Telugu Global
Others

ముస్లిం స్త్రీలకు న్యాయం సరే.... మరి హిందూ స్త్రీలకు?

ముస్లిం మహిళల (పెళ్లి విషయంలో హక్కుల రక్షణ) బిల్లును లోకసభలో ఆమోదించడంతోనే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.) ప్రభుత్వం చాలా సంతృప్తిగా ఉన్నట్టుంది. ఈ బిల్లు ముమ్మారు తలాక్ విధానాన్ని చట్ట విరుద్ధం చేయడానికి ఉద్దేశించింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడానికి నిరాకరించి ఎన్.డి.ఎ. ప్రభుత్వం చర్చించడం, దీనితో సంబంధం ఉన్న వారిని సంప్రదించడం మొదలైన ప్రజాస్వామ్య ప్రక్రియలపై తమకు విశ్వాసం లేదని నిరూపించుకుంది. 12 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డవారికి మరణ శిక్ష […]

ముస్లిం స్త్రీలకు న్యాయం సరే.... మరి హిందూ స్త్రీలకు?
X

ముస్లిం మహిళల (పెళ్లి విషయంలో హక్కుల రక్షణ) బిల్లును లోకసభలో ఆమోదించడంతోనే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.) ప్రభుత్వం చాలా సంతృప్తిగా ఉన్నట్టుంది. ఈ బిల్లు ముమ్మారు తలాక్ విధానాన్ని చట్ట విరుద్ధం చేయడానికి ఉద్దేశించింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడానికి నిరాకరించి ఎన్.డి.ఎ. ప్రభుత్వం చర్చించడం, దీనితో సంబంధం ఉన్న వారిని సంప్రదించడం మొదలైన ప్రజాస్వామ్య ప్రక్రియలపై తమకు విశ్వాసం లేదని నిరూపించుకుంది.

12 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డవారికి మరణ శిక్ష విధించడానికి వీలుగా బిల్లు ఆమోదించేటప్పుడు…. అత్యాచారాలకు పాల్పడే వారిని సంప్రదించామా అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి ప్రశ్నించడం మరింత దారుణమైంది. పైగా ముమ్మారు ఒకే సారి తలాక్ అని విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణించడంతో సమస్యలున్నాయి. ఎందుకంటే పెళ్లి సివిల్ ఒప్పందం కనక దాన్ని ఉల్లంగిస్తే సివిల్ కేసుల్లో తీసుకునే చర్యలే తీసుకోవాలి. కాని ముమ్మారు తలాక్ ను నిషేధించే బిల్లు ఈ పద్ధతిని శిక్షించదగిన నేరంగా, జామీనుకు వీలు లేని నేరంగా పరిగణిస్తుంది.

2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలోనే ఈ బిల్లు తీసుకొచ్చామని చేప్తే కుదరదు. ఈ తీర్పులో ముమ్మారు తలాక్ ను నేరంగా పరిగణించాలని చెప్పిన తీర్పు మైనారిటీ తీర్పు మాత్రమే. ఈ వ్యవహారం వ్యక్తిగత చట్టాలకు, మత సంప్రదాయాలకు సంబంధించింది. ముస్లిం మహిళలకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమైతే పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యుడు ప్రతిపాదించిన ప్రైవేటు సభ్యుల బిల్లును పరిగణించాల్సింది.

ఈ బిల్లు విడాకుల వ్యవహారాన్ని క్రోడీకరించడానికి, పెళ్లిని రద్దు చేయడానికి న్యాయమైన ప్రక్రియను అనుసరించడానికి అనువైంది. అనేక మహిళా బృందాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ లో భాగస్వాములైన మహిళా బృందాలు విస్తృతమైన సంప్రదింపులు జరిపాలని కోరాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేని హడావుడితో న్యాయం కలగజేయాలన్న దృష్టితో కాకుండా ముమ్మారు తలాక్ విధానాన్ని నేరంగా పరిగణించడానికే ప్రాధాన్యం ఇచ్చింది.

