Telugu Global
NEWS

రైతులకు వడ్డీలేని రుణాలిస్తాం " గవర్నర్

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీంతో పాటు బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటు పడుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ అన్నారు. శుక్రవారం ఉదయం అమరావతిలోని శాసనసభలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి మాట్లాడారు. టెండర్లలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తోందని గవర్నర్ సభ్యులకు తెలిపారు. “వివిధ పనుల టెండర్ ల అంశంలో కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటాం. అవసరమైతే రివర్స్ టెండరింగ్ […]

రైతులకు వడ్డీలేని రుణాలిస్తాం  గవర్నర్
X

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీంతో పాటు బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటు పడుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ అన్నారు.

శుక్రవారం ఉదయం అమరావతిలోని శాసనసభలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి మాట్లాడారు. టెండర్లలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తోందని గవర్నర్ సభ్యులకు తెలిపారు. “వివిధ పనుల టెండర్ ల అంశంలో కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటాం. అవసరమైతే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ కూడా చేపడతాం ” అని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని, గ్రామ కార్యదర్శుల ద్వారా సుపరిపాలన అందిస్తామని చెప్పారు. నవరత్నాలు పేరుతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని విధాల మంచి పాలన అందిస్తుందని ఆయన అన్నారు.

” ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి నవరత్నాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అని గవర్నర్ ప్రకటించారు. వీటితో పాటు రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని, అక్టోబర్ నెల నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు గవర్నర్ ప్రకటించారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు, ఉచితంగా బోర్లు వేయిస్తామని అన్నారు. రైతు భరోసా కింద రైతులకు ఏటా 12,500 రైతు భరోసా ఇస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, అలాగే జలయజ్ఞంతో అన్ని ప్రాజెక్టులను సమయం కంటే ముందే పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామన్నారు. అలాగే తమ ప్రభుత్వం ప్రజారోగ్యంపై అత్యంత శ్రద్ధ కనపరుస్తుందని, కిడ్నీ, తలసీమియా రోగులకు పది వేల రూపాయల ఫించను అందజేస్తామని గవర్నర్ ప్రకటించారు.

రాష్ట్రంలో చిన్నారుల విద్యకు సంబంధించి అంత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. “చిన్నారుల చదువు విషయంలో తల్లిదండ్రులు కలత చెందాల్సిన అవసరం లేదు. పిల్లలను బడికి పంపితే తల్లులకు ఏటా 15 వేల రూపాయలు ఇస్తాం” అని గవర్నర్ చెప్పారు. విభజన బిల్లులో పొందుపరిచిన హామీలన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. కాపు కార్పొరేషన్ కు రానున్న ఐదేళ్లలో పది వేల కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికి ఇళ్లు కట్టిస్తామని, తొలి విడతలో 25 వేల ఇళ్లు కట్టించి అర్హులైన వారికి ఇస్తామన్నారు.

First Published:  13 Jun 2019 11:57 PM GMT
Next Story