Telugu Global
NEWS

ఆదినారాయణరెడ్డిపై డాక్టర్ సునీత అనుమానం

తన తండ్రి హత్య కేసులో మంత్రి ఆదినారాయణ రెడ్డి పై వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులనే విచారిస్తున్నారు గానీ… తాము అనుమానం వ్యక్తం చేస్తున్న వారిని మాత్రం ఎందుకు విచారించడం లేదని ఆమె ప్రశ్నించారు. మనిషిని పోగొట్టుకున్న తమ మీదే నిందలేస్తుంటే న్యాయం ఎక్కడుందని ఆవేదన చెందారు. పరమేశ్వరరెడ్డి – ఆదినారాయణరెడ్డి మధ్య సంబంధాన్ని ఎందుకు వెలికితీయడం లేదని ప్రశ్నించారు. జగన్‌ను సీఎం చేయాలన్నది తన తండ్రి ఆశయం అన్నారు. జమ్మలమడుగులో వైఎస్ వివేకానందరెడ్డికి ఉన్న పట్టు ఆదినారాయణరెడ్డికి […]

ఆదినారాయణరెడ్డిపై డాక్టర్ సునీత అనుమానం
X

తన తండ్రి హత్య కేసులో మంత్రి ఆదినారాయణ రెడ్డి పై వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులనే విచారిస్తున్నారు గానీ… తాము అనుమానం వ్యక్తం చేస్తున్న వారిని మాత్రం ఎందుకు విచారించడం లేదని ఆమె ప్రశ్నించారు. మనిషిని పోగొట్టుకున్న తమ మీదే నిందలేస్తుంటే న్యాయం ఎక్కడుందని ఆవేదన చెందారు.

పరమేశ్వరరెడ్డి – ఆదినారాయణరెడ్డి మధ్య సంబంధాన్ని ఎందుకు వెలికితీయడం లేదని ప్రశ్నించారు. జగన్‌ను సీఎం చేయాలన్నది తన తండ్రి ఆశయం అన్నారు. జమ్మలమడుగులో వైఎస్ వివేకానందరెడ్డికి ఉన్న పట్టు ఆదినారాయణరెడ్డికి తెలుసని అందుకే అడ్డు తొలగించుకున్నారన్నారు. తాము సిట్‌ను ఎన్నిసార్లు కోరినా ఆదినారాయణరెడ్డిని మాత్రం విచారణకు ఎందుకు పిలవడం లేదన్నారు.

ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు ఎందుకు ఇంతగా వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. కసునూరు పరమేశ్వరరెడ్డిపై తమకు అనుమానాలున్నాయన్నారు. హత్య జరిగిన వెంటనే పరమేశ్వర్‌ రెడ్డి ఆస్పత్రికిలో ఎందుకు చేరారని అనుమానం
వ్యక్తం చేశారు. పరమేశ్వరెడ్డికి ఎలాంటి అనారోగ్యం లేదని మెడికల్ రిపోర్టుల్లోనే తేలిందన్నారు. ఆస్పత్రిలో చేరిన పరమేశ్వరెడ్డి అదే రోజు సాయంత్రం ఆస్పత్రి సిబ్బందితో గొడవ పడి డిశ్చార్జ్ అయ్యారని.. ఆ తర్వాత వెళ్లి సరితా హోటల్‌లో టీడీపీ నేతలతో భేటీ అయ్యారన్నారు.

టీడీపీ వారితో భేటీ తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ అదే ఆస్పత్రిలో ఎందుకు చేరారని ఆమె ప్రశ్నించారు. పరమేశ్వరరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో సంబంధాలున్నాయన్నారు. ఆస్పత్రిలో ఉన్నంత సేపు పరమేశ్వరరెడ్డి ఫోన్లలో మాట్లాడుతూనే ఉన్నారని ఆస్పత్రి వారే చెబుతున్నారన్నారు. ఇన్ని రోజులైనా ఎందుకు హంతకులను గుర్తించలేకపోయారని నిలదీశారు. తన తండ్రి డెడ్‌బాడీని తొలగించింది పోలీసులేనన్నారు. సీఐ దగ్గరుండి గాయాలకు కట్లు కట్టించారన్నారు. అలా చేయడం తప్పు అని సీఐకి తెలియదా అని నిలదీశారు.

First Published:  27 March 2019 12:20 AM GMT
Next Story