Telugu Global
NEWS

చంద్రబాబు రైల్వే రాజకీయం!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త రాజకీయాలకు తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ ప్రకటన వంటి కీలక అంశాలను నాలుగున్నర ఏళ్ల పాటు పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు తాజాగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర రైల్వే శాఖామంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాశారు. అధికారం లోకి వచ్చి ఇన్నాళ్లయినా విశాఖ రైల్వే జోన్ పై పెదవి విప్పని చంద్రబాబు నాయుడు రైల్వే […]

చంద్రబాబు రైల్వే రాజకీయం!
X

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త రాజకీయాలకు తెరతీశారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ ప్రకటన వంటి కీలక అంశాలను నాలుగున్నర ఏళ్ల పాటు పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు తాజాగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర రైల్వే శాఖామంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాశారు. అధికారం లోకి వచ్చి ఇన్నాళ్లయినా విశాఖ రైల్వే జోన్ పై పెదవి విప్పని చంద్రబాబు నాయుడు రైల్వే జోన్ ప్రకటనపై లేఖ రాయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మార్చి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్నారు. తిరువనంతపురం నుంచి నేరుగా విశాఖపట్నం వచ్చే ప్రధాని అక్కడ బహిరంగ సభలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతారు. ఆ సభలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రైల్వే జోన్ కు సూత్రప్రాయంగా అంగీకరించే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు చెబుతున్నారు.

శాసనసభలో భారతీయ జనతా పార్టీ నేత విష్ణుకుమార్ రాజు కొద్ది రోజుల క్రితమే మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో భాగంగా రైల్వే జోన్ ప్రకటిస్తారని చెప్పారు. అంతేకాదు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడికి తెలియనివ్వకూడదని, ఒకవేళ తెలిస్తే ఆయన శంకుస్థాపన కూడా చేసేస్తారని వ్యంగ్యంగా అన్నారు.

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు రైల్వే జోన్ పై చేసిన ప్రకటన నవ్వు తెప్పించినా…. ఆయన చెప్పిన మాటలు మాత్రం వాస్తవాలని చంద్రబాబు నాయుడు లేఖ ద్వారా తెలుస్తోంది. ఒకటో తేదీన ప్రధాని విశాఖపట్నం వచ్చి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తానంటూ ఒకవేళ ప్రకటిస్తే రాజకీయంగా తమకు ఇబ్బంది వస్తుందని భావించిన చంద్రబాబు నాయుడు హఠాత్తుగా రైల్వే మంత్రికి లేఖ రాశారు అంటున్నారు.

విశాఖ బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోడీ నిజంగానే విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తే అది తన కారణంగానే అని చంద్రబాబు నాయుడు ప్రకటించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ప్రధాని రైల్వేజోన్ ప్రకటించకపోయినా ఈ అంశంపై తాను లేఖ రాశాను అంటూ ప్రజలను నమ్మించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలి అని నిజంగా ప్రధాని భావిస్తే చంద్రబాబు నాయుడు రాసిన లేఖ వల్ల అది ఆగిపోతుందని, ఆ తప్పును కూడా కేంద్ర ప్రభుత్వం పై వేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.

ఇలాంటి వ్యూహాలను, ఎత్తుగడలను ముందుగానే ఊహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు విష్ణుకుమార్ రాజు రైల్వే జోన్ విషయాన్ని చంద్రబాబు నాయుడుకు తెలియచేయకూడదని, ఒకవేళ తెలిస్తే ఆయన శంకుస్థాపన చేస్తారంటూ వ్యంగ్యంగా అనడం వెనుక ఇదే రహస్యం ఉందంటున్నారు.

ఈ లేఖ గురించి తెలిసిన బిజెపి నాయకులు, ఇతర పార్టీలకు చెందిన వారు, రాజకీయ విశ్లేషకులు “అమ్మో బాబు” అని ముక్కున వేలేసుకుంటున్నారు.

First Published:  26 Feb 2019 9:04 PM GMT
Next Story