Telugu Global
International

క్రీడాకారుల రెండో ఇన్నింగ్స్ గా పాలిటిక్స్

క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలే వృత్తి భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ ల్లో ఇదే ట్రెండ్ క్రీడాకారుల చుట్టూ తిరుగుతున్న రాజకీయరంగం అభిమానుల ఆదరణే కొండంత బలం రాజకీయాలు వేరు…, క్రీడలు వేరు. ఈ రెండూ వేర్వేరు రంగాలే అయినా….వీటిమధ్య అవినాభావ సంబంధమే ఉంది. ఇటు రాజకీయవేత్తలు, అటు స్పోర్ట్స్ స్టార్లు… అభిమానమే ఆలంబనగా రాణిస్తూ రావడం సాధారణ విషయమే. అయితే…క్రికెటర్ల నుంచి బాక్సర్ల వరకూ తమ రిటైర్మెంట్ జీవితాన్ని రాజకీయరంగంలో గడపడానికి ఎనలేని ఆసక్తిని చూపుతున్నారు. […]

క్రీడాకారుల రెండో ఇన్నింగ్స్ గా పాలిటిక్స్
X
  • క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలే వృత్తి
  • భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ ల్లో ఇదే ట్రెండ్
  • క్రీడాకారుల చుట్టూ తిరుగుతున్న రాజకీయరంగం
  • అభిమానుల ఆదరణే కొండంత బలం

రాజకీయాలు వేరు…, క్రీడలు వేరు. ఈ రెండూ వేర్వేరు రంగాలే అయినా….వీటిమధ్య అవినాభావ సంబంధమే ఉంది. ఇటు రాజకీయవేత్తలు, అటు స్పోర్ట్స్ స్టార్లు… అభిమానమే ఆలంబనగా రాణిస్తూ రావడం సాధారణ విషయమే.

అయితే…క్రికెటర్ల నుంచి బాక్సర్ల వరకూ తమ రిటైర్మెంట్ జీవితాన్ని రాజకీయరంగంలో గడపడానికి ఎనలేని ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇటు అధికార బీజెపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్… క్రీడా దిగ్గజాలను బరిలోకి దించడం ద్వారా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకొంటున్నాయి.

క్రికెట్ క్రేజీ భారత ఉపఖండ దేశాల రాజకీయాలలో సరికొత్త ట్రెండ్ ప్రారంభమయ్యింది. క్రికెటర్లు, బాక్సర్లు, అథ్లెట్లు, షూటర్లు… తమ రిటైర్మెంట్ జీవితాన్ని రాజకీయవేత్తలుగా గడపడానికే ఆసక్తి చూపుతున్నారు.

తమ రెండో ఇన్నింగ్స్ ను రాజకీయరంగానికి అంకితమివ్వడం ద్వారా ప్రజాసేవ చేయటానికి తహతహలాడుతున్నారు.

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సైతం…అధికార బీజెపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు….జనరంజక క్రీడాకారులుగా పేరుపొందిన విజేందర్ సింగ్, గౌతం గంభీర్, కృష్ణ పూనియా, గత తరం క్రికెటర్లు కీర్తి అజాద్, ఒలింపిక్ మెడలిస్ట్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ లను ఎన్నికల బరిలో నిలిపాయి.

భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్…క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత….రాజకీయాలను తన రెండో ఇన్నింగ్స్ గా మలచుకొన్నాడు. బీజెపీ తీర్థం పుచ్చుకొని మరీ….తూర్పు ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగాడు.

మరోవైపు…అమెచ్యూర్, ప్రొఫెషనల్ బాక్సింగ్ విభాగాలలో భారత ఆల్ టైమ్ గ్రేట్ స్టార్.. విజేందర్ సింగ్..33 ఏళ్ల వయసులోనే…బాక్సింగ్ రింగ్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దూకుతున్నాడు.

దక్షిణ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి విజేందర్ సింగ్ ముక్కోణపు సమరంలో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

రాజస్థాన్ లోని వేర్వేరు లోక్ సభ స్థానాల నుంచి సిటింగ్ ఎంపీగా కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, మాజీ ఒలింపియన్ కృష్ణ పూనియా బరిలో నిలిచారు.

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ..కొద్ది రోజుల క్రితమే బీజెపీ పార్టీలో అధికారికంగా చేరింది. అయితే …రాజ్ కోట లోక్ సభ సీటు కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. అంతేకాదు..జడేజా తండ్రి, సోదరి…కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని…తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.

క్రీడాకారులు…ప్రధానంగా క్రికెటర్లు రాజకీయ బరిలోకి దిగడం ఇదే మొదటిసారికాదు. గతంలోనే భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ జూనియర్, మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్, మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్, కీర్తి అజాద్, మాజీ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల రణరంగంలో పాల్గొన్నవారే.

అంతర్జాతీయస్థాయిలో క్రికెటర్లుగా విజయవంతమైన వారు మాత్రమే కాదు… ..టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య, సోదరి, తండ్రి సైతం… రాజకీయ అరంగేట్రానికి తహతహలాడుతున్నారు.

జనరంజక క్రీడాకారులుగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్న క్రీడాదిగ్గజాలు…ప్రజాసేవకు రాజకీయాలను మించిన దారి మరొకటిలేదని భావించడమే ప్రధానకారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

క్రికెటర్ నుంచి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్..

కాలం, ఖర్మం కలిసొస్తే….క్రికెటర్లు సైతం ఓ దేశానికి ప్రధాని కాగలరని…పాకిస్థాన్ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నిరూపించాడు. 2018 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ పార్టీ…అతిపెద్ద పార్టీగా అవతరించింది.

