Telugu Global
Others

పరిశోధనకు ప్రభుత్వ సంకెళ్లు  

గత అయిదేళ్ల కాలంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.) ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థలలో లోతైన, వైవిధ్యభరితమైన ఆలోచనలకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. విద్యా రంగంపై ఆ ప్రభుత్వానికి ఉన్న హ్రస్వ దృష్టివల్ల విశ్వ విద్యాలయాల ప్రయోజనమే దెబ్బ తింటోంది. విశ్వ విద్యాలయాల్లో స్వతంత్రంగా ఆలోచించలేక పోతున్నారు. విశ్వ విద్యాలయాల మౌలిక భావనకు, వాటి స్వయం ప్రతిపత్తికి, పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంది. అన్ని విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్ లర్ల, మానవ వనరుల అభివృద్ది […]

పరిశోధనకు ప్రభుత్వ సంకెళ్లు  
X

గత అయిదేళ్ల కాలంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.) ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థలలో లోతైన, వైవిధ్యభరితమైన ఆలోచనలకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. విద్యా రంగంపై ఆ ప్రభుత్వానికి ఉన్న హ్రస్వ దృష్టివల్ల విశ్వ విద్యాలయాల ప్రయోజనమే దెబ్బ తింటోంది. విశ్వ విద్యాలయాల్లో స్వతంత్రంగా ఆలోచించలేక పోతున్నారు.

విశ్వ విద్యాలయాల మౌలిక భావనకు, వాటి స్వయం ప్రతిపత్తికి, పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంది. అన్ని విశ్వ విద్యాలయాల వైస్ చాన్స్ లర్ల, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ, విశ్వ విద్యాలయాల నిధుల సంఘం (యు.జి.సి.) 2018 డెసెంబర్ 15న సమావేశమై విశ్వ విద్యాలయాల్లో జరిగే పరిశోధన “జాతీయ ప్రాధాన్యత” ప్రకారమే ఉండాలని తీర్మానించారు.

కేరళలోని కేంద్ర విశ్వ విద్యాలయం ఈ సిఫార్సును తక్షణం అమలు చేసి అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇలా నిర్దేశించడం అంటే అనేక విద్యా సంస్థలు పరిశోధనాంశాలను వివేచించి నిర్ణయించే అవకాశం లేకుండా చేయడమే. ఈ తీర్మానం మేధా పరమైన వ్యవహారానికి విరుద్ధమైందే కాక పరిశోధనలో ఉండవలసిన ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలుగుతుంది.

జాతీయత అంటే ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో మాత్రమే ఉండాలని ఈ తీర్మానం నిర్దేశిస్తోంది. అంటే ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలనే. ఎవరైనా విరుద్ధమైన అభిప్రాయమో, భిన్నాభిప్రాయమో వ్యక్తం చేస్తే అది జాతిని విధ్వంసం చేసేదిగా పరిగణనలోకి వస్తుంది.

ప్రభుత్వం అనుకుంటున్న జాతీయ ప్రాధాన్యాల పరిధిలో లేని చరిత్రను, కొన్ని సామాజిక వర్గాలను మినహాయిస్తారు. అంటే ప్రభుత్వం అనుకునే జాతీయ ప్రాధాన్యాలతో విభేదించే అంశాలను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎన్.సి.ఇ.ఆర్.టి.) పాఠ్య పుస్తకాల నుంచి మినహాయిస్తారు.

అప్పుడు పరిశోధన పరిమితమై పోతుంది. మెజారిటీ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే జాతీయత అంటే ఏమిటో అనేక భావాలున్నాయి. ఈ భావాలలో పరస్పర విరుద్ధమైనవి, భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి.

ఇప్పటికే విశ్వ విద్యాలయాల పరిశోధనల్లో మూస పద్ధతికి, ఆనవాయితీకి భిన్నంగా పరిశోధన కొనసాగించే అవకాశం తక్కువగా ఉంది. ప్రామాణికం అని కొందరు భావించే అంశంతో విభేదించే అవకాశమూ తక్కువే. “అసంగతమైనవి అనుకునే” అంశాలలో పరిశోధన “సురక్షితం” కాదనుకుంటారు. అంటే పెద్ద నోట్ల రద్దు మంచి చెడ్డలను విశ్లేషించడం, స్వచ్ఛ భారత్ పథకం ప్రభావం సమాజం మీద, పర్యావరణం మీద ఏ మేరకు ఉంటుంది అన్న అంశాల మీద పరిశోధనను అసంగతమైందిగా భావించవచ్చు. పరిశోధన అసంగతమైందా కాదా అన్న దానికన్నా ఒక పరిశోధకుడు ఒక అంశాన్ని ఎలా చూస్తున్నారు అనే దానికే ప్రాధాన్యం ఉండాలి.

