Telugu Global
International

అహ్మ‌దాబాద్‌.... స‌బ‌ర్మ‌తి తీరాన వాణిజ్యం

అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో సంప‌న్న‌త కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటుంది. వ్యాపారం కోస‌మే పుట్టిన‌ట్లు ఉంటారు జ‌నం. అక్క‌డి వాళ్ల బ‌ల‌హీన‌త అంతా ముంబ‌యితో పోల్చుకోవ‌డంలోనే క‌నిపిస్తుంది. ”ముంబ‌యిలో కంటే అహ్మ‌దాబాద్ లో వ‌డాపావ్‌ బావుంటుంది” అనే మాట కోసం ప‌ర్యాట‌కుల‌ను ఆపి మ‌రీ గ‌రిటె నిండుగా వెన్న వేసి కాల్చి ఇస్తారు బండి వాళ్లు. నిజంగానే ముంబ‌యి వ‌డ‌పావ్ కంటే అహ్మ‌దాబాద్ వ‌డ‌పావ్ రుచిగా ఉంటుంది. ఆటోల వాళ్ల నుంచి చిన్న చిన్న వ్యాపారుల వ‌ర‌కు ఎవ‌రిని క‌దిలించినా ”గాంధీ […]

అహ్మ‌దాబాద్‌.... స‌బ‌ర్మ‌తి తీరాన వాణిజ్యం
X

అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో సంప‌న్న‌త కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటుంది. వ్యాపారం కోస‌మే పుట్టిన‌ట్లు ఉంటారు జ‌నం. అక్క‌డి వాళ్ల బ‌ల‌హీన‌త అంతా ముంబ‌యితో పోల్చుకోవ‌డంలోనే క‌నిపిస్తుంది.

”ముంబ‌యిలో కంటే అహ్మ‌దాబాద్ లో వ‌డాపావ్‌ బావుంటుంది” అనే మాట కోసం ప‌ర్యాట‌కుల‌ను ఆపి మ‌రీ గ‌రిటె నిండుగా వెన్న వేసి కాల్చి ఇస్తారు బండి వాళ్లు. నిజంగానే ముంబ‌యి వ‌డ‌పావ్ కంటే అహ్మ‌దాబాద్ వ‌డ‌పావ్ రుచిగా ఉంటుంది.

ఆటోల వాళ్ల నుంచి చిన్న చిన్న వ్యాపారుల వ‌ర‌కు ఎవ‌రిని క‌దిలించినా ”గాంధీ మా వాడు, ప‌టేల్ మా వాడు… దేశానికి విశేష‌మైన సేవ‌లందించిన వాళ్లు గుజ‌రాతీయులే” అని చెబుతూ తాజాగా మోదీ ఆ పరంప‌ర‌ను కొన‌సాగిస్తున్నాడ‌ని చెప్పుకుంటూ మురిసిపోతుంటారు.

స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం

అహ్మ‌దాబాద్ వెళ్లిన వాళ్లు మొద‌ట‌గా స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మానికి వెళ్లాల‌నుకుంటారు. జాతిపిత మ‌హాత్మా గాంధీజీ నివ‌సించిన ప్ర‌దేశం అనే భ‌క్తిభావంతో మునిగిపోతారు. స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం స‌బ‌ర్మ‌తి న‌ది తీరాన ఉంది. విశాల‌మైన ఆశ్ర‌మం. నిరాడంబ‌ర‌మైన క‌ట్ట‌డాలు. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం. ఈ ఆశ్ర‌మం ఆవ‌ర‌ణ‌లో భార‌త ప్ర‌ధాని- చైనా ప్ర‌ధాని విందార‌గించారు.

ఆశ్ర‌మంలో బుక్‌స్టాల్‌లో గాంధీజీ ఆటో బ‌యోగ్ర‌ఫీతో పాటు, అనువాదాలు, ఇత‌ర ర‌చ‌యిత‌లు రాసిన గాంధీజీ జీవిత సంగ్ర‌హాలు ఉంటాయి. బంధువులు, స్నేహితుల‌కు ఇవ్వ‌డానికి పెన్నులు, కీ చైన్‌లు, పెన్ స్టాండ్‌ల వంటి జ్ఞాపిక‌లుంటాయి. మ‌న పొట్టి శ్రీ‌రాములు గాంధీజీ శిష్యుడిగా ఈ ఆశ్ర‌మంలో చాలా కాలం నివ‌సించారు.

