Telugu Global
Others

తిరుగుబాటు కవితాఝరి విద్రోహి

మూడున్నరేళ్ల కింది దాకా దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్.యు.) ప్రాంగణంలోని తుప్పల్లో, చెట్ల కింద – చిరిగిన, మురికి బట్టలు వేసుకుని బక్క పలచని ఓ మనిషి తిరుగుతూ ఉండేవాడు. ఆయనను చూస్తే బిచ్చగాడేమో అనుకునేవారు. కాదు. ఆయన ప్రసిద్ధ హిందీ కవి విద్రోహి. అది ఆయన కలం పేరు. కొంతమంది తమ అసలు పేరుకన్నా కలం పేరుతోనూ, మారుపేరుతోనో ప్రసిద్ధులవుతారు. అసలు పేరేమిటో చాలా మందికి తెలియకపోవచ్చు. విద్రోహి అసలు పేరు రమాశంకర్ యాదవ్. […]

తిరుగుబాటు కవితాఝరి విద్రోహి
X

మూడున్నరేళ్ల కింది దాకా దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్.యు.) ప్రాంగణంలోని తుప్పల్లో, చెట్ల కింద – చిరిగిన, మురికి బట్టలు వేసుకుని బక్క పలచని ఓ మనిషి తిరుగుతూ ఉండేవాడు. ఆయనను చూస్తే బిచ్చగాడేమో అనుకునేవారు. కాదు. ఆయన ప్రసిద్ధ హిందీ కవి విద్రోహి. అది ఆయన కలం పేరు. కొంతమంది తమ అసలు పేరుకన్నా కలం పేరుతోనూ, మారుపేరుతోనో ప్రసిద్ధులవుతారు. అసలు పేరేమిటో చాలా మందికి తెలియకపోవచ్చు.

విద్రోహి అసలు పేరు రమాశంకర్ యాదవ్. ఆయన ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పుర్ పట్టణంలో 1957 డిసెంబర్ 3న జన్మించారు. ఉత్తరప్రదేశ్ లో ఆయన ఎల్.ఎల్.బి. చదువుతూ ఉండేవారు. విద్యార్థి రాజకీయాల్లో పాల్గొన్నందుకు ఆయనను కళాశాల నుంచి తొలగించారు. ఆ తరవాత దిల్లీలోని జె.ఎన్.యు.లో ఎం.ఎ. హిందీ చదివారు. పిహెచ్ డి విద్యార్థిగా ఉండే వారు. విద్యార్థుల ఉద్యమంలో పాల్గొన్నందుకు 1983లో అక్కడి నుంచీ బహిష్కరించారు. చదువుకు ఆటంకం కలిగినా కడ దాకా ఆయన ఆ ప్రాంగణాన్నే అంటిపెట్టుకుని ఉన్నారు.

రమా శంకర్ యాదవ్ కు చిన్నతనంలోనే శాంతిదేవితో పెళ్లి అయింది. ఇల్లూ వాకిలీ వదిలేసి ఆయన జె.ఎన్.యు. చేరారు. విద్రోహీ తనకు నచ్చినట్టు బతికారు. “ఏమీ వద్దనుకునే వాడే అసలైన రాజు” అన్న కబీర్ మాటలు విద్రోహీకి అతికినట్టు సరిపోతాయి. ఆయన అన్నీ త్యజించారు. తన ఆలోచనాధోరణిని, పేదల విషయంలో ఆవేదన పడడాన్ని, ఆ ఆవేదనను కవిత్వ రూపంలో వెల్లడించడం తప్ప అన్నీ వదులుకున్నారు. మర్యాదస్థుడిలా ఏ మాత్రం కనిపించని విద్రోహి నిత్య విద్యార్థి.

