Telugu Global
Others

అటవీ హక్కులపై ద్రోహపూరిత ఆక్రమణ

దేశంలోని 7,08,273 చదరపు కిలో మీటర్ల అటవీ ప్రాంతాన్ని రక్షించే పేరుతో అటవీ శాఖ అధికార వర్గాలకు అపరితమైన అధికారాలు కట్టబెట్టడానికి 2019నాటి భారత అటవీ చట్టం ముసాయిదా సిద్ధం చేశారు. ఉదారవాద ఆర్థిక విధానాలకు అనుగుణంగా అటవీ సంపదను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని కూడా ఈ ముసాయిదా బిల్లులో చేర్చారు. ఈ ముసాయిదా బిల్లు 2006నాటి అటవీ హక్కుల చట్టంలోని కొన్ని అంశాలను ఉల్లంఘించేట్టు ఉన్నాయి. అంతే కాక రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలు చేసే […]

అటవీ హక్కులపై ద్రోహపూరిత ఆక్రమణ
X

దేశంలోని 7,08,273 చదరపు కిలో మీటర్ల అటవీ ప్రాంతాన్ని రక్షించే పేరుతో అటవీ శాఖ అధికార వర్గాలకు అపరితమైన అధికారాలు కట్టబెట్టడానికి 2019నాటి భారత అటవీ చట్టం ముసాయిదా సిద్ధం చేశారు. ఉదారవాద ఆర్థిక విధానాలకు అనుగుణంగా అటవీ సంపదను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని కూడా ఈ ముసాయిదా బిల్లులో చేర్చారు.

ఈ ముసాయిదా బిల్లు 2006నాటి అటవీ హక్కుల చట్టంలోని కొన్ని అంశాలను ఉల్లంఘించేట్టు ఉన్నాయి. అంతే కాక రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలు చేసే హక్కులను కూడా ఉల్లంఘించే రీతిలో ఉన్నాయి. 2019నాటి బిల్లు ముసాయిదాను అభిప్రాయాలు తెలియజేయడానికి రాష్ట్రాలకు పంపించారు. అటవీ హక్కుల చట్టాన్ని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వు తరవాత ఈ ముసాయిదా రూపొందించారు. అణగారిన వర్గాలకు హాని చేసే ఈ ముసాయిదా బిల్లును ఎన్నికలు జరగవలసిన తరుణంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం రాష్ట్రాలకు పంపించడమూ ఓ వైపరీత్యమే.

తిరోగమన దిశలో రూపొందించిన ఈ ముసాయిదా 1927నాటి భారత అటవీ చట్టానికి తీవ్రమైన సవరణలు ప్రతిపాదించింది. ప్రతిపాదిత సవరణల ప్రకారం అటవీ అధికారులకు కొన్ని వీటో అధికారాలు కట్టబెట్టారు. ఈ అధికారాలు అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించేవిగా ఉన్నాయి. ఈ ముసాయిదాలో అటవీ శాఖ అధికారులకు న్యాయసదృశ అధికారాలు కట్టబెట్టడంతో పాటు అటవీ సంరక్షణకు విఘాతం కలిగించినప్పుడు, అడవులకు సంబంధించిన నేర సంఘటనలు జరిగినప్పుడు అధికారులు ఆయుధాలు ప్రయోగించే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ ముసాయిదా ప్రకారం అడవులకు భంగం కలిగిస్తున్నట్టు అనుమానం వస్తే అధికారులు కాల్పులు జరపవచ్చు. సోదాలు చేయవచ్చు. ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. తాము తప్పు చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యత నిందితుల మీదే ఉంటుంది. అటవీ అధికారులకు ఇచ్చిన అధికారాలు ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలలో 1958నాటి సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టంలోని అంశాల లాగే ఉన్నాయి.

అంతే కాక అటవీ హక్కుల చట్టంలోని అంశాలను ఉల్లంఘించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని సంప్రదించి చర్య తీసుకోవడానికీ అవకాశం ఇవ్వడం రాజకీయంగా తిరోగమన పూరితమైంది. అటవీ హక్కులు అడవుల సంరక్షణకు అడ్డు తగులుతాయనుకున్నప్పుడు ఆ హక్కులను కాల రాసే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో అడవులలో ఉండే వారికి డబ్బు చెల్లించడమో, భూమి కేటాయించడమో చేయడానికి అవకాశం కల్పించారు. అంటే అడవుల్లో ఉండే వారిని అక్కడి నుంచి తొలగించడానికి సర్వాధికారాలు ఇచ్చినట్టే. ఇది అడవుల మీద ఆధారపడిన వారి హక్కులను హరించడమే. వలసవాద పాలనలోనూ, ఆ తరవాత ఏర్పడిన వివిధ ప్రభుత్వాల ఏలుబడిలో అడవుల్లో జీవించే వారి హక్కులను ఈ పాటికే చాలా వరకు ఉల్లంఘించారు. చారిత్రకంగా వారు అన్యాయానికి గురి అవుతూనే ఉన్నారు.

