Telugu Global
International

కరాచీ.... పాకిస్తాన్‌ది కాదు తెలంగాణది..!

పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని సామాన్యుల నుంచి దేశ నాయకుల వరకు పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా పాకిస్తాన్ వస్తువులు వాడటం, వారి బ్రాండ్స్ బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఒక తెలంగాణ బ్రాండ్ పాలిట శాపంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన కరాచీ బేకరీపై బెంగళూరులో దాడి జరిగింది. వెంటనే ఈ బేకరీని మూసేయాలని లేదా పేరు మార్చాలని డిమాండ్ […]

కరాచీ.... పాకిస్తాన్‌ది కాదు తెలంగాణది..!
X

పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని సామాన్యుల నుంచి దేశ నాయకుల వరకు పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా పాకిస్తాన్ వస్తువులు వాడటం, వారి బ్రాండ్స్ బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఒక తెలంగాణ బ్రాండ్ పాలిట శాపంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన కరాచీ బేకరీపై బెంగళూరులో దాడి జరిగింది. వెంటనే ఈ బేకరీని మూసేయాలని లేదా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు రెచ్చిపోయారు. దీనికి కారణం బేకరీ పేరులో ‘కరాచీ’ అని ఉండటమే. పాకిస్తాన్‌లోని ఒక నగరం పేరుతో ఉన్న ఈ బేకరీ అక్కడిదే అని భావించడమే.

కాగా, కరాచీ బేకరీ పాకిస్తాన్‌కు చెందినది కాదని.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిందని నిర్వాహకులు తెలియజేశారు. అంతే కాకుండా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఖాన్‌చంద్ రమ్నానీ ఈ బేకరీని స్థాపించినట్లు తెలిపారు.

1953లో మొజంజాహీ మార్కెట్ వద్ద తొలి సారిగా ఏర్పాటైన కరాచీ బేకరీ ఆ తర్వాత కాలంలో అంచెలంచలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలను నెలకొల్పిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కరాచీ బేకరీ ఎప్పుడూ భారత్‌దే అని దీనికి పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదని…. తమ సంస్థపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఒక సారి సరి చూసుకోమని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంతకు ఏం జరిగిందంటే బెంగళూర్ ఇందిరా నగర్ లో ఉన్న కరాచీ బేకరీ పై శనివారం నాడు హిందూ సంస్థల అభిమానులు సుమారు 20 మంది దాడి చేశారు. బలవంతంగా బేకరీలోకి వెళ్ళిన వీళ్ళు బేకరీ పేరు మార్చాలని లేదా మూసేయ్యాలని గొడవ చేశారు. ఇది కరాచీకి చెందిన బేకరీ కాదని 1953లో హైదరాబాద్ లో ప్రారంభించిన బేకరీ అని ఎంత చెప్పినా వినుకోకుండా బేకరీ పైన జాతీయ జెండాను కట్టించారు. బోర్డులోని కరాచీ పదం కనబడకుండా కప్పేయించారు.

ఈ దాడిలో పాల్గొన్న వారికోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు.

First Published:  24 Feb 2019 1:00 AM GMT
Next Story