అంతే గాక ఈ కేసులో మెజారిటీ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులు ముమ్మార్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమైందని, ఇస్లాం సంప్రదాయాలకే వ్యతిరేకమైందని స్పష్టంగా చెప్పినప్పుడు దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించవలసిన అవసరమేమొచ్చింది? ఒకే సారి మూడు సార్లు తలాక్ అని చెప్పే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించడానికి అవకాశం కల్పించడం…. విడాకుల బాధ అనుభవించే ముస్లిం మహిళలు ఎలా బతకాలన్న విషయాన్ని ఈ బిల్లు పట్టించుకోలేదని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, ముస్లిం మహిళలతో కలిసి పని చేసే సంస్థల వారు లేవనెత్తిన మౌలిక ప్రశ్నలను ప్రభుత్వం ఖాతరు చేయలేదు.

ముమ్మారు తలాక్ విధానాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించడానికి బదులు గృహ హింసలో భాగంగా పరిగణించి 2005 నాటి గృహ హింస నిరోధక చట్టం పరిధిలోకి తీసుకు రావాల్సింది. అలాగైతే భర్తలు వదిలేసిన మహిళల సమస్యలను పట్టించుకోవడానికి అవకాశం ఉండేది. ఈ పద్ధతి అనేక మతాల్లో ఉంది. ఒక్క ముస్లింలకే పరిమితమైన అంశం కాదు. కాని ఈ బిల్లు ముస్లిం పురుషులు ముమ్మారు తలాక్ విధానాన్ని అనుసరించినప్పుడే వర్తిస్తుంది తప్ప ఇతర మతాల వారు భార్యలను వదిలేసినప్పుడు వర్తించదు. ఇది చట్టం ముందు అందరూ సమానులేనన్న న్యాయ సూత్రానికి విరుద్ధమైంది. ముస్లింలు కాని మహిళలకు అన్యాయం చేసేది.

స్త్రీ పురుషుల మధ్య సమానత్వం సాధించడం ప్రభుత్వ లక్ష్యం అయి ఉంటే ఈ పని చేసేది. ఈ ప్రభుత్వ లక్ష్యం ఎప్పుడూ అనుమానాస్పదంగా, అధికారంలో ఉన్న పార్టీ, దానికి అండగా నిలిచే సంఘ్ పరివార్ సిద్ధాంతానికి అనువుగా ఉంది. పితృస్వామ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేదిగా ఉంది. 1951లో డా. బి.ఆర్. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును రూపొందించినప్పుడు హిందుత్వ వాదులు, సంఘ్ పరివార్ వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకత వివాహ చట్టాన్ని మార్చకూడదన్న ఎం.ఎస్. గోల్వాల్కర్ అభిప్రాయాలకు అనుకూలమైందే.

ముమ్మారు తలాక్ స్త్రీ పురుషుల సమానత్వానికి సంబంధించిందని, శబరిమల వివాదం సంప్రదాయానికి సంబంధించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం అంటే హిందూ సంప్రదాయమైతే అది స్త్రీ పురుష సమానత్వానికి విరుద్ధమైనదైనా ఆ సంప్రదాయాలను పరిరక్షించాలన్నదే ఆయన అభిప్రాయం. ఇలాంటి శక్తులు స్త్రీ పురుష సమానత్వాన్ని పరిరక్షిస్తామని చెప్పడం హాస్యాస్పదం.

ఈ శక్తులు ముస్లింలను పెట్టిన బాధలను, అవమానాలను, దౌర్జన్యాన్ని చూస్తే ఇవన్నీ శుష్క వాదనలుగానే మిగిలిపోతాయి. 2002 గుజరాత్ మారణకాండ సమయంలో ముస్లిం మహిళల విషయంలో అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. ఇది చాలదన్నట్టు ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారు సాహస కృత్యాలు చేసినట్టు అప్పుడు గుజరాత్ లో అధికారంలో ఉన్న పార్టీ కీర్తించింది.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పార్టీ గతంలో ఎలా వ్యవహరించింది, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఎలా వ్యవహరిస్తోంది? ముస్లిం సమాజం తరఫున సంస్కర్తగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతుంది. మూక దాడులను ప్రోత్సహిస్తున్నా, ముస్లింల మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నా అది వారిలో ఉన్న అభద్రతా భావానికి నిదర్శనం. ఏ మతంలో సంస్కరణలైనా ఆ మతం వారితో సంబంధం లేకుండా జరగ కూడదు. ఇలాంటి సంస్కరణలు చేసే అధికారం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఉందా అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం లేదు అనే.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

Next Story