Telugu Global
NEWS

ఇంటర్ బోర్డు రద్దు తప్పదా ?

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ బోర్డును రద్దు చేసే అవకాశాలున్నాయా? ఈసారి ఇంటర్ ఫలితాలలో తీవ్రమైన తప్పులు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం, విపక్షాలు వారికి మద్దతు పలకడం సహజంగానే ప్రభుత్వానికి చికాకు కలిగించిందని అంటున్నారు. మరోవైపు ఇంటర్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని, ఏళ్ల తరబడి అక్కడ పాతుకుపోయిన ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అదే సమయంలో మరో కీలక డిమాండ్ కూడా […]

ఇంటర్ బోర్డు రద్దు తప్పదా ?
X

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ బోర్డును రద్దు చేసే అవకాశాలున్నాయా? ఈసారి ఇంటర్ ఫలితాలలో తీవ్రమైన తప్పులు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం, విపక్షాలు వారికి మద్దతు పలకడం సహజంగానే ప్రభుత్వానికి చికాకు కలిగించిందని అంటున్నారు.

మరోవైపు ఇంటర్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని, ఏళ్ల తరబడి అక్కడ పాతుకుపోయిన ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అదే సమయంలో మరో కీలక డిమాండ్ కూడా క్రమక్రమంగా తెర మీదకు వస్తోంది. అదేమిటంటే ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం.

ఇది అమలులోకి వస్తే రాష్ట్రంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లోనే ఇంటర్ తరగతులు కూడా నిర్వహిస్తారు. కానీ, ఈ డిమాండ్ మీద ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏటేటా ఫలితాల సమయంలో ఇలాంటి తప్పులే పునరావృతం అవుతున్నందున దీనికి శాశ్వత పరిష్కారం చూడాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు చెబుతున్నారు.

ఇప్పటి ఫలితాల గొడవ సద్దుమణిగిన అనంతరం ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరో వైపు ఇంటర్ ఫలితాల గందరగోళానికి సంబంధించి సర్కారు వేసిన త్రిసభ్య కమిటీ తన విచారణ నివేదికను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అందజేసింది. ఫలితాల వెల్లడిలో తీవ్ర తప్పిదాలే జరిగాయని కమిటీ తన నివేదికలో పేర్కొందని జనార్దన్ రెడ్డి ప్రకటించారు.

ఏ విద్యార్థికీ అన్యాయం జరగనివ్వబోమని, అందరికీ న్యాయం చేస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

మరో వైపు రీ వెరీఫికేషన్ కు, రీ వాల్యూయేషన్ కు సంబంధించి బోర్డుకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. వాటన్నింటిని జాగ్రత్తగా పరిశీలించి ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

మరోవైపు ఈ గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థ మీద చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనే విషయం మీద స్పష్టత రావడం లేదని అంటున్నారు. విపక్షాలు మాత్రం ఈ అంశాన్ని అంత తేలికగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు.

First Published:  27 April 2019 9:58 PM GMT
Next Story