Telugu Global
NEWS

రవిప్రకాష్‌ నన్ను మోసం చేశాడు " శివాజీ

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌ తనను మోసం చేశాడని సినీనటుడు శివాజీ ఈ ఏడాది ఏప్రిల్ 19 న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)ని ఆశ్రయించాడు. అయితే ఇదంతా ఒక డ్రామా అని…. కంపెనీలో 90శాతం వాటా కొనుగోలు చేసిన అలంద మీడియా చేతికి తన చేతినుంచి టీవీ9 పగ్గాలు పోకుండా టీవీ9 రవిప్రకాష్‌, నటుడు శివాజీతో కలిసి ఆడిన నాటకం అని అలంద మీడియా చెబుతోంది. కొత్త యాజమాన్యం చెబుతున్న వివరాలు ప్రకారం…. లా […]

రవిప్రకాష్‌ నన్ను మోసం చేశాడు  శివాజీ
X

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌ తనను మోసం చేశాడని సినీనటుడు శివాజీ ఈ ఏడాది ఏప్రిల్ 19 న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)ని ఆశ్రయించాడు. అయితే ఇదంతా ఒక డ్రామా అని…. కంపెనీలో 90శాతం వాటా కొనుగోలు చేసిన అలంద మీడియా చేతికి తన చేతినుంచి టీవీ9 పగ్గాలు పోకుండా టీవీ9 రవిప్రకాష్‌, నటుడు శివాజీతో కలిసి ఆడిన నాటకం అని అలంద మీడియా చెబుతోంది. కొత్త యాజమాన్యం చెబుతున్న వివరాలు ప్రకారం….

లా ట్రిబ్యునల్‌లో శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్‌ లో… ఏబీసీఎల్‌ లో రవిప్రకాశ్‌కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్‌కు 20 లక్షల రూపాయల డబ్బు చెల్లించి…. ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని…. కానీ రవిప్రకాష్‌ మాట నిలబెట్టుకోకుండా షేర్లను బదిలీ చేయలేదని శివాజీ ఆ అఫిడవిట్‌ లో పేర్కొన్నాడు.

అయితే, ఏబీసీఎల్‌లో మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలను తనవద్ద దాచాడని, రవిప్రకాష్‌ తనపట్ల మోసపూరితంగా వ్యవహరించాడని శివాజీ ఆరోపించాడు. షేర్ల బదిలీ గురించి తాను పలుమార్లు రవిప్రకాశ్‌కు గుర్తు చేసినా ఏదో ఒక సాకు చూపుతూ, షేర్లు బదిలీ చేయలేదని, దీంతో తాను విసిగిపోయి ఫిబ్రవరి 15, 2019న రవిప్రకాశ్‌కు స్వయంగా నోటీసు అందజేశానని శివాజీ ఎన్‌సీఎల్టీ వద్ద దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు.

దానికి రవి ప్రకాశ్‌ ఫిబ్రవరి 17న స్పందిస్తూ షేర్ల బదిలీలో జాప్యానికి లా ట్రిబ్యునల్‌ జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వు కారణమని, లా ట్రిబ్యునల్‌ లో ఉన్న ఈ వివాదం పరిష్కారం అయిన తర్వాత షేర్లు బదిలీ చేస్తానని సమాధానం ఇచ్చాడట.

రవిప్రకాశ్, శివాజీల మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం గమనార్హం. ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు. కానీ, శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగిస్తోంది. ఈ అనుమానాల వల్లే, శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరనట్లు చెబుతున్నది ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం భావిస్తోంది.

కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్, శివాజీతో కలిసి కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారని ఏబీసీఎల్‌ కొత్త యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది.

లా ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు ఎప్పుడో సెప్టెంబర్ 4, 2018లో వెలువడగా, ఈ విషయం తనకు కొద్ది రోజుల ముందే తెలిసిందని ఆ కంపెనీ సీఈవో, డైరెక్టర్ గా ఉన్న రవిప్రకాశ్ మార్చి 17,2019న శివాజీకి లిఖిత పూర్వకంగా చెప్పడం ఈ వ్యవహారంలో ఉన్న మతలబును బయటపెడుతోంది.

