Telugu Global
Cinema & Entertainment

'బుర్రకథ' సినిమా రివ్యూ

రివ్యూ: బుర్రకథ రేటింగ్‌: 1.5/5 తారాగణం: ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీరాజ్‌ త‌దిత‌రులు సంగీతం:  సాయికార్తీక్‌ నిర్మాత: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌ దర్శకత్వం: డైమండ్ ర‌త్న‌బాబు కొన్ని కథలు చాలా బాగుంటాయి. కానీ అవి తెరపైకి వచ్చిన తర్వాత చూస్తే పెద్దగా ఆకట్టుకోవు. అరె.. ఈ కథను ఓ పెద్ద డైరక్టర్ హ్యాండిల్ చేస్తే బాగుండేదని… ఈ కథలో ఫలానా స్టార్ హీరో నటిస్తే అదిరిపోయేదనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. సరిగ్గా ఇదే […]

బుర్రకథ సినిమా రివ్యూ
X

రివ్యూ: బుర్రకథ
రేటింగ్‌: 1.5/5
తారాగణం: ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీరాజ్‌ త‌దిత‌రులు
సంగీతం: సాయికార్తీక్‌
నిర్మాత: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌
దర్శకత్వం: డైమండ్ ర‌త్న‌బాబు

కొన్ని కథలు చాలా బాగుంటాయి. కానీ అవి తెరపైకి వచ్చిన తర్వాత చూస్తే పెద్దగా ఆకట్టుకోవు. అరె.. ఈ కథను ఓ పెద్ద డైరక్టర్ హ్యాండిల్ చేస్తే బాగుండేదని… ఈ కథలో ఫలానా స్టార్ హీరో నటిస్తే అదిరిపోయేదనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. సరిగ్గా ఇదే కోవకు చెందిన సినిమా బుర్రకథ.

మనిషికి ఒక మెదడు మాత్రమే ఉంటుంది. అలాంటిది రెండు మెదళ్లతో ఓ మనిషి పుడితే ఎలా ఉంటుంది.. అతడు పెరిగి పెద్దయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు.. అలాంటి రెండు మెదళ్ల వ్యక్తి ప్రేమలో పడితే పరిస్థితేంటి లాంటి అంశాలు ఊహించుకుంటే చాలా బాగుంటాయి. మన ఊహాలకు కూడా అందని విధంగా సీన్స్ రాసుకోవచ్చు. స్క్రీన్ ప్లే పండించుకోవచ్చు. కానీ బుర్రకథ విషయంలో ఈ రెండూ కనిపించలేదు. ఫలితంగా ఇది బుర్రలేని కథగా తయారైంది.

అభిరామ్ పైకి ఒకేలా కనిపిస్తాడు. కానీ అతడికి రెండు బ్రెయిన్స్ ఉంటాయి. ఆ విషయాన్ని అతడి తల్లిదండ్రులు చిన్నప్పుడే గ్రహిస్తారు. అందుకు తగ్గట్టే మెదడు పనిచేసే విధానం బట్టి అతడ్ని అభిగా, రామ్ గా పిలవడం మొదలుపెడతారు. అలా రెండు షేడ్స్ తో పెరిగి పెద్దవుతాడు అభిరామ్. అభి ఆవారా. రామ్ మాత్రం బుద్ధిమంతుడు. ఇలాంటి రెండు విరుద్ధమైన వ్యక్తిత్వాలు కలిసి ఉండే అభిరామ్ (ఆది సాయికుమార్).. హ్యాపీని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ తన రెండు బ్రెయిన్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అదే సమయంలో అభి చేసిన ఓ పని వల్ల రామ్ ఇబ్బందుల్లో పడతాడు. అదే సమయంలో రామ్ చేసిన తింగరి పనివల్ల అభి కూడా ఇబ్బంది పడతాడు.

ఫలితంగా ఇది వాళ్ల కుటుంబాలకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో అభి, రామ్ అనే వ్యక్తిత్వాలు కలిశాయా లేదా.. తమ ప్రేమను సొంతం చేసుకున్నాయా లేదా అనేది బుర్రకథ స్టోరీ.

ఇలా 5 వాక్యాల్లో చెప్పకుంటే బుర్రకథ స్టోరీ చదువుకోడానికి బాగా అనిపించొచ్చు. కానీ దీన్ని 2గంటల 6 నిమిషాల నిడివిలో సరిగ్గా చూపించలేకపోయాడు కొత్త దర్శకుడు డైమండ్ రత్నబాబు.