ఇమాన్యుయల్ కాంట్ గురించి గంటల తరవడి మాట్లాడే గలిగేవారంటే ఆయన ఎంత అధ్యయనశీలో అర్థం చేసుకోవచ్చు. ఆయన మాటలు, వేషధారణ, గొంతు, చూపులు, ఆయన లేవనెత్తే అంశాలు, ఆయన ప్రస్తావించే అంశాలు ఏవీ మర్యాదస్థుడు అనుకోవడానికి ఉపకరించేవి కాదు. ఆయన జీవన శైలిలాగే ఆయన ఆలోచనా ధోరణి, దృక్పథం కూడా విశిష్టమైనవి, విభిన్నమైనవి.

ఆయన కవితా పఠనానికి కవి సమ్మేళనాలు, సభలు వేదికలు కావు. రిక్షా కార్మికులు, శ్రమజీవులు, పాకీ పనివాళ్లు, చాయ్ అమ్మే వాళ్లు ఆయన కవిత్వానికి శ్రోతలు. జె.ఎన్.యు.లోని గ్రంథాలయ్ పరిసారాలు, గంగా ధాభా లాంటి ధాబాల దగ్గర గుమిగూడే విద్యార్థులే ఆయన కవిత్వాన్ని ఆస్వాదించే వారు.

తన కవిత్వానికి ఆయన ఎన్నడూ లిఖిత రూపం ఇవ్వలేదు. కాగితం మీద పెట్టలేదు. ఆయన కవిత్వం రాయలేదు. చెప్పారు. పనిగట్టుకుని కవితలల్ల లేదు. ఆయనలోని ఆవేశాగ్ని, భవిష్యత్తు మీద ఆశ, గాఢమైన ప్రజాస్వామ్య కాంక్ష, జన జీవిత నిశిత పరిశీలన పర్యవసానంగా పేరుకుపోయిన ఆర్తి కవితా రూపంలో పెల్లుబికింది.

అలాంటప్పుడు తన కవిత్వాన్ని భద్రపరచుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది? కవి సమ్మేళనాల్లో విద్రోహి పాల్గొనకపోలేదు. కాని ఆ కరపత్రాలలో, ఆహ్వాన పత్రికలలో, పోస్టర్లలో ఆయన పేరు ఎన్నడూ ఉండేది కాదు. అయినా అక్కడికెళ్లి ఏదో మూల నిలబడే వారు. ఆయనను ఆహ్వానిస్తే కవిత్వం వినిపించే వారు. అంతిమంగా ఆయన కవితే జనాన్ని ఆకర్షించేది. అందరిలోకీ విశిష్టమైన కవి అనిపించుకునే వారు. అలాగని విద్రోహి సగటు ఆశు కవి కారు. ఆశువుగా కవిత చెప్పినా దాని వెనక నిశిత సమాజ పరిశీలన, ఆర్తి, పేదల విషయంలో బాధ, సమాజంలోని ఎగుడుదిగుళ్లపై ఆవేదన కలగలసి బలమైన కవితా పాదాలు ఆయన నోటంట ప్రవహించేవి.

ఆయన నిరీశ్వర వాది. ఈ విషయంలో ఆయన కబీర్ కన్నా ఓ అడుగు ముందే ఉండే వారు.

“నా తల పగలగొట్టండి

నా నడ్డి విరిచేయండి

కానీ నా హక్కుల్ని

వదులుకోవాలని మాత్రం చెప్పొద్దు” అనే వారు.

కుల వివక్షను, బ్రాహ్మణీకాన్ని, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలను ప్రశ్నించే వారు. తన కవితల ద్వారా మహిళల పక్షాన పోరాడే వారు.

నూతుల్లో దూకి, చితిమంటల్లో దూకి

ఆహుతైన మహిళలందరినీ

మళ్లీ బతికిస్తాను నేను.

ఎక్కడైనా తేడా కనిపిస్తే

వాళ్ల మరణ వాంగ్మూలాలు తిరగ రాయిస్తా

ఎక్కడో ఏదో తప్పిపోయిందేమో చూస్తాను.

