Telugu Global
NEWS

ఆ రెండు రోజులు ఎంతో శుభం: అందుకే ఎక్కువ మంది పార్టీలు మారుతున్నారు

రాజకీయ నాయకులలో ముహూర్త బలం చూసుకోవడం ఉంటుందా?…. అవును ఉంటుంది… మిగతా రోజుల్లో ఏమోగానీ ఎన్నికల ముందు మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం, గెలుపే పరమావధిగా పనిచేయడం వంటి అంశాలపై రాజకీయ నాయకులు చూపించే శ్రద్ధ… ముహూర్త బలంపై కూడా అంతే ఎక్కువగా చూపిస్తారు అంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటనుకుంటున్నారా….! ఈనెల 8, 9 తేదీలలో మంచి ముహూర్త బలం ఉందట. అనేకమంది జాతకాలను అనుసరించి ఎంతో మంచి రోజులు […]

ఆ రెండు రోజులు ఎంతో శుభం: అందుకే ఎక్కువ మంది పార్టీలు మారుతున్నారు
X

రాజకీయ నాయకులలో ముహూర్త బలం చూసుకోవడం ఉంటుందా?…. అవును ఉంటుంది… మిగతా రోజుల్లో ఏమోగానీ ఎన్నికల ముందు మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం, గెలుపే పరమావధిగా పనిచేయడం వంటి అంశాలపై రాజకీయ నాయకులు చూపించే శ్రద్ధ… ముహూర్త బలంపై కూడా అంతే ఎక్కువగా చూపిస్తారు అంటున్నారు.

ఇంతకీ విషయం ఏమిటనుకుంటున్నారా….! ఈనెల 8, 9 తేదీలలో మంచి ముహూర్త బలం ఉందట. అనేకమంది జాతకాలను అనుసరించి ఎంతో మంచి రోజులు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే ఈ రెండు రోజుల్లోనే పార్టీలు మారాలని, టిక్కెట్లు ఖరారు చేసుకోవాలని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తహతహలాడుతున్నారు.

ఈనెల 8వ తేదీ విదియ తిథి.. ఉత్త‌రాభాద్ర‌ నక్షత్రం. ఇవి రెండూ దాదాపు అందరికీ కలిసి వచ్చే… అనుకూలించే తిథి.. నక్షత్రం…గా జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చెప్పలేం కానీ.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మాత్రం 8వ తేదీ శుక్రవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే మాత్రం తమకు ఎంతో కలిసి వస్తుందని అంటున్నారు. ఇక ఈ నెల 9వ తేదీ ఫాల్గుణ శుద్ధ తదియ. రేవతి నక్షత్రం. ఎవరు ఎలాంటి పని ఆరంభించినా అది శుభం కలుగ చేస్తుంది అంటున్నారు.

ఈ ముహూర్త కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి వంటి వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇదే రోజున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు గౌరు చరిత దంపతులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

అన్నీ అనుకూలిస్తే లోక్ స‌భ మాజీ సభ్యుడు లగడపాటి కూడా ఇదే రోజున తెలుగుదేశం పార్టీలో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అనేక మంది రాజకీయ నాయకులు తమ ఎన్నికల కార్యాలయాలను కూడా ఈ రెండు రోజుల్లోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 8, 9 తేదీలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి అని అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు.

First Published:  6 March 2019 11:52 PM GMT
Next Story