Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యం

రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికి తలమానికం కావాలి. ఆ దిశగా రెండు రాష్ట్రాల అధికారులు పని చేయాలి అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. 5 గంటలకు పైగా జరిగిన ఈ […]

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యం
X

రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికి తలమానికం కావాలి. ఆ దిశగా రెండు రాష్ట్రాల అధికారులు పని చేయాలి అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.

5 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్న జల వివాదాల పై చర్చించిన ముఖ్యమంత్రులు వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తెలుగు రాష్ట్రాలకు జీవనదులు అయిన కృష్ణా, గోదావరి నదులను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని, ఇందు కోసం ప్రణాళికలు రచించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ లకు గోదావరి జలాలను తరలించడంపై అధ్యయనం చేయాలని, దీనిపై జూలై 15వ తేదీలోగా నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ముఖ్యమంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు మంత్రులు, తెలంగాణ నుంచి నలుగురు మంత్రులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతి లక్ష్యంగా ఎలా పనిచేయాలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారని, తెలుగు రాష్ట్రాలు దేశానికే తలమానికంగా మారాలని వారిద్దరూ ఆకాంక్షించారు అని మంత్రులు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు పెండింగ్ లో పడ్డాయని, త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లుగా మంత్రులు ఈటల, బుగ్గన తెలిపారు. జల వివాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ ప్రగతి కుంటుపడుతోందని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ అభిప్రాయపడ్డారని మంత్రులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ తరచుగా సమావేశమవుతారని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారని మంత్రులు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిల వివాదం తో పాటు ఉద్యోగుల సమస్యలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించారని, ఈ రెండు సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం దొరుకుతుందని మంత్రులు ఈటల, బుగ్గన ఆకాంక్షించారు.

అంతకుముందు సమావేశంలో పాల్గొనేందుకు ప్రగతి భవన్ కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. జగన్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువా కప్పి కేసీఆర్ ఆలింగనం చేసుకున్నారు.

First Published:  28 Jun 2019 8:35 PM GMT
Next Story