Telugu Global
Others

లోపాలను కప్పిపుచ్చే వాగాడంబరం

సామాజిక-ఆర్థిక వ్యవహారాలలో మొదటి సారి అధికారంలో ఉన్నప్పుడు ఏమీ సాధించని కేంద్ర ప్రభుత్వం రెండో సారి మరింత అధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరవాత ప్రభుత్వ విధానాలకు “మానవీయ ముసుగు” కప్పడానికి ప్రయత్నిస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. 2018-19 ఆర్థిక సర్వే చూస్తే పనిగట్టుకోని ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మనుషులు కేవలం “ఆర్థిక జీవులు” మాత్రమే కాదు. వారు రక్తమాంసాలు ఉన్న, తప్పులు చేయగల మానవులు. దేశంలో ఆర్థిక మార్పు తీసుకురావడానికి వారి వెన్ను తట్టవలసిన […]

లోపాలను కప్పిపుచ్చే వాగాడంబరం
X

సామాజిక-ఆర్థిక వ్యవహారాలలో మొదటి సారి అధికారంలో ఉన్నప్పుడు ఏమీ సాధించని కేంద్ర ప్రభుత్వం రెండో సారి మరింత అధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరవాత ప్రభుత్వ విధానాలకు “మానవీయ ముసుగు” కప్పడానికి ప్రయత్నిస్తోందా అన్న అనుమానం కలుగుతోంది.

2018-19 ఆర్థిక సర్వే చూస్తే పనిగట్టుకోని ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మనుషులు కేవలం “ఆర్థిక జీవులు” మాత్రమే కాదు. వారు రక్తమాంసాలు ఉన్న, తప్పులు చేయగల మానవులు. దేశంలో ఆర్థిక మార్పు తీసుకురావడానికి వారి వెన్ను తట్టవలసిన అవసరం ఉంటుందన్న భావన చాలా కాలంగా ఉన్నదే. ఇందులో కొత్తేమీ లేదు.

నిజానికి గత దశాబ్దం పైగా ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాలు ఇలాంటి భావాలను మానవ ప్రవర్తనా అధ్యయనంలో భాగం చేసి విధానాలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలలో, పథకాలలో వారిని భాగస్వాముల్ని చేయడం దీని వెనక ఉన్న ఆంతర్యం. వారిలో సానుకూల మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది.

స్వచ్ఛ భారత్, బేటీ బచావో-బేటీ పఢావో వంటి పథకాల ద్వారా జనం ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ ప్రభుత్వం సాధించామని చెప్తున్న విజయాలు వివాదాస్పదంగానే ఉన్నాయి.

2018-19లో జాతీయ గ్రామీణ పారిశుధ్య పథకంపై నిర్వహించిన సర్వేలో గ్రామీణ ప్రాంతాలలో 93 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు ఉన్నాయంటున్నారు. వీటిలో 96.5 శాతం మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అంటే 90.7 శాతం గ్రామాలలో బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన ఆగిపోయినట్టే.

అయితే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2017-18 నాటి నివేదికలో బహిరంగ మల విసర్జన ఆగిపోయిందన్న వాదనపై ప్రశ్నలు లేవనెత్తింది. స్వచ్ఛ భారత్ వల్ల ఫలితం ఉందనడాన్ని సవాలు చేసింది. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఈ మరుగుదొడ్లు నిర్మించారు. బహిరంగ మల విసర్జన లేదు అని తేల్చడానికి స్వచ్ఛ భారత్ పథకంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఏమీ లేవు.

బేటీ బచావో-బేటీ పఢావో పథకంలో ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఉదాహరణకు బేటీ బచావో-బేటీ పఢావో పథకం కింద బీజేపీ హయాంలో రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లాలో బాలికలు చదువుకోవడానికి పాఠశాలల్లో అవసరమైన ఉపాధ్యాయుల శిక్షణ, మరుగుదొడ్లు, బడికెళ్లడానికి రవాణా సదుపాయాలు కల్పించిన దాఖలాలు కనిపించలేదు.

2016-17లో 56,038 మంది బాలికలు పాఠశాలల్లో చేరితే వీరి సంఖ్య 2018-19లో 95,469 కి పెరిగిందని చెప్పినా ఎంతమంది బాలికలు బడి మానేశారన్న లెక్కలు మాత్రం లేవు.

రాజస్థాన్ లో 2014 నుంచి బడి మానేస్తున్న బాలికల సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ఆ సమయంలో రాజస్థాన్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయిదింట ఒక వంతు పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేసింది. ఇలా విలీనం అయిన పాఠశాలలు దూరంగా ఉండి బాలికలు బడి మానేస్తున్నారు. సామాజిక-సాంస్కృతిక కారణాలవల్ల తల్లిదండ్రులు దూరంగా ఉన్న పాఠశాలలకు తమ పిల్లలను పంపించడానికి ఇష్టపడరు.

ఇలాంటి ఉదంతాలు ఉన్నప్పుడు ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చామని ఆర్థిక సర్వేలో చెప్పడం అనుమానాలకు దారి తీస్తోంది. ఒక వేళ మార్పులు ఏమైనా ఉంటే అవి పై మెరుగులు మాత్రమే. ఇవి ప్రారంభోత్సవాలకు, కేకులు కోయడానికి, సర్టిఫికేట్లు పంచడానికి, పోటీలు, మోటారు సైకిల్ ర్యాలీలు నిర్వహించడానికి మాత్రమే పరిమితం. అసలైన మార్పులు తీసుకు రావడానికి నికరంగా తీసుకున్న చర్యలు ఏమీ లేవు.

అలాంటప్పుడు ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేశామని చెప్పుకోవడం రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప మరేమిటి? బాలికల మీద సామాజిక-సాంస్కృతిక ఆంక్షలు ఉన్నప్పుడు బేటీ బచావో-బేటీ పఢావో పథకం కింద వారికి సైకిళ్లు అందజేస్తే ఫలితం ఏమిటి? ఆ సైకిళ్లు ఆ బాలికల ఇంట్లోని అబ్బాయిలకు ఉపయోగపడవచ్చు. వారు రాజకీయంగా ఎటు వేపు ఉండాలో నిర్ణయించుకోవడానికి తోడ్పడవచ్చు.

భారత్ లాంటి దేశంలో ప్రవర్తనా ధోరణులు సామాజిక-సాంస్కృతిక నియమాల మీద ఆధారపడి ఉంటాయి. బెంగాల్ లో కన్యాశ్రీ ప్రకల్ప పథకం కింద అమలు చేస్తున్న అంశాల వల్ల మౌలిక మార్పులు వచ్చే అవకాశమే లేదు. దీనివల్ల ప్రజల వ్యవహార సరళి భ్రష్టు పట్టే అవకాశమే ఎక్కువ.

వనరులు పరిమితంగా ఉండి, సామర్థ్యం తగ్గినప్పుడు “మనిషి”కి, “ఆర్థిక జీవికి” మధ్య తేడా గమనించడం కష్టం. క్షేత్ర స్థాయిలో సరైన అంచనా వేయడానికి అవకాశం లేనప్పుడు, ఆర్థిక అవకాశాలు పెంచడానికి తగిన ప్రణాళిక కొరవడినప్పుడు గుణాత్మకమైన మార్పు ఉంటుందనుకోలేం. చెప్పే మాటలన్నీ కేవలం వాగాడంబరం కింద మిగిలిపోక తప్పదు. ఈ ప్రభుత్వం తన క్రియా రాహిత్యాన్ని పడికట్టు పదాలతో ఎంత కాలం కప్పిపుచ్చగలుగుతుంది?

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Next Story