ఇది విద్యావేత్తలకే కాక సమాజానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. పరిశోధన ఆ పని చేసే వారికి అర్థవంతంగా ఉండాలి. అంటే పరిశోధకుడి బుర్రకు తట్టిన అంశాలపై పరిశోధించడానికి అవకాశం ఉండాలి. ఇందులో ప్రశ్నించడం మొట్ట మొదట చేయవలసిన పని. దీనిలో ఉత్సుకతకు, భావ వ్యక్తీకరణకు , ఆలోచనకు, సృజనాత్మకతకు, సవిమర్శక పరిశీలనకు అవకాశం ఉండాలి. అంటే పరిశోధకులు ఎన్ని ప్రశ్నలైనా లేవనెత్తగలగాలి.

ముందుగా నిర్ణయించిన విషయాలలోంచే పరిశోధనాంశాలను ఎన్నుకోవడం అంటే పరిశోధన ప్రయోజనమే నెరవేరకుండా పోతుంది. పరిశోధన అంటే ఉన్న విషయానికి భిన్నంగా, లేదా కనిపించే అంశానికి అతీతంగా, తెలుసుకోవలసిన అంశానికి అనువుగా ఉండాలి.

మార్కెట్ పరిస్థితులో, ప్రభుత్వమో పరిశోధన ఇలాగే ఉండాలి అని చెప్పడం మొదలు పెడ్తే పరిశోధనలో ఉండవలసిన స్ఫూర్తే లేకుండా పోతుంది. యథాలాపంగా, ప్రమాదం లేని అంశాల మీద, ఇబ్బంది లేని అంశాల మీదే పరిశోధన చేసేటట్టయితే ఫలితం ఏముంటుంది? విశ్వ విద్యాలయాల్లో పరిశోధన అంటే తక్షణావసారాల గురించి వివేచించడమే కాదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అతీతంగా ఆలోచించగలిగితేనే ప్రయోజనం.

కేరళ కేంద్ర విశ్వ విద్యాలయం జారీ చేసిన సర్క్యులర్ చూస్తే నిర్దేశాలు జారీ చేసే వారికి ఆమోద యోగ్యం కాని అంశాలకు ఆర్థిక వెసులుబాటు కలిగించే అవకాశమూ ఉండదు. ప్రభుత్వం అనుమతించిన అంశాలకే పరిశోధన పరిమితం అవుతుంది. అంటే నిధులనుబట్టి ఆలోచనలు సాగాలి లేదా భిన్నంగా ఆలోచించే వారికి మద్దతు ఉండదు.

ఇంతకు ముందు 60 విశ్వ విద్యాలయాలను, కళాశాలలను స్వయం ప్రతిపత్తి గలవిగా ప్రకటించినప్పుడే విశ్వ విద్యాలయాలకు యు.జి.సి. నిధులివ్వదని, వాటి బాధలేవో అవే పడాలని సూచన ప్రాయంగా తెలియజేశారు. అంటే విశ్వ విద్యాలయాలు కూడా వాణిజ్య పరమవుతాయి. కార్పొరేటీకరణకు గురవుతాయి.

సామాజిక శాస్త్ర విభాగాలకు నిధుల్లో కోత పెట్టడం ఈ ధోరణికే సంకేతం. ఇది జాతి ప్రయోజనాలకు విరుద్ధం. అంటే సామాజిక శాస్త్రాలు, ఇతర మానవీయ శాస్త్రాలలో పరిశోధన ప్రభుత్వ నిర్వహణలోని విశ్వ విద్యాలయాలకే పరిమితం అవుతుంది. సమాజంలో భిన్న అవగాహనకు అవకాశం లేకుండా చేయడం దురదృష్టం.

పరిశోధన మీద నిఘా వేసి ఉంచడం అంటే చదవడానికి, రాయడానికి, ఆలోచించడానికి, వివేచించడానికి, అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఉన్న అవకాశాన్ని కట్టడి చేయడమే. విశ్వ విద్యాలయాలు నిజానికి చేయవలసిన పనే ఇది.

పండితులు, పరిశోధకులు ఏం చదవాలి, ఎలా చదవాలో ప్రభుత్వమే నిర్ణయించేటట్టయితే, జాతీయతా వాద చట్రంలో పరిశోధన జరగాలని నిర్దేశిస్తే విశ్వ విద్యాలయాలలో తయారయ్యేది కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడే వారినే.

నిరంకుశంగా వ్యవహరించే ప్రభుత్వానికి తలొగ్గడం విశ్వ విద్యాలయాలు చేయవలసిన పని కాదు. విశ్వ విద్యాలయాలలో భిన్న ఆలోచనలకు, ప్రాపంచిక దృక్పథాలకు అవకాశం ఉండాలి. మెరుగైన సమాజం కోసం, భిన్న రాజకీయాలకు, జాతీయత, జాతి అన్న విషయంలో వైవిధ్య భరితమైన భావాలకు అవకాశం ఉండాలి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Next Story