Telugu Global
NEWS

కష్టాలు తీరాలంటే హోదా ఇవ్వాల్సిందే.... ఏపీ సీఎం జగన్

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాలలోనూ వెనుకబడి పోయిందని, దీనిని అధిగమించి అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నీతి అయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సమస్యలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లోనూ వెనుకబడి పోయిందంటూ… ఈ అంశాన్ని […]

కష్టాలు తీరాలంటే హోదా ఇవ్వాల్సిందే.... ఏపీ సీఎం జగన్
X

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాలలోనూ వెనుకబడి పోయిందని, దీనిని అధిగమించి అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నీతి అయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు.

శనివారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సమస్యలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లోనూ వెనుకబడి పోయిందంటూ… ఈ అంశాన్ని లెక్కలతో సహా వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల జరిగిన నష్టాలను, హోదా ఇస్తే సమకూరే మేళ్లను సమగ్రంగా వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు లక్షా 18 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, అదే ఆంధ్రప్రదేశ్ కు 66 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చెప్పారు.

గడచిన ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, విభజన నాటికి రాష్ట్రం అప్పు 97 వేల కోట్ల రూపాయలు ఉందని… ఈ ఐదేళ్ళలో చంద్రబాబు మరో లక్షా 20 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశాడని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. ప్రతి ఏటా తీసుకున్న అప్పుకు వడ్డీ కింద 20 వేల కోట్ల రూపాయలు, అసలు రూపంలో మరో 20 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పై భారతీయ జనతా పార్టీ కూడా తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, గత ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ తొలి సమావేశం ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు.

హోదా అంశాన్ని కేంద్రం రద్దు చేయలేదని ప్లానింగ్ కమిషన్ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను నీతి అయోగ్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన వినతి పత్రంతో పాటు జత చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, ఇక్కడ ఉపాధి దొరకకపోవడంతో యువత వలస బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం 14, 414 ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం ఎనిమిది వేల 397 రూపాయలు మాత్రమే ఉందని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికీకరణ నిలిచిపోయిందని, గత అయిదేళ్లలో ప్రగతి అన్నదే లేకుండా పోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో చేతివృత్తుల వారికి ఉపాధి లేకుండా పోయిందని, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

First Published:  15 Jun 2019 9:42 PM GMT
Next Story