Telugu Global
NEWS

గురుశిష్యుల చేతిలో ఏపీ పోలీస్..!

వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం పరిపాలనలో సమూలంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిపాలనకు ముఖ్యమైన బ్యూరోక్రాట్ల వ్యవస్థలో సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలు కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పటికే సీఎస్‌గా నమ్మకస్తుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉండటంతో ఆయనను మార్చే యోచనలో జగన్ లేరు. కానీ పోలీసు వ్యవస్థలో మాత్రం సమూల మార్పులు తీసుకొని వస్తున్నారు. ఎంతగా అంటే తన తండ్రి ఎంతో నమ్మిన ఇద్దరు అధికారుల చేతుల్లో ఏపీ పోలీస్ వ్యవస్థను మొత్తం పెట్టేస్తున్నారు. […]

గురుశిష్యుల చేతిలో ఏపీ పోలీస్..!
X

వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం పరిపాలనలో సమూలంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిపాలనకు ముఖ్యమైన బ్యూరోక్రాట్ల వ్యవస్థలో సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలు కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పటికే సీఎస్‌గా నమ్మకస్తుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉండటంతో ఆయనను మార్చే యోచనలో జగన్ లేరు. కానీ పోలీసు వ్యవస్థలో మాత్రం సమూల మార్పులు తీసుకొని వస్తున్నారు. ఎంతగా అంటే తన తండ్రి ఎంతో నమ్మిన ఇద్దరు అధికారుల చేతుల్లో ఏపీ పోలీస్ వ్యవస్థను మొత్తం పెట్టేస్తున్నారు. వారిద్దరూ గురు శిష్యులు కావడం విశేషం.

ఏపీ డీజీపీగా దామోదర గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తెలంగాణ క్యాడర్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్రలను నియమించుకోనున్నారు. గౌతమ్ సావంగ్‌కు సంబంధించిన విషయం ఇప్పటికే నిర్ణయించబడగా…. రవీంద్ర విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంది. అయితే మొన్నటి కేసీఆర్, జగన్ భేటీలో ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఏ రాష్ట్ర శాంతి భద్రతలు, ముఖ్యమంత్రి భద్రతకు అయినా ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు అతి కీలకం. మావోయిస్టులు, సంఘవిద్రోహ శక్తుల వంటి వారికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని సీఎంకు తెలియజేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ చీఫ్ దే.

ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించబడనున్న స్టీఫెన్ రవీంద్ర ఒకప్పుడు గౌతమ్ సవాంగ్ వద్ద పని చేసిన వ్యక్తి కావడం విశేషం. వరంగల్‌ రేంజ్ డీఐజీగా గౌతమ్ సవాంగ్ ఉన్న కాలంలోనే స్టీఫెన్ రవీంద్ర వరంగల్ ప్రాంతంలో తన కెరీర్ ప్రారంభించారు. అప్పటి డీజీపీ స్వర్ణజీత్ సేన్, డీఐజీ గౌతమ్ సవాంగ్, ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర లు కలిసి ఉత్తర తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు.

గ్రేహౌండ్స్‌ను లీడ్ చేసిన స్టీఫెన్ రవీంద్రకు పలు సూచనలు, సలహాలు అందించింది గౌతమ్ సవాంగ్ అని డిపార్ట్‌మెంట్లో చెప్పుకుంటారు. గౌతమ్ సవాంగ్ తీర్చిదిద్దిన ఐపీఎస్ అధికారుల్లో ముఖ్యులు ఉమేష్ చంద్ర, స్టీఫెన్ రవీంద్ర ఉండటం గమనార్హం. రాష్ట్ర విభజన తర్వాత గౌతమ్ సవాంగ్ ఏపీ క్యాడర్‌నే ఉంచుకోగా.. స్టీఫెన్ రవీంద్ర మాత్రం తెలంగాణ క్యాడర్‌ను ఎంచుకున్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో ఒకప్పటి ఉస్మానియా విద్యార్థి అయిన స్టీఫెన్ రవీంద్ర ఏకంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై అణిచివేతకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన స్టీఫెన్ రవీంద్ర.. ఐపీఎస్ ట్రైనింగ్ కూడా హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో పూర్తి చేశారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు.

First Published:  27 May 2019 5:30 AM GMT
Next Story