కంపెనీకి సీఈవోగా, డైరెక్టర్‌గా రవిప్రకాశ్‌కు లా ట్రిబ్యునల్‌ జారీ చేసిన న్యాయపరమైన ఉత్తర్వులు తెలియకపోవడం ఏ మాత్రం నమ్మశక్యం కానిదిగా కనిపిస్తోందని, పైగా ఈ వ్యవధిలో కనీసం రెండుసార్లు ఏబీసీఎల్‌ బోర్డు సమావేశాలు జరిగాయని కంపెనీ అంటోంది.

లా ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా, కొత్త యాజమాన్యానికి సంబంధించిన నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్‌ బోర్డులో చేర్చుకునేందుకు 2018 అక్టోబర్‌లో ఒకసారి, 2019 జనవరిలో మరోసారి బోర్డు మీటింగులు నిర్వహించి, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరేందుకు ఎలాంటి ఇబ్బంది లేని రవిప్రకాశ్‌కు… తన దగ్గర వ్యక్తిగత హోదాలో ఉన్న 40 వేల షేర్లను శివాజీకి బదలాయించడానికి ఉన్న అడ్డంకి ఏంటో అంతుపట్టనిదిగా ఉంది. పైగా ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందే కానీ, ఈ విషయంలో ఏబీసీఎల్‌ కి ఏమాత్రం ప్రమేయం లేదు.

వాస్తవం ఇలా ఉండగా, దీన్ని ఒక వివాదంగా సృష్టించి, నటుడు శివాజీ ద్వారా న్యాయపరమైన చిక్కులు కల్పించి ఆ కంపెనీ నిర్వహణ కొత్త యాజమాన్యం చేతికి పోకుండా అడ్డంకులు కల్పించడమే రవిప్రకాశ్ దురుద్దేశ్యమని స్పష్టమవుతోంది.

వ్యక్తిగత హోదాలో డబ్బులు తీసుకుని, షేర్లను బదలాయించకుండా ఉంది రవిప్రకాశ్ అయితే, ఈ వివాదంలోకి కొత్త యాజమాన్యాన్ని శివాజీ లాగడం వెనుక మర్మమేంటి? ఓ వైపు రవిప్రకాశ్‌ తనను నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తున్న శివాజీ, మరోవైపు మాత్రం టీవీ9 నిర్వహణలో యదాతథస్థితిని (అంటే రవిప్రకాశ్ నేతృత్వంలోనే టీవీ9 పనిచేయాలని) కొనసాగించేలా ఆదేశించాలని లా ట్రిబ్యునల్‌ ని కోరడం వెనుక ఉద్దేశ్యం ఏంటి?

నిజంగా రవిప్రకాశ్ మోసం చేస్తే, అతనికి వ్యతిరేకంగా కోర్టులో సివిల్ సూట్‌నో లేదా పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసునో దాఖలు చేయాల్సింది పోయి, నేరుగా ఎన్‌సీఎల్టీ ని శివాజీ ఆశ్రయించడం, ఈ మొత్తం వ్యవహారంలో దాగి ఉన్న దురుద్దేశాన్ని బయటపెడుతోందని కొత్త యాజమాన్యం ఆరోపిస్తోంది.

తనను రవిప్రకాష్ మోసం చేశాడని లా ట్రిబ్యూనల్ కు వెళ్ళడం ద్వారా శివాజీ, రవిప్రకాష్ లు ఇద్దరూ కలిసి టీవీ9 కొత్త యాజమాన్యాన్ని మోసం చేయాలని చూస్తున్నారని అలంద మీడియా వాళ్ళు ఆరోపిస్తున్నారు.

First Published:  9 May 2019 4:48 AM GMT
Next Story