ఇక్క‌డ గాంధీ వ‌డికిన రాట్నం, గాంధీజీ సంద‌ర్శ‌కుల‌ను క‌లిసే గ‌ది, అందులో గాంధీజీ చేర‌గిల‌బ‌డిన ప‌రుపు, దిండు ఉంటాయి. వంట గ‌ది, బావి, చిన్న చిన్న స‌మావేశాల‌కు ఉప‌యోగించిన పెద్ద గ‌దులు వేటిక‌వి విడిగా ఉంటాయి.

ఇక్క‌డి నుంచి మ‌న‌కు మ‌న‌మే ఒక‌ ఉత్త‌రం రాసుకుని మ‌న అడ్ర‌స్‌కి పోస్ట్ చేసుకుంటే స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం ప‌ర్య‌ట‌న జ్ఞాప‌కం ఎప్ప‌టికీ మిగిలి ఉంటుంది.

ఆ క‌వ‌ర్ మీద పోస్ట‌ల్ స్టాంపులు అతికించాల్సిన అవ‌స‌రం లేదిక్క‌డ‌. ఆశ్ర‌మానికి ప్ర‌భుత్వం క‌ల్పించిన గౌర‌వం ఇది. చ‌ర‌ఖా గుర్తు ఉంటుంది.

సూర్యోద‌యాన చూడాల్సిన ప్ర‌దేశం స‌బ‌ర్మ‌తి రివ‌ర్ ఫ్రంట్‌. స‌బ‌ర్మ‌తి న‌దిని శుభ్ర‌ప‌రిచి రివ‌ర్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డంతో న‌గ‌ర వాసుల‌కు ఈవెనింగ్ షికారు చేయ‌డానికి అనువుగా మారింది. నాలుగేళ్ల కింద‌ట ఉన్న ప‌రిస్థితి గ‌త ఏడాదిన్న‌ర కింద‌టి నాటికి చాలా పెద్ద మార్పు క‌నిపించింది నాకు.

నిర్వ‌హ‌ణ‌లో శ్ర‌ద్ధ లోపించింద‌నే సంగ‌తి కొట్టొచ్చిన‌ట్లు తెలుస్తోంది. స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం త‌ర్వాత చూడాల్సిన ప్ర‌దేశం గుజ‌రాత్ విద్యాపీఠ్‌. క్లాస్ రూముల ద‌గ్గ‌ర‌కు ప‌ర్యాట‌కులను అనుమ‌తించ‌రు. కానీ విద్యాపీఠ్ ఆవ‌ర‌ణ‌లో నిశ్శ‌బ్దంగా ప‌ర్య‌టించి రావ‌చ్చు.

జ‌పాన్ ప్ర‌ధాని – భార‌త ప్ర‌ధాని

న‌గ‌రంలో మ‌రో ముఖ్య‌మైన క‌ట్ట‌డం స‌య్య‌ద్ సిద్దిఖీ జాలీ. ఇది అహ్మ‌ద్ షా మ‌సీదులో ఉంది. ఈ క‌ట్ట‌డం గోడ మీద చెక్కిన డిజైన్ ను చూస్తే కాగితం మీద పెన్సిల్ తో గీసినంత నైపుణ్యంగా ఉంటుంది.

2017లో మోదీ ద‌గ్గ‌రుండి జ‌పాన్ ప్ర‌ధానికి చూపించిన‌ నిర్మాణం ఇది. గుజ‌రాత్‌ని మొఘ‌లులు హ‌స్త‌గ‌తం చేసుకుని పాలించార‌న‌డానికి ఇది గొప్ప నిద‌ర్శ‌నం.

దీని త‌ర్వాత చూడాల్సిన మ‌రో నిర్మాణం స్వామి నారాయ‌ణ్ టెంపుల్‌. సాధార‌ణంగా స్వామి నారాయ‌ణ్ టెంపుల్స్ అన్నీ స్థూలంగా ఒకే నిర్మాణ‌శైలిలో ఉంటాయి . కానీ అహ్మ‌దాబాద్ ఆల‌యం పూర్తిగా భిన్నం.

ఇందులో రాజ‌కుటుంబంలో మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక విభాగం ఉంది. అందులో పూజారులు కూడా మ‌హిళ‌లే. కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌కు పూజాదికాల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం మంచి విష‌య‌మే అనిపిస్తుంది.

అహ్మ‌ద్ షా మ‌సీదులో కూడా మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక విభాగం ఉంది. జైన్ టెంపుల్ కూడా నిర్మాణ‌శైలి ప‌రంగా చూడాల్సిన ప్ర‌దేశం. 15వ తీర్థంక‌రుడు ధ‌ర్మ‌నాధుని ఆల‌యం ఇది. ఇక్క‌డి వ్యాపారుల్లో జైనులు ఎక్కువ‌. అందుకే జైన మందిరాల నిర్మాణం చాలా గొప్ప‌గా ఉంటుంది.

