Telugu Global
NEWS

అధికార పార్టీ హత్యా రాజకీయాలు : జి.కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

“తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. మహబూబ్ నగర్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్ హత్య ఆ కోణంలో జరిగిందే. దీనిపై రాష్ట్ర పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి” ఇవి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డికి పార్టీ […]

అధికార పార్టీ హత్యా రాజకీయాలు : జి.కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

“తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. మహబూబ్ నగర్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రేమ్ కుమార్ హత్య ఆ కోణంలో జరిగిందే. దీనిపై రాష్ట్ర పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి” ఇవి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు.

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డికి పార్టీ నేతలు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా అధికార పార్టీ హత్యా రాజకీయాలకు కూడా పాల్పడుతోందంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు.

దేశంలో ఎక్కడ టెర్రరిస్టు చర్యలు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి పార్టీ అధిష్టానం నుంచి కూడా మొట్టికాయలు తిన్నారు. మళ్లీ కేంద్ర మంత్రిగా తొలిసారి హైదరాబాద్ వచ్చిన కిషన్ రెడ్డి ఇక్కడ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

గత 16 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పని చేసిన తనకు పార్టీ ఇచ్చిన గౌరవమే కేంద్ర మంత్రి పదవి అని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరూ తన ఎదుగుదలకు ఎంతో సహకరించారని, శాసనసభకు తనను ఎన్నుకున్న ప్రజలు లోక్ సభకు కూడా పంపారని చెప్పారు.

“నా ఎదుగుదలకు పార్టీ నాయకులు ఎందరో సహకరించారు. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ నా ఎదుగుదలకు ఎంతో సహకరించారు ” అని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో తీవ్రవాద సమస్యని సంపూర్ణంగా, సమూలంగా నిర్మూలించడమే ప్రధాని మోదీ లక్ష్యమని, క్యాబినెట్ సహచరులంతా ఇందుకోసం పని చేస్తారని కిషన్ రెడ్డి అన్నారు.

2024లో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి గోల్కొండ కోట మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగుర వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుపతి రానుండడంతో కిషన్ రెడ్డి కూడా తిరుపతి పయనమవుతున్నారు. అక్కడ జరిగే సభలో పాల్గొన్న అనంతరం కిషన్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు.

First Published:  7 Jun 2019 11:56 PM GMT
Next Story