Telugu Global
NEWS

కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ గోవిందా!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాసలే అవుతున్నాయి. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా రాజకీయం మాత్రం రోజురోజుకు రంజు గానే మారుతోంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన రాజకీయ వ్యూహాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. శాసన మండలి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తన రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ ని కోలుకోలేని దెబ్బ కొట్టారు. మండలిలో […]

కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ గోవిందా!
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాసలే అవుతున్నాయి. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా రాజకీయం మాత్రం రోజురోజుకు రంజు గానే మారుతోంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన రాజకీయ వ్యూహాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

శాసన మండలి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తన రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ ని కోలుకోలేని దెబ్బ కొట్టారు. మండలిలో ఐదు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి నలుగురు అభ్యర్థులు వారి మద్దతుతో మజ్లిస్ అభ్యర్థి ఒకరు పోటీలోకి దిగారు.

కాంగ్రెస్ పార్టీ కూడా తన బలంతో, తెలుగుదేశం పార్టీ సభ్యుల మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అయింది. శాసన మండలిలో సభ్యునిగా ఎన్నిక కావాలంటే పోటీ చేస్తున్న అభ్యర్థికి 21 ఓట్లు కావాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మంది శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు శాసనసభ్యులు కలిపి వారి తొలి ప్రాధాన్యత ఓట్లు గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని తెలంగాణ కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ శాసన సభ్యులు అందరూ తాము ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదంటూ ప్రకటించారు. ఆ సమావేశం జరిగిన 24 గంటల లోపే తెలంగాణలో రాజకీయం మారిపోయింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు ఆత్రం సుక్కు, రేగా కాంతారావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కలిశారు. అయితే, నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన వినతి పత్రాలు ఇచ్చామని వారిద్ద‌రూ ప్రకటించారు. అయితే మీడియాలో మాత్రం వారిద్దరూ పార్టీ మారుతున్నట్లు గా ప్రచారం జరిగింది.

ముఖ్యమంత్రిని కలిసిన 12 గంటల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఇద్దరు పార్టీ మారుతున్నట్లు గా ప్రకటించారు. శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వారిద్దరూ ప్రకటించారు. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. వారిద్దరిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా చూడాలని శాసనమండలి అధికారులను కోరారు.

తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నామని చెబుతున్న కాంగ్రెస్ శాసనసభ్యులు ఇద్దరు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామాలు చేసి అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిమ్మతిరిగి కారు కనిపించింది. తమ శాసనసభ్యులు 19 మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులతో కలిపి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని పలికిన కాంగ్రెస్ పార్టీ మన సభ్యులు చేతులు ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదురైంది.

కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా మ‌రో షాక్ ఎదురైంది. అదే తెలుగుదేశం శాస‌న‌స‌భ్యుడు సండ్ర వెంక‌ట వీర‌య్య తాను కూడా తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో తెలుగుదేశం నుంచి కూడా రావాల్సిన రెండు ఓట్ల‌లో ఒక‌టి గోవిందా అయిపోయింది. ఈ ప‌రిణామాల‌తో అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితికి చెందిన న‌లుగురు శాస‌న మండ‌లి అభ్య‌ర్ధులు, ఒక మ‌జ్లిస్ అభ్య‌ర్ధి గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క‌లా మార‌నుంది.

First Published:  3 March 2019 11:09 PM GMT
Next Story