తీన్ ద‌ర్వాజా

న‌గ‌రంలోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల గురించి స్థానికుల‌ను అడిగితే ముఖ్యంగా ఆటోల వాళ్లు తీన్ ద‌ర్వాజా గురించి త‌ప్ప‌నిస‌రిగా చెబుతారు. అది ప్ర‌త్యేకంగా చూడాల్సిన నిర్మాణం ఏమీ కాదు, కానీ షాపింగ్ జోన్ దానికి అనుబంధంగా ఉంది కాబ‌ట్టి ప‌నిలోప‌నిగా చూడ‌వ‌చ్చు. ఇక్క‌డ‌ లా గార్డెన్ పెద్ద వ‌స్ర్త దుకాణాల స‌ముదాయం.

దాదాపుగా చాలా వ‌ర‌కు ముందుగ‌దిలో షాపు, వెనుక గ‌దుల్లో నివాసాలు ఉంటాయి. అహ్మ‌దాబాద్ ప‌ర్య‌ట‌న‌లో కాట‌న్ దుస్తులు త‌ప్ప‌కుండా కొనుక్కోవాలి. నాణ్య‌త, మ‌న్నిక బావుంటాయి.

హైద‌రాబాద్‌లో శిల్పారామం ఉన్న‌ట్లు అహ్మ‌దాబాద్‌లో కూడా అర్బ‌న్ హ‌ట్ ఉంది. అయితే చాలా చిన్న‌ది. మ‌న పోచంప‌ల్లి అక్క‌డి వాళ్ల‌కు కొత్త‌. న‌గ‌ర‌మే పెద్ద వ్యాపార స‌ముదాయం కావ‌డంతో ఇందులో వ్యాపారం పెద్ద‌గా ఉండ‌దు.

కంకారియా లేక్‌

న‌గ‌రంలో సాయంత్రాలు పిల్ల‌ల‌తో గ‌డ‌ప‌డానికి మంచి ప్ర‌దేశం. రాత్రిళ్లు లైట్ల వెలుతురులో మ‌న నెక్లెస్ రోడ్‌ను త‌ల‌పిస్తుంటుంది. ప‌ర్యాట‌కులు అంత స‌మ‌యం దాని కోసం వెచ్చించ‌డం వేస్ట్ అనే చెప్పాలి.

లీజ‌ర్ టైమ్‌ని గ‌డ‌ప‌డానికే కానీ చూడ‌డానికి కాదు. టైమ్ త‌క్కువ‌గా ఉన్నా స‌రే ఇటెన‌రీలో చేర్చుకోవాల్సిన‌వి కాలికో మ్యూజియం.

ప‌త్తి నుంచి దారం వ‌డ‌క‌డం నుంచి ర‌క‌ర‌కాల వ‌స్ర్త ప‌రిశ్ర‌మ సాధించిన పురోగ‌తి మొత్తం క‌ళ్ల‌కు క‌డుతుంది. ఇది ఒక ఎడ్యుకేష‌న్‌.

అలాగే వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ మ్యూజియం కూడా. ఫాస్ట్‌గా చూస్తూ వెళ్లినా కూడా క‌నీసం ఒక గంట స‌మ‌యం ప‌డుతుంది. ప‌టేల్ జీవితం మొత్తాన్ని ఆవిష్క‌రించారు ఈ మ్యూజియంలో. టెక్నాల‌జీని కూడా అద్భుతంగా ఉప‌యోగించారు.

పొలిమేర దాటితే…

ఆటో వ‌ర‌ల్డ్ వింటేజ్ కార్ మ్యూజియం స్వాగ‌తం ప‌లుకుతుంది. అహ్మ‌దాబాద్‌కు నాలుగైదు కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది క‌త్వారా గ్రామం. అందులోనే ఉంది ఆటో వ‌ర‌ల్డ్ వింటేజ్ మ్యూజియం. ఇందులో సుమారు యాభై వ‌ర‌కు కార్ల మోడ‌ళ్లున్నాయి. కారుకు హార‌న్ లేకుండా గంట వాయిస్తూ ప్ర‌యాణించిన‌వి కూడా ఉన్నాయి.