ఎక్కడో తప్పు జరిగిందో కనిపెడ్తానుఅనడంలో మహిళలపట్ల విద్రోహీ ఆవేదన లోతులు గ్రహించవచ్చు. మహిళలను అణచివేయడానికి మతం కారణమని నమ్మే వారు.

“నాగరికతా సౌధం ప్రతి మెట్టు మీద

దహించుకు పోయిన ఒక మహిళ కళేబరం ఉంది

ప్రతి సంస్కృతి ముసుగులో విరిగిన

మనుషుల ఎముకలున్నాయి.

ఆ కళేబరం కాలిపోలేదు, కాల్చారు.

అగ్గి అంటుకోలేదు, అగ్గి పెట్టారు.

యుద్ధం మొదలు కాలేదు, ఎవరో అది రాజేశారు.”

ఓ మానవులారా!

ఈ కవితా జ్వాలల నుంచి

ఏ రక్తపు మడుగుల లోంచి

పిరమిడ్లు, మీనార్లు, దీవార్లు

తయారయ్యాయో

నన్ను రక్షిస్తే మొహంజోదారో

తటాకపు ఆకరి మెట్టుపై

శవమై పడి ఉన్న స్త్రీని రక్షించినట్టే.

మహిళల గురించి విద్రోహీకి ఉన్న గాఢమైన అవగాహన ఈ కవితా పాదాల్లో ప్రస్ఫుటమవుతోంది.

విద్రోహీ అసమానతలను, యుద్ధాన్ని నిరసించారు. ఆయన కవితల్లో కనిపించే మనుషులు అణగారిన వర్గాల వారు. అణచివేతకు గురైన వారు. ఆయన మతోన్మాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారు. ఆయన కవితా వస్తువు విస్తృతమైంది, సమగ్రమైంది, సరిహద్దులు పాటించనిది. ఆయన ఏం రాశారో అలాగే బతికారు.

తన కవిత్వం అచ్చు కావాలని, బహుమానాలు, సత్కారాలు కావాలని ఎన్నడూ ఆశించలేదు. అందుకే ఆయన కవిత్వం ముచ్చటగా ముద్రించిన అట్టల మధ్యలో నిక్షిప్తమై, గ్రంథాలయాల్లో మిగిలిపోలేదు. జనం నాలుకల మీద నర్తించింది. ఆయన హిందీలోనే కాక అవధీలోను కవితలల్లారు.

కొంతమంది ఆయనను పిచ్చివాడనుకునే వారు. మతి చలించిన వాడిగా జమకట్టే వారు. కానీ ఆయన కవిత్వాన్ని అర్థం చేసుకున్నవారు ఆయన వేషధారణను, లోకాన్ని పట్టించుకోని తత్వాన్నిబట్టి కాక ఆయన కవిత్వంలోని సాంద్రతను, గాఢత్వాన్ని చూసి అభిమానించారు. ఆయన భావజాలానికి ముగ్ధులయ్యారు. ఆయన కవిత్వం లిఖిత సంప్రదాయానికి చెందింది కాదు కనక ఎంత గాలిలో కలిసిపోయిందో తెలియదు. ఆయన అభిమానులు, జె.ఎన్.యు. విద్యార్థులు అప్పుడప్పుడు రీకార్డు చేసిన, వీడియోల రూపంలో చిత్రించిన కొన్ని కవితలు కలిపి నయీ ఖేతీ సంకలనంగా వెలువరించారు. ఆయన కవిత్వమంతా ఈ సంకలనంలో ఉందని చెప్పలేం.

గ్వాలియర్ కు చెందిన సినీ దర్శకుడు నితిన్ పమ్నానీ విద్రోహి జీవితాన్ని “మై తుమ్హారా కవి హూ” (నేను మీ కవిని) పేర 2011లో వెండి తెరకు ఎక్కించారు. ఇది 42 నిముషాల డాక్యుమెంటరీ. ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమాకు లఘు చిత్రాలలో బహుమతి వచ్చింది. ఈ సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు దర్శకుడు నితిన్ కు విద్రోహి ఓ విన్నపం చేశారు.

