Telugu Global
NEWS

2018 లో భారత మహిళల అపురూప విజయాలు

బ్యాడ్మింటన్లో సింధు, సైనా ఇద్దరూ ఇద్దరే మహిళా బాక్సింగ్ ఎవర్ గ్రీన్ స్టార్ మేరీ కోమ్ వన్డే, టీ-20 ప్రపంచకప్ టోర్నీల్లో హర్మన్, మిథాలీ జోరు హెప్టాథ్లాన్ లో స్వర్ణం నెగ్గిన భారత తొలి మహిళ స్వప్న పిస్టల్ షూటింగ్ లో యువ సంచలనం మను బాకర్         గిర్రున తిరిగిపోయే కాలచక్రంలో…సంవత్సరాలు వస్తూ…పోతూ ఉంటాయి. దానికి క్రీడారంగం సైతం ఏమాత్రం మినహాయింపు కాదు. భారత మహిళలు గత ఏడాది కాలంలో…వివిధ క్రీడల్లో అత్యుత్తమంగా రాణించారు. కళ్లు చెదిరే […]

2018 లో భారత మహిళల అపురూప విజయాలు
X
  • బ్యాడ్మింటన్లో సింధు, సైనా ఇద్దరూ ఇద్దరే
  • మహిళా బాక్సింగ్ ఎవర్ గ్రీన్ స్టార్ మేరీ కోమ్
  • వన్డే, టీ-20 ప్రపంచకప్ టోర్నీల్లో హర్మన్, మిథాలీ జోరు
  • హెప్టాథ్లాన్ లో స్వర్ణం నెగ్గిన భారత తొలి మహిళ స్వప్న
  • పిస్టల్ షూటింగ్ లో యువ సంచలనం మను బాకర్

గిర్రున తిరిగిపోయే కాలచక్రంలో…సంవత్సరాలు వస్తూ…పోతూ ఉంటాయి. దానికి క్రీడారంగం సైతం ఏమాత్రం మినహాయింపు కాదు. భారత మహిళలు గత ఏడాది కాలంలో…వివిధ క్రీడల్లో అత్యుత్తమంగా రాణించారు. కళ్లు చెదిరే విజయాలు సాధించారు. దేశానికే గర్వకారణంగా నిలిచారు.

తిరుగులేని భారత మహిళలు….

క్రీడారంగంలో భారత మహిళలు దూసుకుపోతున్నారు. క్రీడలు ఏవైనా…తమకు తిరుగేలేదని చాటుకొంటూ అబ్బురపరచే విజయాలు సాధిస్తున్నారు. 2018 సంవత్సరాన్ని భారత మహిళామణులు విజయవంతంగా ముగించడమే కాదు…. కొత్తసంవత్సరంలో సరికొత్త విజయాల కోసం ఉరకలేస్తున్నారు.

ఇద్దరూ ఇద్దరే….

భారత మహిళలు… ప్రపంచ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న క్రీడల్లో గ్లోబల్ గేమ్ బ్యాడ్మింటన్ ను మాత్రమే ముందుగా చెప్పుకోవాలి. ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు, 11వ ర్యాంకర్ సైనా నెహ్వాల్… 2018 సీజన్లో….పలు చిరస్మరణీయ విజయాలతో వారేవ్వా అనిపించుకొన్నారు.

భారత బ్యాడ్మింటన్ కు గత దశాబ్దకాలంగా అమూల్యమైన సేవలు అందిస్తున్న సైనా నెహ్వాల్… గాయాల నుంచి తేరుకొని…. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ..తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటుకొంది.

ఏకంగా కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతకంతో పాటు…ఆసియాక్రీడల కాంస్య పతకాన్ని సైతం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది.

ఇక…తెలుగు తేజం పీవీ సింధు మాత్రం సిల్వర్ క్వీన్ స్థాయి నుంచి గోల్డెన్ స్టార్ స్థాయికి చేరుకోగలిగింది. ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్ ను తొలిసారిగా నెగ్గడం ద్వారా… విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది.

ప్రపంచ మూడో ర్యాంక్ ప్లేయర్ పీవీ సింధు…గత ఏడాది పొడుగునా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలతో పాటు…. పలు సూపర్ సిరీస్ టోర్నీల్లో ఏకంగా ఐదు రజత పతకాలు సాధించింది.

అంతేకాదు…. చైనా వేదికగా ముగిసిన సీజన్ ముగింపు ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీలో సింధు విశ్వరూపమే ప్రదర్శించింది. గ్రూప్ లీగ్ నుంచి..ఫైనల్స్ వరకూ తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా బంగారు పతకం అందుకొంది. ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ ప్లేయర్ గా సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది.

