Telugu Global
International

దిల్‌వారా.... మ‌న‌సుతో క‌ట్టిన ప్రేమాల‌యం

రాజ‌స్థాన్‌లో క‌ట్ట‌డాలంటే మార్బుల్ నిర్మాణాలే గుర్తుకు వ‌స్తాయి. మ‌హోన్న‌త‌మైన కోట‌ల్లో పాల‌రాతితో అందంగా మ‌లిచిన ప్యాలెస్‌లు క‌ళ్ల‌ముందు మెద‌లుతాయి. మౌంట్ అబూలో ఉన్న ఆల‌యాలు పూర్తిగా పాల‌రాతి నిర్మాణాలే. పునాది నుంచి శిఖ‌రం వ‌ర‌కు ఎక్క‌డా మ‌రో రాయి క‌నిపించ‌దు. దిల్‌వారా జైన్ టెంపుల్స్ ఐదు ఆల‌యాల స‌మూహం. దేనిక‌దే ప్ర‌త్యేక‌మైన శిల్ప‌ నైపుణ్యంతో అల‌రారుతుంటాయి. మౌంట్ అబూ ప‌ట్ట‌ణానికి రెండున్న‌ర కిలోమీట‌ర్ల దూరాన ఉన్నాయి ఈ ఆల‌యాలు. మౌంట్ అబూలో ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌ల‌ను చూసుకుంటూ ప్ర‌యాణిస్తారు […]

దిల్‌వారా.... మ‌న‌సుతో క‌ట్టిన ప్రేమాల‌యం
X

రాజ‌స్థాన్‌లో క‌ట్ట‌డాలంటే మార్బుల్ నిర్మాణాలే గుర్తుకు వ‌స్తాయి. మ‌హోన్న‌త‌మైన కోట‌ల్లో పాల‌రాతితో అందంగా మ‌లిచిన ప్యాలెస్‌లు క‌ళ్ల‌ముందు మెద‌లుతాయి. మౌంట్ అబూలో ఉన్న ఆల‌యాలు పూర్తిగా పాల‌రాతి నిర్మాణాలే. పునాది నుంచి శిఖ‌రం వ‌ర‌కు ఎక్క‌డా మ‌రో రాయి క‌నిపించ‌దు.

దిల్‌వారా జైన్ టెంపుల్స్ ఐదు ఆల‌యాల స‌మూహం. దేనిక‌దే ప్ర‌త్యేక‌మైన శిల్ప‌ నైపుణ్యంతో అల‌రారుతుంటాయి. మౌంట్ అబూ ప‌ట్ట‌ణానికి రెండున్న‌ర కిలోమీట‌ర్ల దూరాన ఉన్నాయి ఈ ఆల‌యాలు. మౌంట్ అబూలో ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌ల‌ను చూసుకుంటూ ప్ర‌యాణిస్తారు కాబ‌ట్టి మ‌రో ప్ర‌దేశానికి వెళ్లిన‌ట్లు అనిపించ‌దు.

అబూలో ఇదొక‌ భాగంగా అనిపిస్తుంది. ఇది దిగంబ‌ర జైన‌మ‌తాన్ని ప్ర‌తిబింబించే ఆల‌యం. శ్వేతాంబ‌ర జైనులు రోజూ వ‌చ్చి ద‌ర్శ‌నాలు, పూజ‌లు చేసుకుంటారు.

రెండు వంద‌ల ఏళ్లు క‌ట్టారు

ఇంత పెద్ద ఆల‌యాల‌ను క‌ట్ట‌డానికి ఎన్నాళ్లు ప‌ట్టిందో అని ఆశ్చ‌ర్య‌పోయే లోపు గైడ్ పాఠం మొద‌లుపెడ‌తాడు. ప‌ద‌కొండ‌వ శ‌తాబ్దం నుంచి ప‌ద‌మూడ‌వ శ‌తాబ్దం వ‌ర‌కు సాగింది నిర్మాణం.

