Telugu Global
NEWS

ఎటువైపు దూకుదాం... జనసేన మల్లగుల్లాలు !

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారు..? సంపూర్ణమైన మెజారిటీతో వస్తారా? ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదా.? ఎవరు ఎవరి సహాయంతో అధికారంలోకి వస్తారు..? వంటి చర్చలు ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నాయి. అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం ఎలాంటి పని చేసేందుకైనా సిద్ధపడే చంద్రబాబు నాయుడు బేరసారాలకు అప్పుడే తెరతీశారంటున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నా… పచ్చ మీడియా మాత్రం మిత్రుల […]

ఎటువైపు దూకుదాం... జనసేన మల్లగుల్లాలు !
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారు..? సంపూర్ణమైన మెజారిటీతో వస్తారా? ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదా.? ఎవరు ఎవరి సహాయంతో అధికారంలోకి వస్తారు..? వంటి చర్చలు ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నాయి.

అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం ఎలాంటి పని చేసేందుకైనా సిద్ధపడే చంద్రబాబు నాయుడు బేరసారాలకు అప్పుడే తెరతీశారంటున్నారు.

ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నా… పచ్చ మీడియా మాత్రం మిత్రుల సాయంతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారు అంటూ కథనాలు ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన జనసేన పార్టీ తాము ఎవరికి మద్దతు ఇవ్వాలా అని చర్చించుకున్నట్టు సమాచారం.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయో చూసుకుని దానిని అనుసరించి ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. లోపాయికారీగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ… ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇవ్వాలంటే వారికే మద్దతు పలుకాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ కీలకంగా మారే దశలో తమకు ఎవరు ఎక్కువ మేలు చేస్తారో అంచనా వేసుకుని వారికి మద్దతు పలకాలన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయంగా చెబుతున్నారు.

ఒకవేళ నిజంగా హంగ్ అంటూ ఏర్పడితే.. జనసేన పార్టీకి పదో… పరకో సీట్లు వస్తే అధికారాన్ని ఆశిస్తున్న పార్టీ వద్ద తమ డిమాండ్లు పెట్టవచ్చు అన్నది పవన్ కళ్యాణ్ వ్యూహంగా చెబుతున్నారు. పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులకు మంత్రి పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ పదవులు కోరడంతో పాటు ఈ ఎన్నికల్లో చేసిన ఖర్చు మొత్తాన్ని కూడా డిమాండ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా… వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నా… జనసేన కోరిక మాత్రం వేరే విధంగా ఉందంటున్నారు. తాము అధికారంలోకి రావడం కష్టమని తేలిందని, తమ సాయంతో అధికారంలోకి వచ్చే వారికి మద్దతు పలికి దాని ద్వారా లాభం పొందాలని జనసేన భావిస్తునట్లు చెబుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ పోకడ బాగా గమనించిన జనసేన నాయకులు మాత్రం…. ఏ పార్టీకి మెజార్టీ రాకుండా… జనసేన సాయం అవసరం అయితే…. నాయకులు కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఎక్కువ పదవులు, అధికారాలు ప్రభుత్వాన్ని స్థాపించే పార్టీ నుంచి కోరడని…. తాను వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తాడు తప్ప…. పార్టీకోసం, నాయకుల కోసం బేరసారాలు చేయడని అంతర్గత చర్చల్లో అంటున్నారు.

కాబట్టి ఆ పరిస్థితే వస్తే ఊగిసలాట ఏమీ ఉండదని…. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాత్రమే చేతులు కలుపుతాడని అంటున్నారు.

First Published:  27 April 2019 12:41 AM GMT
Next Story