పాకిస్థాన్ సైన్యం, తీవ్రవాద సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో… ప్రధాని కావాలన్న 22 సంవత్సరాల ఇమ్రాన్ రాజకీయ కల సాకారమయ్యింది….

పాకిస్థాన్…భారత్ దాయాదిమాత్రమే కాదు…పక్కలో బల్లెం కూడా. ఉగ్రవాదుల ముఠాల దాష్టీకంతో నిత్యాగ్నిగుండంగా కనిపించే పాకిస్థాన్ కు…మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు.

పాకిస్థాన్ పార్లమెంట్ కు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో…ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ పార్టీ…అత్యధిక స్థానాలు గెలుచుకొని..అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతేకాదు..ఇమ్రాన్ కు ఎన్నికలకు ముందు నుంచే పాకిస్థాన్ ఆర్మీ, తీవ్రవాద సంస్థల నుంచి సంపూర్ణ మద్దతు సైతం ఉంది.

65 ఏళ్ల వయసులో ప్రధానిగా…

65 ఏళ్ల వయసులో తాను దేశానికి ప్రధాని కావడం..దేవుని దయ అంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. పాకిస్థాన్ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ..పాక్ ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో భరోసా ఇచ్చాడు.

లాహోర్ లో 65 ఏళ్ల క్రితం జన్మించిన ఇమ్రాన్ ఖాన్… యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీల్లో విద్యనభ్యసించాడు. 13 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతూ ఆ తర్వాత పాక్ జట్టు పగ్గాలు చేపట్టాడు.

1992 వన్డే ప్రపంచకప్ లో తనజట్టును విశ్వ విజేతగా నిలిపిన ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

1996లో తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించిన ఇమ్రాన్..తనవంతు కోసం 22 సంవత్సరాల పాటు ఓపికగా ఎదురుచూడాల్సి వచ్చింది.

బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ ల కుర్చీలాటలో …ఇమ్రాన్ సంవత్సరాల తరబడి ఆటలో అరటిపండులా మిగిలిపోవాల్సి వచ్చింది.

అయితే…బెనజీర్ భుట్టో పార్టీ బలహీనపడటం, నవాజ్ షరీఫ్ కు పాక్ సైనికదళాలతో సత్సంబంధాలు లేకపోడం…ఇమ్రాన్ కు పూర్తిస్థాయిలో కలసి వచ్చింది. ఇమ్రాన్ కు చెందిన PTI పార్టీ ఏకంగా 119 స్థానాలు గెలుచుకోడంతో…ప్రధాని కావడానికి మార్గం సుగమమయ్యింది.

1992లో పాకిస్థాన్ ను ప్రపంచ క్రికెట్ విజేతగా నిలిపిన ఇమ్రాన్ ఖాన్…ఆ తర్వాత 36 ఏళ్లకు…పాకిస్థాన్ ఎన్నికల్లో విజేతగా నిలవడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

శ్రీలంకలో రణతుంగ…

అంతేకాదు..మన ఇరుగుపొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్ ల్లో సైతం…పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు రాజకీయవేత్తలుగా తమ రెండోఇన్నింగ్స్ ప్రారంభించి…ఎంపీలుగా, మంత్రులుగా సేవ చేస్తున్నారు.

శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కేంద్రమంత్రిగా పనిచేస్తే…మాజీ ఓపెనర్లు సనత్ జయసూర్య, హషన్ తిలకరత్నే పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు.

బంగ్లా ఎంపీగా ముర్తాజా…

బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, వన్డే కెప్టెన్ ముషరఫే మొర్తాజా సైతం …క్రికెటర్ కమ్ పొలిటీషియన్ గా మారాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో అవామీలీగ్ పార్టీ తరపున…రికార్డు మెజారిటీతో ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించాడు.

35 ఏళ్ల వెటరన్ మొర్తాజా సరైయిల్ -2 నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచాడు. మొర్తాజాకు 2 లక్షల 74వేల 418 ఓట్లు పోల్ కాగా…ప్రత్యర్థి, జతియా ఓక్యా ఫ్రంట్ అభ్యర్థి ఉజ్ జమాన్ పర్హత్ కు 8వేల 6 ఓట్లు మాత్రమే పోల్ కావడం విశేషం.

మొర్తాజా 2 లక్షల 66వేలకు పైగా ఓట్ల మెజారీటీతో ఎన్నిక కావడం ద్వారా… ఈ ఘనత సాధించిన బంగ్లా తొలి క్రికెటర్ గా నిలిచాడు. గతంలో…బంగ్లా పార్లమెంట్ కు ఎన్నికైన క్రికెటర్ నైముర్ రెహ్మాన్ మాత్రమే.

క్రికెట్ నుంచి రిటైరైన తర్వాతే నైముర్ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే …మొర్తాజా మాత్రం…బంగ్లాదేశ్ జాతీయజట్టులో సభ్యుడిగా ఉంటూనే ఎన్నికల్లో పోటీకి దిగి విజేతగా నిలవడం విశేషం.

ఏదిఏమైనా… క్రికెటర్లు సైతం పార్లమెంట్ సభ్యులు, మంత్రులు మాత్రమే కాదు… ప్రధాని సైతం కాగలరని …ఇమ్రాన్ ఖాన్ నిరూపించాడు. క్రికెట్ ఆటలో రెండు ఇన్నింగ్స్ ఉంటే… క్రీడాకారుల జీవితంలో సైతం రెండు ఇన్నింగ్స్ ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Next Story