Telugu Global
NEWS

క్రీడారంగంలో ప్రేమ జంటలు

ఆటతో దగ్గరై ప్రేమతో ఒక్కటవుతున్న క్రీడాకారులు తరాలు, క్రీడలు వేరైనా నిత్యనూతనంగా ప్రేమవివాహాలు ప్రేమ సత్యం, ప్రేమ నిత్యం. ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేనేలేవు. యుగాలు, జగాలు మారినా ప్రేమ నిత్యనూతనం. అలాంటి అజరామరమైన ప్రేమను నేటితరం యువత… ప్రేమికుల దినోత్సవం పేరుతో పెంచుకొంటూ… పంచుకొంటోంది. ప్రేమకు క్రీడా, కళారంగాలు సైతం ఏమాత్రం మినహాయింపు కాదు. హద్దులెరుగని ప్రేమ…. ప్రేమంటే…నాలుగక్షరాల మాటమాత్రమే కాదు, రెండు హృదయాల సయ్యాట కూడా. ప్రేమకు కులం, మతం, జాతివివక్ష అంటూ ఏదీ లేదు. […]

క్రీడారంగంలో ప్రేమ జంటలు
X
  • ఆటతో దగ్గరై ప్రేమతో ఒక్కటవుతున్న క్రీడాకారులు
  • తరాలు, క్రీడలు వేరైనా నిత్యనూతనంగా ప్రేమవివాహాలు

ప్రేమ సత్యం, ప్రేమ నిత్యం. ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేనేలేవు. యుగాలు, జగాలు మారినా ప్రేమ నిత్యనూతనం. అలాంటి అజరామరమైన ప్రేమను నేటితరం యువత… ప్రేమికుల దినోత్సవం పేరుతో పెంచుకొంటూ… పంచుకొంటోంది. ప్రేమకు క్రీడా, కళారంగాలు సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

హద్దులెరుగని ప్రేమ….

ప్రేమంటే…నాలుగక్షరాల మాటమాత్రమే కాదు, రెండు హృదయాల సయ్యాట కూడా. ప్రేమకు కులం, మతం, జాతివివక్ష అంటూ ఏదీ లేదు. ప్రేమ ఎందుకు…ఎప్పుడు…ఎక్కడ…ఎలా కలుగుతుందో చెప్పడం సాహసమే అవుతుంది.

మాన్యుల నుంచి సామాన్యుల వరకూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ జడిలో తడిసినవారే. ప్రేమను పెళ్లితో ముగించి నిజమైన ప్రేమికులుగా మిగిలినవారే. క్రీడారంగంలో సైతం అలాంటి ప్రేమికులకు ఏమాత్రం కొదవలేదు.

ప్రేమ వివాహం అనేది ఓ మధురజ్ఞాపకం. కొందరు ప్రేమ వివాహాలు చేసుకొంటే…మరికొందరు..పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకోడం సాధారణ విషయమే. అయితే క్రీడారంగంలో అహరహం శ్రమిస్తూ…దేశ కీర్తి ప్రతిష్టల కోసం పాటుపడే క్రీడాకారులు సైతం.. పెళ్లికి ఏమాత్రం మినహాయింపు కాదు.

ప్రేమ నుంచి పెళ్లి వరకూ….

ప్రేమ రెండు హృదయాల స్పందనైతే…పెళ్లి రెండు కుటుంబాల మధ్య నిలిచిపోయే బంధం. మనిషి పుట్టుకకు మాత్రమే కాదు…. వివాహానికీ ఎంతో ప్రాధాన్యముంది.

పెళ్ళంటే… మూడుముళ్ళు… ఏడడుగులు మాత్రమే కాదు. యువతీ యువకులు… వివాహబంధంతో ఒక్కటై జీవనయానం సాగించే మధురఘట్టం. కష్టసుఖాలను, ఆటుపోట్లను ఎదుర్కొంటూ సాగించే సాహసయానం.

వివాహం…మానవజీవితంలో మాత్రమే కాదు…దేశం కోసం అహరహం శ్రమించే క్రీడాకారుల జీవితంలోనూ ఓ ప్రధాన భాగమే.

క్రీడారంగంలోనే ఎక్కువ….

క్రీడలే ఆశగా, శ్వాసగా… జీవితంగా భావించే క్రీడాకారులు సైతం…. ప్రేమకు, పెళ్లికి ఏమాత్రం అతీతులుకారు. పురుష, మహిళా క్రీడాకారులు… కలసి సాధన చేయటం,…ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనటం మామూలు విషయమే.

అయితే.. కలసి సాగించే ప్రయాణంలోనే ఒకరి భావాలు ఒకరికి నచ్చడం, భావోద్వేగాలను పంచుకోడం ద్వారా దగ్గరయ్యే క్రీడాకారులు లేకపోలేదు.

జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల మధ్య మాత్రమే కాదు…వివిధ దేశాల క్రీడాకారుల మధ్య స్నేహం చిగురించడం… అదికాస్త ప్రేమగా …పెళ్లిగా మారిన సందర్భాలు ఉన్నాయి.

సెర్బియా యువతితో తెలుగబ్బాయి పెళ్లి….

క్రీడలకు మాత్రమే కాదు…ప్రేమకు, పెళ్లికి హద్దులు, సరిహద్దులు లేవని…కులాలు, మతాలు, భాషాభేదాలు అసలే లేవని… తెలుగుతేజం, భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ జీవితాన్ని చూస్తేనే తెలుస్తుంది.

