Telugu Global
Sankranthi Essay

భోగి పండుగ‌.... సంతోషాల డోలిక‌

భోగి పండుగ వ‌స్తోంద‌నే క‌ర్టెన్ రైజ‌ర్‌ దాదాపు గా ఓ నెల రోజుల ముందు నుంచి మొద‌ల‌వుతుంది. హ‌రిదాసు సంకీర్త‌న‌ల‌తో చ‌లిని చీల్చుకుంటూ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వ‌చ్చి మ‌రీ గుర్తు చేస్తాడు. అమ్మాయిలు ఇంటి ముందు రంగ‌వ‌ల్లిక‌లు దిద్దుతూ ముగ్గు మీద అడుగు పెట్ట‌కుండా వెళ్ల‌మ‌ని హ‌రిదాసుకు జాగ్ర‌త్త చెబుతుంటారు. మ‌గ‌పిల్ల‌లు చ‌లిమంట కాచుకోవ‌డానికి ఏ చెట్టు కొమ్మ‌ను విర‌వాలా, ఏ ముళ్ల తీగ‌ను న‌రికి పోగు చేయాలా అని నెలంతా చెట్ల మీద‌నే గ‌డిపేస్తారు. చ‌లిమంట నుంచి […]

భోగి పండుగ‌.... సంతోషాల డోలిక‌
X

భోగి పండుగ వ‌స్తోంద‌నే క‌ర్టెన్ రైజ‌ర్‌ దాదాపు గా ఓ నెల రోజుల ముందు నుంచి మొద‌ల‌వుతుంది. హ‌రిదాసు సంకీర్త‌న‌ల‌తో చ‌లిని చీల్చుకుంటూ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వ‌చ్చి మ‌రీ గుర్తు చేస్తాడు. అమ్మాయిలు ఇంటి ముందు రంగ‌వ‌ల్లిక‌లు దిద్దుతూ ముగ్గు మీద అడుగు పెట్ట‌కుండా వెళ్ల‌మ‌ని హ‌రిదాసుకు జాగ్ర‌త్త చెబుతుంటారు.

మ‌గ‌పిల్ల‌లు చ‌లిమంట కాచుకోవ‌డానికి ఏ చెట్టు కొమ్మ‌ను విర‌వాలా, ఏ ముళ్ల తీగ‌ను న‌రికి పోగు చేయాలా అని నెలంతా చెట్ల మీద‌నే గ‌డిపేస్తారు. చ‌లిమంట నుంచి భోగి మంట వ‌ర‌కు ఆ సేక‌ర‌ణ కొనసాగుతూనే ఉంటుంది.

భోగిమంట‌

భోగి రోజు తెల్ల‌వారు జామున మూడు గంట‌ల నుంచి హ‌డావుడి మొద‌ల‌వుతుంది. తాటాకులు, ఎండు క‌ట్టెలతో నిప్పు పెట్టి పిల్ల‌లు ఆ భోగిమంట చుట్టూ చేరి సంద‌డి చేస్తారు. కొన్ని చోట్ల‌ ఇంట్లో వాడి వ‌దిలేసిన వ‌స్తువుల‌ను భోగిమంట‌లో వేసే అల‌వాటు కూడా ఉంటుంది. భోగిమంట‌లో తేగ‌ల‌ను కాలుస్తారు. భోగిమంట త‌ర్వాత అభ్యంగ‌న స్నానాలు చేస్తారు (నువ్వుల నూనెతో త‌లంటుకుని, సున్నిపిండితో న‌లుగు పెట్టుకుని, కుంకుడు కాయ‌ల ర‌సంతో త‌లరుద్దుకుని స్నానం చేయ‌డం).

ఈ స్నానంతో భోగిపీడ వ‌దులుతుంద‌ని విశ్వాసం. స్నానం త‌ర్వాత పిల్ల‌ల‌కు సాంబ్రాణి ధూపం వేసి త‌లార‌బెడ‌తారు. కొత్త దుస్తులు ధ‌రించి, త‌ల‌నిండుగా పూలు పెట్టుకుని క‌ళ‌క‌ళ‌లాడుతూ తిరుగుతుంటారు ఆడ‌పిల్ల‌లు. *ఇంటికి అందం తెచ్చేది ఆడ‌పిల్ల‌లే* అని మ‌ళ్లీ ఒక‌సారి గుర్తు చేసుకుంటారు తల్లిదండ్రులు. అమ్మ వాకిలి గ‌డ‌ప‌కు ప‌సుపు రాసి బొట్లు పెడితే, వాకిళ్ల‌కు మామిడి ఆకులు, బంతిపూల తోర‌ణాలు క‌డ‌తారు మ‌గ‌పిల్ల‌లు.

భోగిప‌ళ్లు

భోగిరోజు మ‌ధ్యాహ్నం లేదా సాయంత్రం చంటిపిల్ల‌ల‌కు భోగిప‌ళ్లు పోస్తారు. రేగుప‌ళ్లు, డ‌బ్బులు, చెర‌కు ముక్క‌లు, బంతిపూలు క‌లిపి పిల్ల‌ల త‌ల‌మీద పోస్తారు.భోగిప‌ళ్ల‌ను కొన్ని ప్రాంతాల్లో బోడిక‌లు అంటారు.

కింద‌ప‌డిన రేగుప‌ళ్లు, డ‌బ్బులు, చెర‌కు ముక్క‌ల‌ను ఆ వేడుక చూడ‌డానికి వ‌చ్చిన పిల్ల‌లు ఏరుకుంటారు. భోగిప‌ళ్లు పోస్తే ద్రుష్టిదోషం పోతుంద‌ని, ఆయుష్షు వ్రుద్ధి అవుతుంద‌ని విశ్వాసం.

తీపి జ్ఞాప‌కం!

కొంచెం ఊహ వ‌చ్చిన పిల్ల‌ల‌కు భోగిప‌ళ్లు పోయించుకోవ‌డం ఒక తీపి జ్ఞాప‌కం. చ‌క్క‌గా అలంక‌రించుకోవ‌డం, త‌న కోసం తోటి పిల్ల‌లు రావ‌డం, బంధువులు, ఇరుగు పొరుగు పెద్ద‌వాళ్లు వ‌చ్చి రేగుప‌ళ్లు పోస్తుంటే… అవి ఒంటి మీద నుంచి జ‌ల‌జ‌లా రాలి కింద ప‌డ‌డం పిల్ల‌ల‌కు మ‌ధురానుభూతి.

దిష్టి తొల‌గిపోయి సుఖంగా ఉండాల‌ని దీవిస్తుంటే… ఆ దీవెన‌కు అర్థం తెలియ‌క‌పోయినా త‌న కోసం, త‌న సంతోషం కోసం ఏదో చేస్తున్నార‌ని మాత్రం తెలుసుకుంటారు. అంతే… ఆనందంతో ముఖం వెలిగిపోతుంటుంది. ఏడాదంతా ఆ ఇంటిని ఆనంద డోలిక‌ల్లో ముంచెత్తే ఉయ్యాల‌లు ఆ వెలుగులే.

Next Story