Telugu Global
NEWS

కాపులకు ఇస్తారు.... మరి మిగిలిన వారు?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల తాయిలాలు సిద్ధం చేసుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో దూరం చేసుకున్న అన్ని వర్గాలను తన వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి దూరమైన కాపులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా బలహీన వర్గాలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. భారతీయ […]

కాపులకు ఇస్తారు.... మరి మిగిలిన వారు?
X

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల తాయిలాలు సిద్ధం చేసుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో దూరం చేసుకున్న అన్ని వర్గాలను తన వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి దూరమైన కాపులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా బలహీన వర్గాలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ పది శాతం ప్రకటించిన రిజర్వేషన్లు రాష్ట్రాలు తమకు నచ్చిన విధంగా…. అనుకూలంగా వాడుకోవచ్చునని ఓ వెసులుబాటు కల్పించింది. దీంతో ఈ పది శాతం రిజర్వేషన్లలో ఎప్పటి నుంచో రిజర్వేషన్ ఉద్యమం చేస్తున్న కాపులకు అందులో ఐదు శాతం ఇచ్చి వారిని తమ వైపు తిప్పుకోవాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. దీనికి కాపులు అంగీకరిస్తారా… లేక విభేదిస్తారా అన్నది ప్రస్తుతానికి తేలకపోయినా…. ఇతర వర్గాల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కాపులు రెండు, మూడు జిల్లాల్లోనే ఉన్నారు. అయితే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు మాత్రం రాష్ట్రం మొత్తం ఉన్నాయి. రెండు మూడు జిల్లాల్లో ఉన్న కాపులకు మేలు చేసేందుకు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఆర్ధికంగా వెనుకబడిన వారిని వదిలేస్తే వారంతా తెలుగుదేశం పార్టీకి దూరం అవుతారని అంటున్నారు.

ఇదే విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో ఒకరిద్దరు మంత్రులు చంద్రబాబు నాయుడికి చెప్పినా “అది తర్వాత చూద్దాం ” అని అన్నట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నికలలో కాపులను తమ వైపు తిప్పుకుంటే అధికారం ఖయామని చంద్రబాబు భావిస్తున్నారు. కాని అగ్రకులాలలో బ్రహ్మణులు, వైశ్యులు, రెడ్లు, కమ్మ కులాలలో ఆర్దికంగా వెనుకబడిన వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారిని నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

First Published:  23 Jan 2019 7:53 PM GMT
Next Story