ప్రపంచ నంబర్ వన్ తాయ్ జు ఇంగ్, జపాన్ జోడీ నజోమీ ఒకుహర, యమగుచి, ప్రపంచ మాజీ చాంపియన్ ఇంటానెన్ రచనోక్ లాంటి ప్రపంచ మేటి ప్లేయర్లను మట్టికరిపించి… తానేమిటో నిరూపించుకొంది. ఫైనల్ ఫోబియాను అధిగమించడమే కాదు… విజేతగా స్వర్ణ పతకమూ అందుకోగలనని తొలిసారిగా సింధు చాటి చెప్పింది.

మేరీ గోల్డ్ సరికొత్త రికార్డు….

ప్రపంచ వ్యాప్తంగా భారత మహిళలకు గుర్తింపు తెచ్చిన మేరీకోమ్ గురించి ఎంత చెప్పుకొన్నా అదితక్కువే అవుతుంది. ప్రపంచ అమెచ్యూర్ మహిళా బాక్సింగ్ లో ఆరుసార్లు విశ్వవిజేతగా బంగారు పతకాలు సాధించిన ఘనత మేరీకోమ్ కు మాత్రమే దక్కుతుంది.

ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్…2018 సీజన్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొంది.

వరుసగా ఏడు ప్రపంచకప్ పోటీల్లో ఆరు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన అరుదైన, అసాధారణ రికార్డు కూడా మేరీకోమ్ పేరుతోనే ఉంది. న్యూఢిల్లీ వేదికగా ముగిసిన 2018 మహిళా ప్రపంచ బాక్సింగ్ మహిళల 48 కిలోల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్ హన్నాను 5-0తో చిత్తు చేయటం ద్వారా…మేరీ ఆరో బంగారు పతకం సొంతం చేసుకొంది.

లండన్ వేదికగా జరిగిన 2012 ఒలింపిక్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా బాక్సింగ్ లో….కాంస్య పతకం సాధించిన మేరీకోమ్ 2010 గాంగ్జావో ఆసియా క్రీడల్లో కాంస్యం, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన తర్వాత బాక్సింగ్ నుంచి విరామం తీసుకొంది.

అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లిగా ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే…మూడేళ్లపాటు బాక్సింగ్ కు దూరమైన మేరీకోమ్…2016లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యింది.

అంతేకాదు భారత బాక్సింగ్ పరిశీలకురాలిగానూ బాధ్యతలు తీసుకొంది. ఇలా పలురకాల కారణాలతో బాక్సింగ్ కు దూరంగా ఉన్నా….ఫిట్ నెస్ ను మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సాధన కొనసాగిస్తూనే వచ్చింది.

అంతేకాదు..2018 న్యూఢిల్లీ ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో సైతం మేరీకోమ్ …మేరీగోల్డ్ గా నిలిచింది. ప్రపంచ మహిళా బాక్సింగ్ చరిత్రలోనే ఆరు ప్రపంచ స్వర్ణాలు, ఓ రజతంతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించిన ఏకైక..ఒకే ఒక్క బాక్సర్ గా రికార్డు నెలకొల్పింది.

హర్మన్ ప్రీత్ కౌర్ డబుల్ ధమాకా….

ప్రపంచ మహిళా క్రికెట్లో సైతం…భారత జట్లు మాత్రమే కాదు…భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్, టీ-20 సారథి హర్మన్ ప్రీత్ కౌర్ సైతం అసాధారణ రికార్డులతో…భారత మహిళా క్రికెట్ ఉనికిని మరోసారి చాటి చెప్పారు.

కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన .. టీ-20 మహిళా ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో శతకం సాధించిన భారత తొలిమహిళగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది.

కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్- బీ ప్రారంభలీగ్ పోటీలో… న్యూజిలాండ్ బౌలర్లను హర్మన్ ప్రీత్ ఓ ఆటాడుకొంది.

కేవలం 51 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 8 సిక్సర్లతో సుడిగాలి సెంచరీ సాధించింది. హర్మన్ ప్రీత్ 103 పరుగుల స్కోరుకు అవుటయ్యింది. కేవలం 49 బాల్స్ లోనే వంద పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్.. మహిళా టీ-20 క్రికెట్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది.

వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో 171 పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్… ఇప్పుడు టీ-20 ప్రపంచకప్ లో సైతం శతకం బాదడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

ఎవర్ గ్రీన్ మిథాలీ రాజ్…

భారత ఎవర్ గ్రీన్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలను అధిగమించి… టీ-20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచింది.

