Telugu Global
NEWS

వైసీపీ మేనిఫెస్టో విడుదల.... అన్ని వర్గాలకు వరాలు

వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. వైఎస్‌ జగన్ అమరావతిలో మేనిఫెస్టోను విడుదల చేశారు. నాలుగు పేజీలలో ఈ మేనిఫెస్టోను తయారు చేశారు. తాము విడుదల చేసిన మేనిఫెస్టోను ఐదేళ్ల పాటు వెబ్‌సైట్‌లోనే ఉంచుతామని.. ఎప్పటికప్పుడు ప్రజలు దాన్ని సమీక్షించుకోవచ్చన్నారు జగన్.  వ్యవసాయానికి పగటి పూటే 9గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ప్రతి ఏటా మే నెలలో పెట్టుబడి కోసం రైతులకు నేరుగా 12,500ల రూపాయలను రైతుల అకౌంట్లోనే వేస్తామన్నారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని వైసీపీ ప్రకటించింది. పంట బీమా ప్రీమియంను […]

వైసీపీ మేనిఫెస్టో విడుదల.... అన్ని వర్గాలకు వరాలు
X

వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. వైఎస్‌ జగన్ అమరావతిలో మేనిఫెస్టోను విడుదల చేశారు. నాలుగు పేజీలలో ఈ మేనిఫెస్టోను తయారు చేశారు. తాము విడుదల చేసిన మేనిఫెస్టోను ఐదేళ్ల పాటు వెబ్‌సైట్‌లోనే ఉంచుతామని.. ఎప్పటికప్పుడు ప్రజలు దాన్ని సమీక్షించుకోవచ్చన్నారు జగన్.

వ్యవసాయానికి పగటి పూటే 9గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ప్రతి ఏటా మే నెలలో పెట్టుబడి కోసం రైతులకు నేరుగా 12,500ల రూపాయలను రైతుల అకౌంట్లోనే వేస్తామన్నారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని వైసీపీ ప్రకటించింది.

పంట బీమా ప్రీమియంను రైతుల తరపున ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతులు ప్రమాదవశాత్తు చనిపోయినా, దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్నా… ఆ రైతు కుటుంబానికి 7లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామన్నారు.

సహకార డెయిరీలకు పాలు పోసే రైతులకు నాలుగు రూపాయల బోనస్ ఇస్తామన్నారు జగన్. మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు వేల కోట్లతో విపత్తు నిర్వాహణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు.

పంటలు వేయడానికి ముందే రైతులకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్‌లను, గోడౌన్‌లను నిర్మిస్తామన్నారు.

ఆరోగ్య శ్రీని అందరికీ వర్తింప చేస్తామని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల ఫొటోలను తీసి… రెండేళ్ల తర్వాత వాటిని అభివృద్ధి చేసి తేడాను చూపిస్తామన్నారు జగన్‌. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారిందరికీ ఉచిత వైద్యం అందిస్తామని జగన్ చెప్పారు. 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రతిపాదికన
నిర్మిస్తామన్నారు. గ్రామాల్లోని చెరువును పునరుద్దరిస్తామన్నారు.

ఏ సమస్యనైనా సరే గ్రామ సచివాలయాల ద్వారా 72 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్‌ను ప్రతి ఏటా విడుదల చేస్తామన్నారు. పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తెస్తామన్నారు.

చెప్పిన మాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు తక్షణం రూ. 1150 కోట్లు విడుదల చేస్తామని జగన్‌
హామీ ఇచ్చారు. దాని వల్ల తక్షణం 13 వేల మందికి ఉపయోగం జరుగుతుందన్నారు. గొర్రెలకు ఆరు వేల బీమా చెల్లిస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదివేలు ఇస్తామన్నారు. గొర్రెల కాపరులు చనిపోతే ఆరు లక్షలు చెల్లిస్తామన్నారు.

మాదిగలకు, మాలలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీఎస్టీ అమ్మాయిల వివాహానికి లక్ష రూపాయలు ఇస్తామని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వారు సహజ మరణం పొందినా వారి
కుటుంబానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామని జగన్ చెప్పారు.

రాష్ట్రంలోని పాఠశాల ఫోటోలను తీసి… రెండేళ్లలో వాటిని అభివృద్ధి చేసి ఫోటోల సాయంతో తేడాను చూపిస్తామన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తామని చెప్పారు. సీఎం ఆధ్వర్యంలోనే ఫీజుల నియంత్రణ కమిటీ పనిచేస్తుందన్నారు. ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్, తెలుగు మీడియంను తప్పనిసరి చేస్తామన్నారు.

బీసీల అభివృద్దికి ఐదేళ్లలో 75వేల కోట్లను సబ్ ప్లాన్‌ ద్వారా అమలు చేస్తామన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ, కార్పొరేషన్లలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించేలా చట్టం తెస్తామన్నారు. బీసీ అమ్మాయిలకు వైఎస్‌ఆర్ పెళ్లికానుక కింద 50వేలు ఇస్తామన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని జగన్‌ హామీ ఇచ్చారు.

టైలర్‌, నాయీ బ్రాహ్మణులకు ఏటా ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. జూనియర్ న్యాయవాదులకు ప్రతి ఏటా ఐదువేలు ఇస్తామన్నారు. అర్చకులకు రిటైర్‌మెంట్‌ వయో పరిమితిని రద్దు చేస్తామన్నారు. అర్చకులకు 25 శాతం జీతాలు పెంచుతామన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను రీ సర్వే చేయించి పరిరక్షిస్తామన్నారు. మైనార్టీల సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తామన్నారు. ముస్లిం అమ్మాయిల వివాహానికి లక్ష రూపాయలు అందజేస్తామన్నారు.

అన్ని అగ్రకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి…. ఆయా కులాల్లోని పేదలకు అండగా ఉంటామన్నారు. కులం, వర్గం, మతం తేడా లేకుండా అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తూ పాలన సాగిస్తామన్నారు. బీసీ హక్కులకు భంగం కలగకుండా
కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామన్నారు.

రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించి అన్ని ప్రాంతాల వారికీ అక్కడ ఉపాధి లభించే అవకాశం కల్పిస్తామన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తామన్నారు. లంచాల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా చేస్తామన్నారు. సీపీఎస్‌ రద్దు చేయడంతోపాటు పాత పించన్ విధానాన్ని తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. పోలీసులకు వారాంతరపు సెలవును అమలు చేస్తామన్నారు.

First Published:  6 April 2019 12:20 AM GMT
Next Story