ప‌న్నెండు వంద‌ల మీట‌ర్ల‌ ఎత్తు కొండ‌ల మీద ఇంత పెద్ద ఆల‌యాల నిర్మాణానికి పాల‌రాయి ఎలా వ‌చ్చిందా అని చుట్టూ చూస్తే… అంత పెద్ద కొండ‌ల్లో ఏ వైపూ పాల‌రాయి క‌నిపించ‌దు. నిర్మాణానికి కావ‌ల్సిన రాయిని ఏనుగుల మీద కొండ మీద‌కు ర‌వాణా చేశారు.

మైనాన్ని మ‌లిచారా, రాతిని చెక్కారా!

పాల‌రాయిలో చెక్కిన శిల్పాల‌ను చూస్తే నిజంగా రాతినే చెక్కారా లేక మైనం బొమ్మ‌లు చేసి రాతి స్తంభానికి అమ‌ర్చారా అనే సందేహం వ‌స్తుంది. తామ‌ర పూల రెక్క‌లు నిజ‌మైన పూల రెక్క‌లు ఉండేటంత కోమ‌లంగా ఉంటాయి. పువ్వు రెక్క‌లో ఉండే ఈనెలు కూడా పాలరాయిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. స్తంభాల మీద రూపాల‌న్నీ ఒకేలా ఉన్న‌ట్లు అనిపిస్తాయి.

గైడ్ చెప్పిన త‌ర్వాత నాట్య‌గ‌త్తెల‌ను ప‌రిశీల‌న‌గా చూస్తే ఏ రెండు శిల్పాలు ఒక ఆకృతిలో ఉండ‌వు. దేనిక‌దే భిన్నం. జైన‌, హిందూ ధార్మిక సాహిత్యంలోని స‌న్నివేశాలు గోడ‌ల మీద‌, పై క‌ప్పుకి ఉంటాయి. దిల్‌వారా ఆల‌యాల స్తంభాలు, గోడ‌లు, గ‌ర్భాల‌యంలోని విగ్ర‌హాల కంటే పై క‌ప్పులు మ‌రీ అద్భుతంగా ఉంటాయి.

ఆ శిల్పాల నైపుణ్యాన్ని వ‌ర్ణించ‌డానికి ఇంకా ఎన్ని మాట‌లు కావాలో ఊహ‌కు అంద‌దు. ప‌ది వాక్యాల్లో చెప్ప‌లేని విష‌యాన్ని ఒక్క ఫొటో చెప్తుంది. అయితే ఇక్క‌డ ఫొటోగ్ర‌ఫీకి అనుమ‌తి ఉండ‌దు. ప‌ర్యాట‌కులు కెమెరాల‌ను బ‌య‌ట వ‌దిలి వెళ్లాలి.

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ కావ‌డంతో ఫోన్‌ల మీద కూడా నిఘా పెడుతున్నారు. కెమెరా లేని ఫోన్‌లు త‌ప్ప మిగిలిన ఫోన్‌ల‌ను అనుమ‌తించ‌రు.

నాలుగు ప్ల‌స్ ఒక‌టి

దిల్‌వారా జైన్ టెంపుల్స్ ఐదు ఆల‌యాల స‌మూహ‌మే, కానీ… ప్ర‌ధాన ఆల‌యాలు నాలుగే. ముందుగా నిర్మాణానికి ప్ర‌ణాళిక వేసుకున్న‌ది నాలుగు ఆల‌యాల‌కే. ఆ నాలుగు ఆల‌యాల నిర్మాణం పూర్త‌యిన త‌ర్వాత మిగిలి పోయిన పాల‌రాయి దిమ్మెలు, శిల్పాలు చెక్కిన‌ప్పుడు రాలిప‌డిన పాల‌రాతి పొడితో నిర్మించిన ఆల‌యం ఐద‌వ‌ది.

దిల్‌వారా టెంపుల్స్ చూడ‌డానికి వెళ్లిన‌ప్పుడు మొద‌ట‌గా క‌నిపించే ఆల‌యం కూడా అదే. నాలుగు ఆల‌యాల నిర్మాణం పూర్త‌యిన త‌ర్వాత కొద్దిరోజులు అక్క‌డే ఉండి ఆట‌విడుపుగా నిర్మించారు. ఈ ఆల‌యాన్ని నిర్మించ‌డానికి కూలి తీసుకోలేద‌ట. ప్రేమ‌తో నిర్మించిన ఆల‌యం కాబ‌ట్టి దానికి దిల్‌వారా అని పేరు పెట్టారు. అది బాగా పాపుల‌ర్ అయింది.

