Telugu Global
NEWS

కాంగ్రెస్ గెలిచిన చోట బాధ్యతలు హరీష్‌కు?

ఆయన ఏ పని చేసినా ఓ వ్యూహ‍ం ఉంటుంది. ఆయన ఏ ఎత్తు వేసినా ఓ రాజకీయ ఆలోచన దాగి ఉంటుంది. ఆయన అటు పార్టీలో నిర్ణయం తీసుకున్నా… ఇటు ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా దాని వెనుక రాజకీయ ప్రయోజనం ఉంటుంది. ఇవన్నీ ఎవరి గురించో ఈపాటికి తెలిసే ఉంటుంది. అవును ఆయనే… తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రెండున్నర […]

కాంగ్రెస్ గెలిచిన చోట బాధ్యతలు హరీష్‌కు?
X

ఆయన ఏ పని చేసినా ఓ వ్యూహ‍ం ఉంటుంది. ఆయన ఏ ఎత్తు వేసినా ఓ రాజకీయ ఆలోచన దాగి ఉంటుంది. ఆయన అటు పార్టీలో నిర్ణయం తీసుకున్నా… ఇటు ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా దాని వెనుక రాజకీయ ప్రయోజనం ఉంటుంది. ఇవన్నీ ఎవరి గురించో ఈపాటికి తెలిసే ఉంటుంది. అవును ఆయనే… తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల వరకూ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. ఇదేమిటీ అని ఆయన్ని అడిగిన వారు లేరు. తీరా మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తర్వాత మంత్రుల ఎంపిక చూసి ముక్కున వేలేసుకున్న వారే కాని ఇలా ఉందేమిటీ… సీనియర్లను పక్కన పెట్టారేమిటీ అని అడిగిన వారు కూడా లేరు. అదీ పార్టీలో ఆయనకున్న పట్టు.

మిగిలిన వారి సంగతేమో కాని… తన మేనల్లుడు, పార్టీలో సీనియర్ నాయకుడైన హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై మాత్రం పార్టీలో ఒకింత వ్యతిరేకత వస్తోంది. అయినా ఎవ్వరూ కిమ్మనని పరిస్థితి. అయితే, ఈ విషయం కె.చంద్రశేఖర రావుకు తెలియంది కాదు. అందుకే ఆయన కొత్త వ్యూహానికి రూపకల్పన చేశారంటున్నారు.

ఇంతకీ అదేమిటనుకుంటున్నారా…. ఏం లేదు… గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నియోజకవర్గాలు ఏ లోక్ సభ నియోజక వర్గాల పరిధిలోకి వస్తాయో వాటిని హరీష్ రావుకు అప్పగించాలని నిర్ణయించారట. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిపి తెలంగాణ ఎన్నికల్లో 21 స్ధానాల్లో విజయం సాధించాయి. ఈ నియోజక వర్గాలు ఏ ఏ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయో చూసి అక్కడ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో మంచి మెజార్టీ తీసుకువచ్చే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారని అంటున్నారు.

అంటే ఇది ఒక విధంగా హరీష్ రావుకు పరీక్ష వంటిదే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరిగి మెజార్టీ తీసుకురావడం అనేది కాసింత కష్టమైన పనే అంటున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నియోజక వర్గాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఆ పార్టీ సీనియర్ నాయకులవి. అక్కడ వారు ఏం చెబితే అది జరుగుతుంది. అందుకే వారు విజయం సాధించారు.

అలాంటి చోట్ల మూడు నెలల వ్యవధిలో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితికి మెజార్టీ తీసుకురావడమంటే కత్తి మీద సాము వంటిదే అంటున్నారు. హరీష్ రావు పని తీరుకు ఈ కొత్త పనిని గీటురాయిగా పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే అటు బాధ్యతలు ఇచ్చినట్లు అయ్యింది… హరీష్ రావును ఇరకాటంలో పెట్టినట్లు అయ్యింది అంటున్నారు పార్టీ నాయకులు. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వ్యూహమంటే.

First Published:  21 Feb 2019 11:24 PM GMT
Next Story