నేను మా ఆవిడ మెట్లెక్కుతున్నట్టు అప్పుడు నేను ముందు నడుస్తున్నట్టు, మెట్లు దిగుతున్నప్పుడు ఆమె ముందు నడుస్తున్నట్టు చిత్రీకరించండి అని కోరారు. ఈ చిత్రానికి బహుమతిలో భాగంగా కొంత డబ్బు వస్తే పమ్నానీ అది విద్రోహీకి ఇచ్చారు. వెంటనే ఆయన తన భార్య చేతిలో పెట్టారు.

ఈ చిత్రంలో ఆయన “విద్రోహి జీవితం అరాచకంగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఎవరి జీవితమూ నాకన్నా క్రమశిక్షణాయుతమైంది కాదు. నేను కచ్చితమైన క్రమశిక్షణ పాటిస్తాను. నా క్రమ శిక్షణ అంతర్జాతీయమైంది. అది అంతర్జాతీయ భావజాలానికి సంబంధించింది” అంటారు. ఆయన ఆగ్రహం వ్యక్తుల మీద కాదు. కుళ్లిన వ్యవస్థ మీదే. ఆయనకు ఏ మాత్రం నచ్చనివి ఆర్.ఎస్.ఎస్., కుల వ్యవస్థ.

ఆయన కవితా వస్తువులో స్పృశించని అంశమే లేదు. ప్రాచీన నాగరికత, యుద్ధంలో మరణించే పలస్తీనా బాలలు, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, లాటిన్ అమెరికాలోని కార్మికులు సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ శక్తులను ఎదిరించడం మొదలైనవన్నీ ఆయన నోట ఉత్తమ కవితలయ్యాయి.

ఎక్కడ నిరసన వ్యక్తమైనా విద్రోహీ అక్కడ ప్రత్యక్షమయ్యే వారు. అందులో భాగస్వామి అయి కవిత్వం వినిపించే వారు. ఆయన నిఖార్సైన కమ్యూనిస్టుగా బతికారు. అలాగని ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడని కాదు. బెర్త్రోల్ బ్రెహ్ట్ చెప్పినట్టు “కమ్యూనిజం వెర్రి కాదు. అది వెర్రికి అంతం” అనే వారు. అన్ని ప్రగతిశీల ఉద్యమాలలో ఆయన పాత్ర ఉంది.

వామపక్ష ఉద్యమాలు ఎలా ఉండాలో తన జీవిత విధానం ద్వారా నిరూపించారు. ఆ రోజు ఇంకా రావలసే ఉందన్నది వేరే విషయం. ఆయన బతకడానికి దుర్భరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అదే బాటలో నడిచారు. ఆయన కవిత్వం, అప్పుడప్పుడు చేసిన ప్రసంగాలు ప్రగతిశీల, వామపక్ష భావజాలంతో తొణికిసలాడేవి. ఆయన జీవితం నిజమైన విప్లవకారుడికి ప్రతీక. నిరాడంబరత, వినమ్రత జీర్ణించుకున్న వ్యక్తిత్వం ఆయనది. దోపిడీ వ్యవస్థలను, విధానాలను జీవితమంతా వ్యతిరేకించారు. ఆయన మనస్సు ఎప్పుడూ చరిత్ర చుట్టూ పరిభ్రమించేది. నిజానికి అదే భవిష్యత్తుకు మార్గదర్శి. విద్వేషం పడగ విప్పుతున్న సమయంలో ఆయన జీవించారు. కవిత్వాన్ని ఆయుధం చేసుకుని దానికి వ్యతిరేకంగా పోరాడారు.

