Telugu Global
Sankranthi Essay

మ‌క‌ర సంక్రాంతి.... ఆనందాల క్రాంతి

ఖ‌గోళ‌ శాస్త్రానికి ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌య‌మే సంక్రాంతి పండుగ‌. సూర్యుడు మ‌క‌ర రాశిలో ప్ర‌వేశించే రోజును మ‌క‌ర సంక్ర‌మ‌ణం అంటారు. ఆ రోజున సూర్యుడు ద‌క్షిణాయ‌నం నుంచి ఉత్త‌రాయ‌ణంలోకి మార‌తాడు. మ‌క‌ర సంక్ర‌మ‌ణం జ‌రిగే స‌మ‌యాన్ని ఉత్త‌రాయ‌ణ పుణ్య‌కాలం ప్రారంభం అంటారు. ఈ పండుగ‌ను దాదాపుగా భార‌త‌దేశ‌మంత‌టా జ‌రుపుకుంటారు. ఇది కొన్ని చోట్ల‌ పంట‌ల పండుగ‌, కొన్ని చోట్ల ప‌తంగుల పండుగ‌. కొత్త అల్లుళ్ల పండుగ‌, కొత్త అల్లుళ్లకు పండుగ‌. పండుగ రోజు కొత్త దుస్తులు […]

మ‌క‌ర సంక్రాంతి.... ఆనందాల క్రాంతి
X

ఖ‌గోళ‌ శాస్త్రానికి ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌య‌మే సంక్రాంతి పండుగ‌. సూర్యుడు మ‌క‌ర రాశిలో ప్ర‌వేశించే రోజును మ‌క‌ర సంక్ర‌మ‌ణం అంటారు. ఆ రోజున సూర్యుడు ద‌క్షిణాయ‌నం నుంచి ఉత్త‌రాయ‌ణంలోకి మార‌తాడు.

మ‌క‌ర సంక్ర‌మ‌ణం జ‌రిగే స‌మ‌యాన్ని ఉత్త‌రాయ‌ణ పుణ్య‌కాలం ప్రారంభం అంటారు. ఈ పండుగ‌ను దాదాపుగా భార‌త‌దేశ‌మంత‌టా జ‌రుపుకుంటారు. ఇది కొన్ని చోట్ల‌ పంట‌ల పండుగ‌, కొన్ని చోట్ల ప‌తంగుల పండుగ‌. కొత్త అల్లుళ్ల పండుగ‌, కొత్త అల్లుళ్లకు పండుగ‌. పండుగ రోజు కొత్త దుస్తులు ధ‌రించ‌డం ఆనందాన్ని పెంచుకోవ‌డానికే కానీ ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి కాద‌ని మాత్రం ప్ర‌తి ఒక్క‌రూ గుర్తుంచుకోవాలి. అప్పుడే పండుగ‌లోని ప‌ర‌మార్థం నెర‌వేరుతుంది.

కొన్ని చోట్ల సంక్రాంతి రోజు పిల్ల‌ల చేత నువ్వులు- బెల్లం క‌లిపిన చిమ్మిలి ముద్ద‌ల‌ను తినిపిస్తారు. శీతాకాలం కాబ‌ట్టి ఒంటికి వేడిని, శ‌క్తినిచ్చే ఆహారాన్ని సంప్ర‌దాయం పేరుతో త‌ప్ప‌ని స‌రిగా తినిపించే చ‌క్క‌టి ఏర్పాటు ఇది. కంచు పాత్ర నిండుగా నువ్వుల‌ను దానం చేసే సంప్ర‌దాయం కొన్ని చోట్ల ఉంది. శ‌నిదోష నివార‌ణ కోసం అని చెబుతారు.

