Telugu Global
NEWS

చేరికలతో పార్టీల్లో చేటు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతూండడంతో రాజకీయ నాయకుల్లో సందడి పెరిగింది. దీంతో పాటు టిక్కెట్ ఆశిస్తున్న వారు తమకు టిక్కెట్ రాదేమోననే ఆందోళనతో పక్క పార్టీల వైపు చూడడం కూడా ప్రారంభమైంది. ఇది అధికార తెలుగుదేశంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, జనసేన వంటి పార్టీల్లో కూడా ఈ గోడ దూకుడు రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. ఈ చేరికలతో తాము బల పడ్డామని రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు చెబుతున్నా….అంతర్గతంగా మాత్రం ఆయా నియోజక […]

చేరికలతో పార్టీల్లో చేటు
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతూండడంతో రాజకీయ నాయకుల్లో సందడి పెరిగింది. దీంతో పాటు టిక్కెట్ ఆశిస్తున్న వారు తమకు టిక్కెట్ రాదేమోననే ఆందోళనతో పక్క పార్టీల వైపు చూడడం కూడా ప్రారంభమైంది. ఇది అధికార తెలుగుదేశంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, జనసేన వంటి పార్టీల్లో కూడా ఈ గోడ దూకుడు రాజకీయాలు ఎక్కువవుతున్నాయి.

ఈ చేరికలతో తాము బల పడ్డామని రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు చెబుతున్నా….అంతర్గతంగా మాత్రం ఆయా నియోజక వర్గాల్లోని నాయకుల్లో మాత్రం వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ తమకే టిక్కెట్ అని గంపెడాశలు పెట్టుకున్న వారికి కొత్తగా మరో పార్టీ నుంచి వచ్చి చేరిన వారు అడ్డంకిగా మారుతున్నారు. దీంతో ఆ నాయకులు మరో పార్టీలోకి మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

తాజాగా పర్చూరుకు చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర రావు కూమారుడు దగ్గుబాటి హితేష్ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న రావి రామనాథం బాబు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ రావి వర్గం పార్టీ అధిష్టానం వద్ద వాపోతోంది.

విజయవాడకు చెందిన వంగవీటి రాధ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో విజయవాడ పశ్చిమ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న దేవినేని అవినాష్ కినుక వహించారు. అయితే ఆయనకు తగిన న్యాయం చేస్తానంటూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయినా దేవినేని అవినాష్ వర్గీయులు మాత్రం ఆగ్రహంగానే ఉన్నారు.

ఇక విశాఖపట్నం జిల్లాలో సబ్బం హరి, కొణతాల రామక్రిష్ణ వంటి వారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం నాయకుల సఖ్యత మరింత దెబ్బతింటున్నది అంటున్నారు.

ఇక రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇక్కడి నుంచి జనసేన తరఫున పోటీ చేయాలని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు ఆకుల సత్యనారాయణ జనసేనలోకి రావడంతో వారికి గండి పడినట్లు అయ్యింది.

ఇలా ఆంధ్రప్రదేశ్ లో చాలా జిల్లాల్లో అన్ని పార్టీలకు టిక్కెట్ల ఇక్కట్లు తప్పడం లేదు. ఇవి ముందు ముందు మరింత పెరుగుతాయని అంటున్నారు.

First Published:  29 Jan 2019 5:00 AM GMT
Next Story