చివ‌రికి ప్ర‌ధాన ఆల‌యాల‌కు కూడా ప్రేమ‌తో క‌ట్టిన వారా పేరే వాడుక‌లోకి వ‌చ్చింది. ఆ ఆల‌యాల్లోని దేవ‌త‌ల పేర్లు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. మిగిలిన నాలుగు ఆల‌యాల గ‌ర్భ‌గుడిలో… ఆదినాథుడు, వృష‌భ నాథుడు, నేమినాథుడు, మ‌హావీరుని ప్ర‌తిమ‌లుంటాయి.

వింట‌ర్ ఫెస్ట్‌

మౌంట్ అబూ అన‌గానే హిల్‌స్టేష‌న్ కాబ‌ట్టి స‌మ్మ‌ర్‌లో వెళ్లాల్సిన ప్ర‌దేశం అనుకుంటారు. కానీ ఇక్క‌డ వింట‌ర్ ఫెస్టివ‌ల్ ప్ర‌త్యేకం. ఆ వేడుక‌ల్లో రాజ‌స్థాన్ సంప్ర‌దాయ దుస్తుల్లో, మేవాడ్ సంప్ర‌దాయ నాట్యాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఇది సాహ‌స యాత్రకు కూడా మంచి లొకేష‌నే.

రాక్ క్లైంబింగ్‌, మౌంటెయిన్ బైకింగ్ చేయ‌వ‌చ్చు. చిన్న‌ పిల్ల‌ల‌తో వెళ్లిన వాళ్లు వాక్స్ మ్యూజియం, బ‌ర్డ్ సాంక్చురీల‌ను త‌ప్ప‌కుండా చూడాలి.

మోస‌పోయేదెక్క‌డ‌?

టూరిస్టు ప్ర‌దేశాలతో మోసం అంట‌కాగుతూనే ఉంటుంది. ముంద‌స్తు స‌మాచారంతో వెళ్ల‌క‌పోతే ట్యాక్సీ డ్రైవ‌ర్లు కొద్దిదూరానికే విప‌రీత‌మైన చార్జీల‌తో బాదుతారు. వాటితోపాటు మౌంట్ అబూలో మ‌రో మోసం కూడా ఉంటుంది. ఫేమ‌స్ చైన్ హోట‌ళ్ల పేరుతో లోక‌ల్ హోట‌ళ్లుంటాయి. స్పెల్లింగ్‌లో ఎక్క‌డో ఒక్క అక్ష‌రాన్ని మారుస్తారు లేదా చేరుస్తారు. ఉచ్చార‌ణ‌లో ఏ మార్పూ ఉండ‌దు.

బ్రాండెడ్ చైన్ హోట‌ల్ కాబ‌ట్టి అంత‌టి స‌ర్వీస్ ఉంటుంద‌ని ఊహిస్తాం. తీరా అక్క‌డికి వెళ్తే మ‌ధ్య‌స్థం, అంత‌కంటే త‌క్కువ స్థాయిలోనే ఉంటుంది స‌ర్వీస్‌. ఒక్క మాట‌లో చెప్పాలంటే డ‌బ్బు బాదుతారు, సోసో స‌ర్వీస్ ఇస్తారు.

ఈ ఒక్క ప్ర‌దేశం అనే కాదు, ఎక్క‌డికైనా స‌రే… ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేట‌ప్పుడు అక్ష‌రాల‌ను స్ప‌ష్టంగా చ‌ద‌వాలి. లోగోను గ‌మ‌నించాలి. బ్రాండెడ్ హోట‌ళ్ల‌కు లోగో, లెట‌ర్ స్ట‌యిలింగ్ ప్ర‌త్యేకంగా ఉంటాయి.

-మంజీర‌

Next Story