పెద్ద‌ల పండుగ

కొన్ని ప్రాంతాల వారికి సంవ‌త్స‌రంలో వ‌చ్చే పండుగ‌ల‌న్నింటిలోకి వేడుక‌గా చేసుకునే పండుగ ఇది. మిగిలిన అన్ని పండుగ‌ల‌కంటే పెద్ద పండుగ అనే ఉద్దేశంలో కూడా పెద్ద పండుగ అని వ్య‌వ‌హ‌రిస్తారు. ఇది పితృదేవ‌త‌లను స్మ‌రించుకునే పండుగ‌. పెద్ద‌వాళ్ల‌ను గుర్తు చేసుకునే పండుగ కావ‌డంతో పెద్ద పండుగ అంటారు.

చ‌నిపోయిన తాత‌య్య‌లు, జేజెవ్వ‌ల‌ను త‌లుచుకుంటారు. వాళ్ల‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. వాళ్ల ఫొటోల‌ను ప్రేమ‌గా తుడిచి, పూల దండ‌ల‌తో అలంక‌రించి తృప్తిగా చూసుకుని మురిసిపోతారు.

కొన్ని చోట్ల సంక్రాంతి పండుగ రోజు పితృదేవ‌త‌ల‌కు కొత్త‌దుస్తులు పెడ‌తారు. వారి ఫొటోల ముందు పెట్టి, వారి ఆశీర్వాదం ఇచ్చిన‌ట్లు భావించి ఆ దుస్తుల‌ను ఇంట్లో వాళ్లు క‌ట్టుకుంటారు. కొత్త బియ్యంతో బెల్లం పొంగ‌లి వండి పెద్ద‌వాళ్ల స‌మాధి మీద పెట్టి త‌ర్ప‌ణం వ‌దులుతారు.

పండుగ‌లెందుకు?

పండుగ‌ల‌న్నీ మ‌నుషుల సామాజిక బాంధ‌వ్యాన్ని ఏర్ప‌ర‌చ‌డానికి ఉద్దేశించిన‌వే. త‌మ ద‌గ్గ‌రున్న దానిని ఎదుటి వారికి ఇవ్వ‌డాన్ని నేర్పిస్తాయి పండుగ‌లు. ఇవ్వ‌డంలోని ఆనందాన్ని అనుభ‌వంలోకి తెస్తాయి. ఇత‌రుల‌తో క‌లిసి జీవించ‌డాన్ని నేర్పిస్తాయి.

అమ్మాయి చేత ఇంటి ముందు రంగ‌వ‌ల్లిక‌లు పెట్టించ‌డం, ఆవు పేడ‌తో గొబ్బెమ్మ పెట్టించ‌డం అమ్మ చూసుకుంటుంది. గాలి ప‌టాలు ఎగుర‌వేయ‌డం ఎలాగో అబ్బాయిల‌కు నాన్న‌లు నేర్పిస్తారు. ప‌ళ్లెం నిండుగా బియ్యం పోసుకుని వ‌చ్చి హ‌రిదాసు పాత్ర‌లో పోయ‌డానికి పిల్ల‌లు పోటీ ప‌డుతున్నారంటే ఆ పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం నేర్పించిన‌ట్లే.

గంగిరెద్దులు, బుడ‌బుక్క‌ల వాళ్లు, కొమ్ముబూర ఊదేవాళ్ల‌ను చూసి పిల్ల‌లు జీవ‌న నైపుణ్యాల‌ను తెలుసుకుంటారు. వీళ్లంద‌రికీ… రైతులు చేట‌ల నిండుగా ధాన్యం ఇవ్వ‌డాన్ని చూసి పిల్ల‌లు వృత్తుల‌కు – రైతుల‌కు మ‌ధ్య ఉండే అనుబంధాన్ని తెలుసుకుంటారు.

ఏడాదంతా పొలంలో శ్ర‌మించి పంట‌ను పండించిన రైతుకు అడుగ‌డుగునా స‌హాయం చేసిన వాళ్లంతా పంట చేతికి వ‌చ్చిన రోజు సంక్రాంతి ల‌క్ష్మిని త‌లుచుకుంటూ త‌మ వాటాను రైతుల‌ నుంచి ఆత్మీయంగా పుచ్చుకుంటారు.

First Published:  8 Jan 2019 6:55 AM GMT
Next Story