైన జెర్సీ నంబర్లు, పేర్ల సాంప్రదాయాన్ని …టెస్ట్ క్రికెట్ కు సైతం ఐసీసీ విస్తరింప చేసింది.

ఆడం గిల్ క్రిస్ట్ విమర్శ…

గత 14 దశాబ్దాలుగా టెస్టు క్రికెట్లో లేని సాంప్రదాయాన్ని ప్రస్తుత యాషెస్ సిరీస్ నుంచి ప్రారంభించడాన్ని మించిన మూర్ఖత్వం మరొకటి లేదని.. ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ ఆడం గిల్ క్రిస్ట్ మండిపడ్డాడు.

ఐదురోజులపాటు జరిగే టెస్ట్ క్రికెట్లో జెర్సీలకు పేర్లు, నంబర్లేమిటో తనకు అర్థంకావడం లేదని ట్విట్టర్ ద్వారా గిల్ క్రిస్ట్ తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు.

పెద్దమనుషుల క్రీడ క్రికెట్ మర్యాద ఈ చర్యతో మంటకలిసిపోయిందని పరోక్షంగా విమర్శించాడు.

క్రికెటర్ల మేలు కోసమే…

క్రికెటర్లకు, అభిమానులకు మధ్య ధృడమైన సంబంధం కోసమే జెర్సీలపైన పేర్లు, నంబర్లు ముద్రించినట్లు ఐసీసీ చెబుతోంది. టెస్ట్ క్రికెట్ కు మరింత గ్లామర్ ను తీసుకురావడంలో భాగంగానే ఈ మార్పు చేసినట్లు వివరించింది.

ఏది ఏమైతేనేం..ఇంతకుముందు వరకూ టెస్ట్ క్రికెట్ కు ఉన్న ప్రత్యేకత, మర్యాద ..జెర్సీలపై పేర్లు, నంబర్లు ముద్రించడంతోనే పోయాయని.. క్రికెట్ సాంప్రదాయ అభిమానులు వాపోతున్నారు.

First Published:  1 Aug 2019 11:26 PM GMT
Next Story