2018 మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్-బీ లీగ్ లో…మిథాలీ ఆడిన మూడురౌండ్ల మ్యాచ్ ల్లో .. రెండు హాఫ్ సెంచరీలతో… అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పింది.

గయానా నేషనల్ స్టేడియం వేదికగా ఐర్లాండ్ తో ముగిసిన మూడోరౌండ్ పోటీలో 35 ఏళ్ల మిథాలీ 56 బాల్స్ లో 51 పరుగులు సాధించింది. మిథాలీ మొత్తం 2వేల 283 పరుగులు సాధించి… 2వేల 207 పరుగుల రోహిత్ శర్మ, 2వేల 102 పరుగుల విరాట్ కొహ్లీ ల రికార్డును అధిగమించింది.

భారత టీ-20 క్రికెట్ పురుషుల, మహిళల విభాగాలలో…. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా మిథాలీ నిలిచింది.

ఏషియాడ్ బంగారు కొండలు…

జకార్తా ఆసియాక్రీడల్లో భారత్ సాధించిన మొత్తం 15 స్వర్ణ పతకాలలో….అధికభాగం…అసోం, బెంగాల్, ఒడిషా, హర్యానా, గుజరాత్, పంజాబ్, కేరళ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అథ్లెట్లే సాధించడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

స్వప్న అరుదైన విజయం….

బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురికి చెందిన స్వప్న బర్మన్…ఏడు అంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ లో బంగారు పతకం సాధించి… సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత క్రీడా చరిత్రలోనే ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా నిలిచింది.

ఇక…అసోం రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రన్నర్ హిమ దాస్…మహిళల 400 మీటర్ల పరుగులో రజతం, మిక్సిడ్ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల రిలేలో బంగారు పతకాలు సాధించి సంచలనం సృష్టించింది.

ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన హిమా దాస్ ఏకంగా మూడు పతకాలతో దేశానికే గర్వకారణంగా నిలిచింది.

ఆసియా క్రీడల మహిళల 100, 200 మీటర్ల పరుగులో…భారత రన్నర్ ద్యుతీ చంద్….సిల్వర్ డబుల్ సాధించి..పరుగులోనూ భారత మహిళలకు తిరుగేలేదని చాటి చెప్పింది.

ఒడిషా రాష్ట్రంలోని ఓ చేనేత కుటుంబానికి చెందిన ద్యుతీ చంద్ సైతం…మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు అంశాలలో రజత పతకాలు సాధించి తనకు తానే సాటిగా నిలిచింది.

20 సంవత్సరాల తర్వాత అంతేకాదు…గుజరాత్ లోని మారుమూల గిరిజన జిల్లా డంగ్ కు చెందిన… సరిత గయక్వాడ్… మహిళల 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచింది.

యంగ్ బుల్లెట్ మను బాకర్….

షూటింగ్ మహిళల పిస్టల్ విభాగంలో…హినా సిద్ధు లాంటి సీనియర్ షూటర్లు మాత్రమే కాదు…మను బాకర్ లాంటి నవతరం షూటర్ సైతం అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాలు సాధిస్తూ… దేశానికే వన్నె తెచ్చింది.

భారత మహిళా షూటింగ్ …ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్ అనగానే …హినా సిద్ధూ లాంటి సీనియర్ షూటర్లు టక్కున గుర్తుకువచ్చే రోజులు పోయాయి. హీనాకు తోడుగా 16 ఏళ్ల యువషూటర్ మను బాకర్ సైతం దూసుకొచ్చింది.

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన 2018 కామన్వెల్త్ గేమ్స్ …10 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్ లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా… 16 ఏళ్ల మను బాకర్…తానేమిటో చాటి చెప్పింది.

గాడల్ జరాలో ముగిసిన ప్రపంచ షూటింగ్ పోటీల టీమ్, వ్యక్తిగత విభాగాలలో బంగారు పతకాలు సాధించడం ద్వారా…భారత సీనియర్ షూటింగ్ అరంగేట్రం చేసిన మను బాకర్… సరికొత్త రికార్డు నమోదు చేసింది.

క్రికెట్, బాక్సింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, ట్రాక్ అండ్ ఫీల్డ్… క్రీడలు ఏవైనా… భారత మహిళలు అసాధారణంగా రాణించిన సంవత్సరంగా 2018 చరిత్రలో మిగిలిపోతుంది. అసాధారణంగా రాణించిన క్రీడాకారులకు మాత్రమే కాదు… క్రీడాభిమానులకు గత ఏడాదికాలం కలకాలం గుర్తుండి పోతుంది.

First Published:  28 Dec 2018 1:30 AM GMT
Next Story