ఈ చట్టంలో ఉన్న మరో తీవ్రమైన విషయం కేంద్రం రూపొందించే నిబంధనలకు, రాష్ట్రాలలో అమలులో ఉన్న నిబంధనలకు మధ్య వైరుధ్యం ఉంటే కేంద్ర నిబంధనలే అమలవుతాయి. ఇది రాజ్యాంగంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఉన్న ఫెడరల్ సూత్రాలకు విరుద్ధమైంది. అలాగే “గ్రామ అడవులు” ఏర్పాటు చేయడానికి ముసాయిదాలో అవకాశం ఇచ్చినందువల్ల గ్రామ సభలు ఎందుకూ కొరగాకుండా పోతాయి. వికేంద్రీకృత పాలనకు ఇది పూర్తిగా వ్యతిరేకమైంది. ఈ సవరణలు కనక అమలులోకి వస్తే రాష్ట్రాలకు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది.

అడవులను వాణిజ్యపరంగా వినియోగించుకోవడానికి అనువుగా ప్రైవేటు అడవులను ప్రోత్సహించే వీలూ కల్పించారు. దానితో పాటు “ఉత్పాదక అడవులు” కూడా ఏర్పాటు అవుతాయి. ఇదీ అటవీ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య పరిపాలనకు విఘాతం కలిగిస్తుంది. ఇప్పుడున్నట్టుగా సహకార దృష్టితో అడవులను వినియోగించుకునే అవకాశం ఉండదు. ఉమ్మడి వనరులను ఉపయోగించుకునే అవకాశమూ ఉండదు. ప్రైవేటు వర్గాలు అడవులను కబళించడానికి వీలు కల్పించి అణగారిన వర్గాలను అణచి వేయడానికి దారి తీస్తుంది.

అడవుల్లో ఉండే వారి పౌర హక్కులకూ విఘాతం కలిగించి, సామాజికంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న వారి, ఆదివాసుల హక్కులు హరించాలని కేంద్రం ఎందుకు భావిస్తోంది? అటవీ ఉత్పత్తులు వనవాసులకు దక్కకుండా ఎందుకు చేస్తోంది? అడవులను ఘర్షణ ప్రాంతాలుగా మలచాలని ఎందుకు అనుకుంటోంది? సాంప్రదాయికంగా వనవాసులైన వారి ప్రయోజనాలను దెబ్బ తీయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? ప్రతిపాదిత సవరణలపై బహిరంగ చర్చకు, రాజకీయ చర్చకు అవకాశం లేకుండా ఎందుకు చేస్తోంది?

ఆదివాసులు నివసించే ప్రాంతాలలో పేదరికం తాండవిస్తోంది. ఆ ప్రాంతాలలో అసమానతలు విపరీతంగా ఉన్నాయి. అటవీ సంరక్షణను, అటవీ హక్కులను ఒక చర్చనీయాంశంగా పరిగణించడం లేదు. అడవుల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ సమగ్రమైన చట్రాన్ని రూపొందించింది. అందులో స్థానికులకు అవకాశం కల్పించింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో అటవీ హక్కుల ప్రస్తావనే లేదు.

అడవుల మీద ఆధారపడి జీవించే వారి ప్రయోజనాలను కాపాడాలంటే అణచివేతకు దారి చేసే ఇలాంటి ముసాయిదా బిల్లులను రద్దు చేయాలి. పేదలకు అనుకూలమైన విధానాలు రూపొందించాలి. ఈ ముసాయిదానే ఆమోదిస్తే కొత్త అసమానతలు తలెత్తుతాయి. వనవాసుల హక్కులు కొరగాకుండా పోతాయి. అటవీ ప్రాంతాలు సంపూర్ణంగా రాజ్య వ్యవస్థ గుప్పెట్లోకి వెళ్లిపోతాయి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Next Story