ఏడు దశాబ్దాల టీమిండియా కల నిజమాయెగా!
కంగారూ గడ్డపై చారిత్రాత్మక సిరీస్ విజయం 2-1తో ఆస్ట్రేలియాపై టీమిండియా సిరీస్ గెలుపు పూజారా, బుమ్రా షోతో విజేతగా టీమిండియా టెస్ట్ క్రికెట్లో టీమిండియా…ప్రపంచ నంబర్ వన్. నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలో సిరీస్ వెంట సిరీస్ విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న భారతజట్టు విదేశీగడ్డపై అత్యంత అరుదైన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న 7 దశాబ్దాల కలను ఎట్టకేలకు నిజం చేసుకొంది. ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్ […]
- కంగారూ గడ్డపై చారిత్రాత్మక సిరీస్ విజయం
- 2-1తో ఆస్ట్రేలియాపై టీమిండియా సిరీస్ గెలుపు
- పూజారా, బుమ్రా షోతో విజేతగా టీమిండియా
టెస్ట్ క్రికెట్లో టీమిండియా…ప్రపంచ నంబర్ వన్. నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలో సిరీస్ వెంట సిరీస్ విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న భారతజట్టు విదేశీగడ్డపై అత్యంత అరుదైన విజయం సాధించింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న 7 దశాబ్దాల కలను ఎట్టకేలకు నిజం చేసుకొంది.
ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం తిరుగులేని జట్టు ఏదంటే …విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా అని మాత్రమే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకూ స్వదేశంలో పులి, విదేశీగడ్డపై పిల్లి అన్న పేరు తెచ్చుకొన్న భారత టెస్ట్ జట్టు…. ఏడు దశాబ్దాల కలను ఎట్టకేలకు సాకారం చేసుకొంది.
1947 నుంచి పోరాటం….
1947 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ లు ఆడుతూ వచ్చినా…గత ఏడు దశాబ్దాల కాలంలో ఒక్కటంటే ఒక్క సిరీస్ నెగ్గలేదంటే ఆశ్చర్యమే మరి. సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండుల్కర్ వరకూ ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్ల నాయకత్వంలో ఆస్ట్రేలియా టూర్లకు వెళ్లినా భారతజట్లు టెస్ట్ సిరీస్ లు మాత్రం నెగ్గుకు రాలేకపోయాయి.
అయితే…ప్రస్తుత 2018-19 టెస్ట్ సిరీస్ లో మాత్రం…టీమిండియా విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించింది.
కొహ్లీ హోరు…. టీమిండియా జోరు….
విరాట్ కొహ్లీ నాయకత్వంలో టీమిండియా గత కొద్ది సంవత్సరాలుగా విజయ పరంపర కొనసాగిస్తూ వస్తోంది. ఆడిన గత 16 టెస్ట్ సిరీస్ ల్లో టీమిండియా ఏకంగా 12 విజయాలు నమోదు చేసింది.
శ్రీలంక, విండీస్ టూర్లలో సైతం సిరీస్ విజయాలు సాధించింది. అయితే…సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టూర్లలో మాత్రం టీమిండియా పోరాడి ఓడక తప్పలేదు.
అయితే…ఆస్ట్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో.. పదునైన బౌలింగ్, పటిష్టమైన బ్యాటింగ్ తో టీమిండియా చెలరేగిపోయింది.
అడిలైడ్ టెస్ట్ తో బోణీ కొట్టిన టీమిండియా…పెర్త్ టెస్ట్ లో కంగు తిన్నా ఆ తర్వాత జరిగిన మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో దూకుడు పెంచింది. తనకు పోటీనే లేదని నిరూపించింది.
స్మిత్, వార్నర్ లేని ఆసీస్….
ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాళ్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్..బాల్ టాంపరింగ్ ఆరోపణలతో గత ఏడాది కాలంగా నిషేధం లో ఉండటంతో…యువ ఆటగాడు టిమ్ పెయిన్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు…పవర్ ఫుల్ టీమిండియాకు ఏమాత్రం సరిజోడీ కాలేకపోయింది.
అప్పుడు కొహ్లీ…. ఇప్పుడు పూజారా….
2014 ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కొహ్లీ అత్యధిక పరుగులు సాధించిన మొనగాడిగా నిలిస్తే…ప్రస్తుత సిరీస్ లో మాత్రం వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పూజారా మూడు సెంచరీలతో సహా 521 పరుగులు సాధించడం ద్వారా.. టీమిండియా చారిత్రాత్మక విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
7 దశాబ్దాల నిరీక్షణకు తెర….
ఆస్ట్రేలియా గడ్డపై 1947లో తొలిటెస్ట్ మ్యాచ్ తో పాటు సిరీస్ ఆడిన టీమిండియా…గత ఏడు దశాబ్దాల కాలంలో 12 సిరీస్ ల్లో భాగంగా ఆడిన 48 టెస్టుల్లో టీమిండియాకు ఎనిమిది విజయాలు మాత్రమే ఉండటం విశేషం.
ఓవరాల్ గా టీమిండియా- ఆసీస్ జట్లు 26 సిరీస్ ల్లో తలపడితే …ఆస్ట్రేలియా 12 విజయాలు, టీమిండియా 9 సిరీస్ విజయాలు సాధించగా…ఐదు సిరీస్ లు డ్రాగా ముగిశాయి. మొత్తం 72 టెస్టుల్లో ఈ రెండుజట్లు ఢీ కొంటే…ఆస్ట్రేలియా 42 విజయాలు, టీమిండియా 29 విజయాలు సాధించాయి.
బ్యాటింగ్ లో చతేశ్వర్ పూజారా, మయాంక్ అగర్వాల్, కొహ్లీ, పంత్, బౌలింగ్ లో బుమ్రా, షమీ, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ అసాధారణంగా రాణించిన కారణంగానే టీమిండియా ఈ అపురూప విజయం సాధించగలిగింది.
మొత్తం మీద…ఆస్ట్రేలియా గడ్డపై గత 71 సంవత్సరాలుగా 11 టెస్ట్ సిరీస్ లు ఆడిన టీమిండియా ఎట్టకేలకు …విరాట్ కొహ్లీ నాయకత్వంలో తన కలను సాకారం చేసుకోగలిగింది.