లోకం ఎంత అస్తవ్యస్తమైందో, క్రూరమైందో ఆయనకు తెలుసు. ఆయన నిరుపేదగా పుట్టలేదు. జీవితాన్ని సుఖంగా గడపగలిగిన కుటుంబంలోనే పుట్టారు. కానీ పీడితుల పక్షాన నిలవాలన్న ఆకాంక్ష కారణంగా అన్నింటినీ త్యజించి బతికారు. జె.ఎన్.యు. చెట్ల కింద ఆయన గడిపిన మూడు దశాబ్దాలూ ఆయనకు ఆదాయం లేదు. అయితే ఆయనను అభిమానించే వారు ఆయన బాగోగులు చూశారు. చాయ్ ఇప్పించారు. భోజనం పెట్టించారు. వస్త్రాలు కొని పెట్టారు. ఆయన వామపక్ష విద్యార్థుల నుంచే సహాయం అంగీకరించే వారు కాని సంఘ్ పరివార్ కు చెందిన ఏ.బి.వి.పి. విద్యార్థుల సహాయాన్ని నిరాకరించారు.

2015లో కన్హయా కుమార్ జె.ఎన్.యు. అధ్యక్షుడైనప్పుడు ఏ.బీ.వీ.పి.కి చెందిన ఒక అభ్యర్థి కూడా ఎన్నికయ్యారు. ఆ అభ్యర్థి మిఠాయి ఇస్తే తీసుకున్నారు. తరవాత కన్హయా కుమార్ కు ఈ విషయం చెప్పి వాళ్లిచ్చిన మిఠాయి తీసుకున్నాను. లేకపోతే చంపేస్తారనుకున్నాను అన్నారు. జె.ఎన్.యు.లో ఏ.బీ.వీ.పీ.కి స్థానం లేకుండా చేయవలసిన బాధ్యత వామపక్షాలదే అని హితవు పలికారు.

విశ్వ విద్యాలయం నుంచి బహిష్కరించినా విద్రోహీ ఆ చెట్ల కిందే గడిపారు. 2010లో ఆయనను విశ్వ విద్యాలయధికారులు గెంటేశారు. కానీ విద్యార్థుల ఒత్తిడివల్ల ఆయనను మళ్లీ అనుమతించవలసి వచ్చింది. కొంత కాలానికి ఆయన జె.ఎన్.యు. విద్యార్థి సంఘం కార్యాలయంలో పడుకునే ఏర్పాటు చేసారు.

ఏదో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ నిరసనలో పాల్గొంటూనే మరణిస్తాను అని 2013లో విద్రోహీ చెప్పారు. సరిగ్గా అలాగే జరిగింది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యు.జి.సి.) విద్యార్థుల ఉపకార వేతనాల్లో కోత పెట్టినప్పుడు 2015 డిసెంబర్ 8న విద్యార్థులు యు.జి.సి. భవనం దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. అక్కడే ఆయన కుప్ప కూలిపోయారు. ఆకలేస్తోంది అంటే విద్యార్థులు అన్నం పెట్టారు. ఛాతీలో నొప్పి అంటే అసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మరణించాడని డాక్టర్లు తేల్చారు.

విద్రోహీ కవిత్వం వింటే ఏదో రాజకీయ ఉద్యమంలో పాల్గొంటున్నట్టు ఉండేది. ఆయన కవిత్వం చదివితే చరిత్రలోకి తొంగి చూస్తున్నట్టుంటుంది. ప్రస్తుత సంస్కృతిని, రాజకీయాలను, భావ జాలాలను పరిశీలిస్తున్నట్టు ఉంటుంది. ఆయన ప్రతి కవితా ప్రజా పోరాటాల చిత్రణే.

ఆయన పార్థివ శరీరం చితిమంటలకు ఆహుతి అయింది. ఎగిసిపడిన ఆ చితి మంటలు ఆయన కవితా ఝరిలా కనిపించింది. ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ప్రకృతీ స్పందించి వర్షపు చినుకులు రాల్చింది. సజీవంగా ఉన్నప్పుడు ఆయన బాబా నాగార్జున్, గిరీశ్ తివారి గిర్దా బాటలో నడిచారు. మరణానంతరం విద్రోహీ బాట స్పష్టంగా ద్యోతకం అవుతోంది.

First Published:  15 May 2019 6:09 AM GMT
Next Story