అంతర్జాతీయ చదరంగ పోటీలలో పాల్గొనే సమయంలో పరిచయమైన సెర్బియా గ్రాండ్ మాస్టర్ నదెద్జాను జీవిత భాగస్వామిగా చేసుకోడమే కాదు… తెలుగు సాంప్రదాయ వివాహం చేసుకోడం ద్వారా…. హరికృష్ణ… ప్రేమకు, పెళ్లికి సరికొత్త నిర్వచనం చెప్పాడు.

జర్నలిస్ట్ గా మారిన భారత మాజీ చెస్ ప్లేయర్ నిఖిలేష్ సైతం…కొలంబియా గ్రాండ్ మాస్టర్ ఏంజెలో కు తన ప్రేమను చాటి… వేలికి ఉంగరం తొడగటం ద్వారా సంచలనం సృష్టించాడు.

చదరంగ క్రీడకు చెందిన ఈ రెండుజంటలను చూస్తే…ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గోపీ-లక్ష్మి టు సైనా-కశ్యప్….

అంతేకాదు…భారత బ్యాడ్మింటన్ క్రీడలోనూ మనకు ప్రేమజంటలు ఎక్కువగానే కనిపిస్తాయి. వీరిలో ప్రేమను వివాహబంధంగా మార్చుకొన్నవారే అధికంగా ఉన్నారు.

ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, భారత ప్రస్తుత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్… మాజీ ఒలింపియన్ పీవీవీ లక్ష్మిని…తన జీవిత భాగస్వామిగా చేసుకొని… ఇద్దరు బిడ్డలతో పండంటి కాపురానికి యజమానిగా మారాడు.

మహిళా డబుల్స్ స్పెషలిస్ట్ గుత్తా జ్వాల- సింగిల్స్ విజేత చేతన్ ఆనంద్ ల బంధం పెళ్లి వరకూ వెళ్ళినా…. చివరకు వారి ప్రేమవివాహం…. లవ్ ఆల్ గానే ముగిసిపోయింది.

గత పదేళ్లుగా ప్రేమలో ఉన్నా… తమ ఆటకు ఏమాత్రం అంతరాయం కలుగనీయని… మరో బ్యాడ్మింటన్ జోడీ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ సైతం… వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

క్రికెటర్లతో ప్రేమాట….

భారత అనధికారిక జాతీయక్రీడ క్రికెట్ ను చూస్తే… క్రికెట్ స్టార్లకు… సినీ హీరోయిన్లతో ప్రేమ… పెళ్లి ఎక్కువగా కనిపిస్తాయి. నాటితరం పటౌడీ నుంచి నేటితరం విరాట్ కొహ్లీ వరకూ.. సినిమా, క్రీడారంగాల కలయికే కనిపిస్తుంది.

భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ… ఆరోజుల్లోనే బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగోర్ ను జీవితభాగస్వామిగా చేసుకొన్నారు.

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ…. బాలీవుడ్ భామ అనుష్కశర్మను పెళ్ళాడి…. తన జీవితాన్ని సాఫల్యం చేసుకొన్నాడు.

భారత లంబూ ఫాస్ట్ బౌలర్ , ఆరున్నర అడుగుల ఇశాంత్ శర్మ సైతం…ఆరడుగుల భారత బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమాసింగ్ ను తన అర్ధాంగిగా చేసుకొని వావ్ అనిపించాడు.

యువీ,భువీ, కార్తీలదీ అదే దారి….

టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ భువనేశ్వర్ కుమార్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ సైతం… ప్రేమ- పెళ్లితో తమ జీవితాలను సార్థకం చేసుకోగలిగారు.

జాతీయ క్రీడ హాకీ, అథ్లెటిక్స్ అంశాలలో సైతం మనకు ప్రేమ జంటలు కనిపిస్తాయి. ప్రేమను పెళ్లిగా మార్చుకొని హాయిగా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు.

ట్రిపుల్ ఒలింపియన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ముఖేశ్ కుమార్… ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళా హాకీ ప్లేయర్ నిధి ఖుల్లర్ ను పెళ్ళాడి… సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

మహిళల లాంగ్ జంప్ లో ప్రపంచ కాంస్య విజేత అంజూ సైతం… సహ అథ్లెట్ బాబీనే వివాహం చేసుకొని…ఎన్నో విజయాలను సొంతం చేసుకోగలిగింది. టేబుల్ టెన్నిస్, కుస్తీ లాంటి క్రీడల్లోనూ ప్రేమజంటలు అత్యంత అరుదుగా కనిపిస్తాయి.

ఇదంతా చూస్తుంటే… డాక్టర్లను డాక్టర్లు, యాక్టర్లను యాక్టర్లు పెళ్లాడటం ఎంత సహజమో…. క్రీడాకారులను క్రీడాకారులు జీవిత భాగస్వాములుగా చేసుకోడం అంతే సహజమని తేలిపోయింది.

రంగం ఏదైనా… ఎంత గొప్పవారైనా… ప్రేమల పడి… ఆ తర్వాత పెళ్లి ఒడికి చేరక తప్పదని ప్రత్యేకంగా చెప్పాలా మరి.

First Published:  13 Feb 2019 8:45 PM GMT
Next Story