Telugu Global
NEWS

పవన్ పరిస్థితి ఏమిటి పరమేశా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంల్లో భద్ర పరిచారు. మరో నెల రోజుల వరకూ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళూ ముఖ్యమంత్రులే. ఫలితాలు వెలువడేంత వరకూ అందరూ రాజులు రారాజులే. మే 23 వ తేదీ తరువాత ఆంధ్రప్రదేశ్ లో  అసలు రాజు ఎవరు…? మంత్రి ఎవరు…? రోడ్డున పడేది ఎవరు…? అనేది తేలిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ల మధ్య పోటీ నువ్వా […]

పవన్ పరిస్థితి ఏమిటి పరమేశా?
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంల్లో భద్ర పరిచారు. మరో నెల రోజుల వరకూ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళూ ముఖ్యమంత్రులే. ఫలితాలు వెలువడేంత వరకూ అందరూ రాజులు రారాజులే. మే 23 వ తేదీ తరువాత ఆంధ్రప్రదేశ్ లో అసలు రాజు ఎవరు…? మంత్రి ఎవరు…? రోడ్డున పడేది ఎవరు…? అనేది తేలిపోతుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ల మధ్య పోటీ నువ్వా నేనా అన్న స్థాయిలో జరిగింది. ఈ రెండింటి మధ్యలో మరో పార్టీ జనసేన కూడా ఎన్నికల బరిలో నిలిచింది. రాజకీయ పార్టీగా ఈసారి అవతరించిన జనసేన… ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అందలం ఎక్కి స్తుందో…? లేక ఇంటికి పంపిస్తుందో తేలాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో అన్ని శాసనసభ స్థానాలకు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు కొన్ని స్థానాలైనా రాకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమిటని చర్చలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వివిధ రకాల ప్రకటనలు చేశారు. ఒకసారి కానిస్టేబుల్ కుమారుడు ముఖ్యమంత్రి కాకూడదా… అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్… తాను ముఖ్యమంత్రి అవుతానో కాదో తెలియదంటూ మరోసారి చెప్పారు. ఇలా విరుద్ధ ప్రకటనలతో ఓటర్లకు పరీక్ష పెట్టారు పవన్ కళ్యాణ్.

ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన పార్టీకి కొన్ని స్థానాలైనా రాకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు… రాజకీయ విశ్లేషకులు, అభ్యర్థులు, పార్టీ సానుభూతిపరులు కూడా చర్చించుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ ను నమ్ముకుని పార్టీలోకి వచ్చిన అనేకమంది తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రావడం మాట అటుంచితే కనీసం గౌరవ ప్రదమైన స్థానాలైనా దక్కుతాయా అనే భయం జనసేన అభ్యర్థుల్లో నెలకొంది. అలా జరగని పక్షంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటో ఆ పరమేశ్వరుడికి తెలియాలని, మరో ఐదు సంవత్సరాల పాటు జనసేన కోసం పని చేయడం అసాధ్యం అని వారంటున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారనీ, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చేతులు దులుపుకున్నారని జన సైనికులు గుర్తు చేస్తున్నారు.

మరి ఇప్పుడు అదే పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు… ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే జిల్లాల లోని జనసేన పార్టీ ఆఫీసులకు అప్పుడే టులెట్ బోర్డులు తగిలించేసినట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలను ఫొటోలను జనసేన ఖండించకపోవడంతో ఆఫీసులు మూసేసి టులెట్ బోర్డులు పెట్టింది నిజమేనని భావిస్తున్నారు.

First Published:  17 April 2019 11:09 PM GMT
Next Story