రన్ టైమ్ చూస్తే 2 గంటల 6 నిమిషాలు తక్కువే అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ చూస్తే మరో 20 నిమిషాలు తగ్గించినా తప్పులేదనిపిస్తుంది. అంతలా స్క్రీన్ ప్లేను సాగదీసి పడేశారు. నిజానికి ఇలాంటి క్లిష్టమైన కథను వినోదాత్మకంగా చెప్పడానికి ప్రయత్నించడం మంచిదే. కానీ ఆ వినోదం పాళ్లు శృతిమించడంతో బుర్రకథ బుర్రతినేసింది. అక్కడక్కడ కామెడీ పండినా క్లైయిమాక్స్ కు వచ్చేసరికి ఇక చాల్లే అనిపిస్తుంది.

ఇక్కడ హీరో ఆది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నటులు ఎవరైనా తమ టాలెంట్ ను ఎలివేట్ చేసే పాత్రలు చేయాలనుకుంటారు. అలాంటి సువర్ణావకాశమే ఆదికి వచ్చింది. కానీ ఆది మాత్రం ఆ ఛాన్స్ ను చెడగొట్టుకున్నాడు. ఎలాంటి హోమ్ వర్క్ లేకుండా అభిరామ్ పాత్రను పోషించాడు. యాక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్న తండ్రి సాయికుమార్ సలహాలు తీసుకున్నా సరిపోయేది.

ఒకే సినిమాలో ఇటు క్లాస్, అటు మాస్ గా కనిపించే రెండు క్యారెక్టర్లు దొరకడం నిజంగా అదృష్టం. రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి చేసిన పాత్రలాంటిదే బుర్రకథలో ఆది పాత్ర కూడా. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఆది. తన వంతు ప్రయత్నం చేయలేకపోయాడు. యాక్టింగ్ ను పక్కనపెడితే, కనీసం మేకోవర్ లో కూడా మాస్-క్లాస్ పాత్రల మధ్య తేడా చూపించలేకపోయాడు. ఈ విషయంలో దర్శకుడ్ని కూడా నిందించాలేమో.

హీరోయిన్లకు ఈ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. అయినప్పటికీ ఇద్దర్ని తీసుకున్నారు. ఉన్నంతలో మిస్తీ చక్రవర్తి అందంగా కనిపించింది. 2 సన్నివేశాల్లో నటనతో కూడా ఆకట్టుకుంది. నైరా షా యాక్టింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈమె కోసం రాసిన సన్నివేశాలు, మధ్యలో వచ్చే నైరా షా తల్లిపాత్ర అయితే అరాచకం. కేవలం కామెడీ కోసమే ఇదంతా అని సరిపుచ్చుకోవడానికి కూడా వీల్లేకుండా ఉంది ఆ ఎపిసోడ్. ఇక ఇతర పాత్రల విషయానికొస్తే ఎప్పట్లానే రాజేంద్రప్రసాద్, పోసాని తమ సీనియారిటీ చూపించారు. పృధ్వి పంచ్ లు పేలలేదు. అభి ఫ్రెండ్ గా గాయత్రి గుప్తాను ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి.

టెక్నికల్ గా కూడా బుర్రకథకు ఎలాంటి సపోర్ట్ దక్కలేదు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడ మాత్రమే మెరిసింది. మ్యూజిక్ డైరక్టర్ సాయికార్తీక్ ఆకట్టుకోలేకపోయాడు. ఒక్క పాట కూడా బాగాలేదు. నేపథ్య సంగీతం అంతంతమాత్రం. దీపాల ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. ఈ కథపై వాళ్లు చాలా నమ్మకం పెట్టుకున్నారనే విషయం సినిమా ప్రొడక్షన్ చూస్తే అర్థమౌతుంది.

ఓవరాల్ గా బుర్రకథ సినిమా కామెడీ పరంగా మెప్పించినా, అడపాదడపా వచ్చే కామెడీ సీన్ల కోసం 2 గంటల పాటు ఈ సినిమాను భరించడం కాస్త కష్టమైన పని. రత్నబాబు రాసుకున్న కథనంలో గ్రిప్ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. కామెడీని అలాగే ఉంచి, సన్నివేశాల్ని మరో విధంగా రాసుకొని ఉండుంటే సినిమా రిజల్ట్ బాగుండేదేమో. దీనికితోడు పెద్దగా ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ లు కూడా లేకపోవడం బుర్రకథకు మైనస్.

First Published:  5 July 2019 5:29 AM GMT
Next Story