జ‌న‌ర‌ల్ మోటార్స్ త‌యారు చేసిన వాటి నుంచి ఇంపోర్టెడ్ మోడ‌ల్స్ వ‌ర‌కు ఉన్నాయి. మోటార్ సైకిళ్లు, బ‌గ్గీలు కూడా చూడ‌వ‌చ్చు. మెర్సిడెస్‌, మేబాక్‌, పాకార్డ్స్‌, కాడిలాక్స్‌, కోర్డ్‌, లాన్షియ‌స్‌, లింక‌న్, రోల్స్ రాయిస్‌, బెంట్లీస్‌, లాంగోడాస్ వ‌ర‌కు మ‌నం పేర్లు మ‌ర్చిపోయిన మోడ‌ళ్లు ఉన్నాయి. ఇక్క‌డ మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే… ఈ కార్ల‌లో ప్ర‌యాణించ‌వ‌చ్చు. కొన్ని ర‌న్నింగ్ కండిష‌న్‌లోనే ఉన్నాయి.

అయితే వీటిలో ప్ర‌యాణించ‌డం… విమానంలో బిజినెస్ క్లాస్‌కంటే ఖ‌రీదు. టికెట్‌ ఐదువంద‌లు ఉంటుంది. మూడున్న‌ర కిలోమీట‌ర్ల దూరం తిప్పుతారు. ఇద్ద‌రు వెళ్ల‌వ‌చ్చు. ఈ టికెట్ వింటేజ్ మ్యూజియం ఎంట్రీ టికెట్ కాదు. అది వేరు. ఈ ఐదు వంద‌లు కేవ‌లం వింటేజ్ కారులో ప్ర‌యాణించ‌డానికే. వింటేజ్ కారులో ప్ర‌యాణించి వ‌చ్చిన త‌ర్వాత మంచి టీ ఇస్తారు. అది కాంప్లిమెంట‌రీ.

దిగుడు బావి

అహ్మ‌దాబాద్‌కు 17 కిలోమీట‌ర్ల దూరాన ఉంది అదాల‌జ్ కా వావ్‌. ఇది ఐదంత‌స్థుల దిగుడుబావి. నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. వావ్ అంటే బావి అని అర్థం. బావి చుట్టూ రాతి నేల‌.

ఎండ తీవ్ర‌త ఎలా ఉన్న‌ప్ప‌టికీ బావి ఆవ‌ర‌ణ చ‌ల్ల‌గా ఉంటుంది. రాణివాస‌పు స్ర్తీలు వ్యాహ్యాళికి అనువైన ప్ర‌దేశం ఇది.

భూగ‌ర్భ నీటి మ‌ట్టాన్ని ర‌క్షించ‌డానికి ఉద్దేశించిన ఈ నిర్మాణాల్లో అద్భుత‌మైన శిల్ప నైపుణ్యం ఉంటుంది. గ‌వాక్షాలు రాణివాసాన్ని త‌ల‌పిస్తాయి. సాధార‌ణంగా గుజ‌రాత్ అన‌గానే రాణీకీ వావ్ చూడ‌డానికి ప్రాధాన్యం ఇస్తారు. అదాల‌జ్ వావ్ కంటే రాణీ కీ వావ్ పెద్ద‌ది. నిర్మాణ కౌశ‌లం కూడా ఇంకా నైపుణ్యంగా ఉంటుంది.

అయితే రాణీకీ వావ్‌ అహ్మ‌దాబాద్‌కి నూట పాతిక కిలోమీట‌ర్ల దూరం. వీల‌యితే రాణీ కీ వావ్‌ని క‌లుపుకోవ‌చ్చు. వీలుకాద‌నిపిస్తే అదాల‌జ్ కా వావ్‌ను చూడ‌వ‌చ్చు.

అక్ష‌ర్‌ధామ్‌

దీనిని స్వామి నారాయ‌ణ అక్ష‌ర్‌ధామ్ అంటారు. అహ్మ‌దాబాద్ న‌గ‌రానికి 40 కి.మీ.ల‌దూరంలో గాంధీ న‌గ‌ర్‌లో (గుజ‌రాత్ రాజ‌ధాని) ఉంది. నిర్మాణ‌ప‌రంగా చూడాల్సిన ప్ర‌దేశ‌మే.

మొత్తం చూడ‌డానికి క‌నీసం మూడు గంట‌లు ప‌డుతుంది. వేగంగా చూసినా గంట‌న్న‌ర ప‌డుతుంది. ఈ ఆల‌యాన్ని ద‌గ్గ‌ర నుంచి చూడ‌డం కంటే దూరం నుంచి చూస్తేనే వ్యూ బాగుంటుంది.

– మంజీర‌

First Published:  4 Jan 2019 7:30 PM GMT
Next Story