Telugu Global
Cinema & Entertainment

"దేవ్" సినిమా రివ్యూ

రివ్యూ:  దేవ్ రేటింగ్‌:  1/5 తారాగణం: కార్తి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌,  ప్రకాష్‌ రాజ్‌ , రమ్యకృష్ణ  తదితరులు సంగీతం:  హారిస్‌ జయరాజ్‌ నిర్మాత:  బి. మధు, ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌  దర్శకత్వం:  రజత్ రవిశంకర్ తెలుగులో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉన్న కార్తీ ఈ మధ్య తన రేంజ్ సక్సెస్ అందుకుని చాలా కాలమే అయ్యింది. అందుకే దేవ్ వచ్చిందన్న సంగతి చాలా మందికి తెలియకుండానే థియేటర్లలోకి అడుగు పెట్టింది. అంచనాలు కూడా ఏమి లేవు కాబట్టే ఓపెనింగ్స్ కూడా డల్ గా ఉన్నాయి. […]

దేవ్ సినిమా రివ్యూ
X

రివ్యూ: దేవ్
రేటింగ్‌: 1/5
తారాగణం: కార్తి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రకాష్‌ రాజ్‌ , రమ్యకృష్ణ తదితరులు
సంగీతం: హారిస్‌ జయరాజ్‌
నిర్మాత: బి. మధు, ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌
దర్శకత్వం: రజత్ రవిశంకర్

తెలుగులో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉన్న కార్తీ ఈ మధ్య తన రేంజ్ సక్సెస్ అందుకుని చాలా కాలమే అయ్యింది. అందుకే దేవ్ వచ్చిందన్న సంగతి చాలా మందికి తెలియకుండానే థియేటర్లలోకి అడుగు పెట్టింది. అంచనాలు కూడా ఏమి లేవు కాబట్టే ఓపెనింగ్స్ కూడా డల్ గా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులను బట్టి సినిమా హిట్టా ఫట్టా ముందే చెప్పలేం.

అనగనగా ఓ హీరో. పేరు దేవ్ రామలింగం(కార్తీ). సాహసాలంటే బాగా ఇష్టం. రిస్కీ ఫోటోలు వీడియోలు తీసి అమ్ముతూ డబ్బులు చేసుకుంటూ ఉంటాడు. స్నేహితుడు ఇచ్చిన ఓ గొప్ప సలహాతో ఫేస్ బుక్ లో మేఘన(రకుల్ ప్రీత్ సింగ్)ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఏదో ప్రోడక్ట్ లాంచ్ లో తనను చూసి పరిచయం పెంచుకుంటాడు. ముందు వద్దన్నా వేరే అమ్మాయిని కాపాడిన ఓ గొప్ప వీడియో చూసి లవ్ లో పడిపోతుంది మేఘన. ఆ తర్వాత చిన్న గ్యాప్. కట్ చేస్తే ముంబైలో సెకండ్ ఇన్నింగ్స్ లవ్ లో పడిపోతారు. ఆ తర్వాత దేవ్ కు ఎవరెస్ట్ శిఖరం ఎక్కే సందర్భం వస్తుంది. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దేవ్ ప్రేమ ఏ మలుపు తీసుకుంది? అనేదే మిగతా కథ.

కార్తిలో ఉన్న మంచి నటుడు ఇందులో ఎందుకూ కొరగాకుండా పోయాడు. తన వరకు దేవ్ గా బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ దానికి కావాల్సిన బలమైన సన్నివేశాలు ఏమి లేకపోవడంతో దేవ్ పాత్ర పూర్తిగా తేలిపోయింది. చాలా నీరసంగా అనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఏదో మొక్కుబడిగా నటించేసింది. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణల కెరీర్లో అత్యంత పేలవమైన తక్కువ సీన్లున్న సినిమా ఇదేనేమో. హీరో ఫ్రెండ్ గా చేసిన నల్లబ్బాయ్ బాగా ఓవర్ చేసాడు. మరో ఫ్రెండ్ అమృతా లుక్ బాగుంది. ఇంకెవరి గురించి చెప్పుకున్నా దండగే.

దర్శకుడు రజత్ రవిశంకర్ అసలు కథే లేకుండా ఇంత ఖరీదైన సినిమా తీయించినందుకు మెచ్చుకోవాలి. భారీ తారాగణం, ఎంత అడిగితే అంత బడ్జెట్ ఇచ్చిన నిర్మాత, లావిష్ లొకేషన్స్ అన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసాడు. ఎక్కడా చిన్న సీన్ కూడా కన్విన్సింగ్ గా లేదు. కనీస హోమ్ వర్క్ లేకుండా ఇష్టం వచ్చినట్టు స్క్రిప్ట్ రాసుకుని లవ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుందో దేవ్ అంతకంటే దారుణంగా వచ్చింది. అందుకు పూర్తిగా బాధ్యత వహించాల్సింది దర్శకుడే.

ఫస్ట్ హాఫ్ నరకం అయితే సెకండ్ హాఫ్ దానికి బాబులా ఉందే అని ప్రతి ప్రేక్షకుడి చేత అనిపించడమే రజత్ సాధించిన సక్సెస్. పేలవమైన సన్నివేశాలు, అవసరానికి మించిన పాత్రల ఓవరాక్షన్ ఒకటా రెండా ఎన్ని రకాలుగా సినిమాను ఖునీ చేయాలో అన్ని రకాలుగా రజత్ దీన్ని పాడు చేసి పారేసాడు. ఒక్క పాజిటివ్ యాంగిల్ ఉన్నా క్షమించవచ్చు కానీ దానికి అవకాశం ఇవ్వలేదు.

హరీష్ జైరాజ్ లాంటి సంగీత దర్శకుడు కూడా ఏమి చేయలేకపోయాడు. వేల్ రాజ్ కెమెరా కొంతవరకు నయం. రూబెన్ ఎడిటింగ్ తప్ప అన్ని చేసినట్టు ఉన్నాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పాత్రలకు స్వంతంగా డబ్బింగ్ కూడా చెప్పించలేనంత బీదరికంలో నిర్మాతలు దీని హక్కులు కొన్నారు కాబోలు. తమిళ్ నిర్మాతలు మాత్రం పాపం భారీగా ఖర్చు పెట్టారు.

చివరిగా చెప్పాలంటే దేవ్ ఒక ఖరీదైన వృధా ప్రయత్నం. కార్తి లాంటి టాలెంట్ ఉన్న హీరో అయినా సరైన కథ కథనాలు లేకపోతే ఎంత తీసికట్టు సినిమాలో నటించవచ్చో నిరూపించేందుకే దేవ్ ఉపయోగపడింది తప్ప ఈ ఏడాది మరో డిజాస్టర్ తోడయ్యింది. జీరో అంచనాలతో ఎంత నరకమైనా భరిస్తాం అనుకుంటే తప్ప దేవ్ మిమ్మల్ని థియేటర్లో చివరి దాకా కూర్చోబెట్టలేడు. లేదు ఇలాంటి ఎన్నో సినిమాలు చూసి తట్టుకున్న గుండె అంటారా. అయినా కూడా దేవ్ సవాల్ విసురుతాడు. మీరు గెలవడమే కష్టం.

దేవ్ – కష్టమే దేవా

First Published:  14 Feb 2019 9:52 AM GMT
Next Story