Telugu Global
International

డిసెంబ‌ర్‌లో డ‌ల్హౌసి

డ‌ల్హౌసి… పురాత‌న భార‌తంలో విచ్చుకున్న వెస్ట‌ర్న్ ఫ్ల‌వ‌ర్‌. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం చంబ జిల్లాలో ఉంది డ‌ల్హౌసి. హిమాల‌యాల ప‌శ్చిమ శ్రేణుల్లో విస్త‌రించిన ప‌ర్వ‌త ప్రాంతం ఇది. బ్రిటిష్ గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్ లార్డ్ డ‌ల్హౌసి నిర్మించిన ప‌ట్ట‌ణం. అందుకే ఈ ప‌ట్ట‌ణానికి డ‌ల్హౌసి అనే పేరు ఖాయ‌మైంది. ఈ ప్ర‌దేశం గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే… స్విట్జ‌ర్లాండ్‌కు మీనియేచ‌ర్ రూపం. ప‌చ్చ‌ద‌నం, మంచు తెల్ల‌ద‌నం ఒక‌దానితో ఒక‌టి పోటీ ప‌డుతున్న‌ట్లు ఉంటుంది. రోడ్ల నిర్మాణం నుంచి చ‌ర్చిలు, పెద్ద […]

డిసెంబ‌ర్‌లో డ‌ల్హౌసి
X

డ‌ల్హౌసి… పురాత‌న భార‌తంలో విచ్చుకున్న వెస్ట‌ర్న్ ఫ్ల‌వ‌ర్‌. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం చంబ జిల్లాలో ఉంది డ‌ల్హౌసి. హిమాల‌యాల ప‌శ్చిమ శ్రేణుల్లో విస్త‌రించిన ప‌ర్వ‌త ప్రాంతం ఇది. బ్రిటిష్ గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్ లార్డ్ డ‌ల్హౌసి నిర్మించిన ప‌ట్ట‌ణం. అందుకే ఈ ప‌ట్ట‌ణానికి డ‌ల్హౌసి అనే పేరు ఖాయ‌మైంది.

ఈ ప్ర‌దేశం గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే… స్విట్జ‌ర్లాండ్‌కు మీనియేచ‌ర్ రూపం. ప‌చ్చ‌ద‌నం, మంచు తెల్ల‌ద‌నం ఒక‌దానితో ఒక‌టి పోటీ ప‌డుతున్న‌ట్లు ఉంటుంది. రోడ్ల నిర్మాణం నుంచి చ‌ర్చిలు, పెద్ద బంగ్లాలు, ఒక మోస్త‌రు భ‌వ‌నాల నిర్మాణం వ‌ర‌కు ప్ర‌తిదీ స్కాటిష్‌, విక్టోరియ‌న్ వాస్తు శైలిలోనే ఉంటుంది. స‌ముద్ర మ‌ట్టానికి దాదాపుగా రెండు వేల మీట‌ర్ల ఎత్తులో ఉంది డ‌ల్హౌసి ప‌ట్ట‌ణం.

ఈ ప్ర‌దేశం 1854లో లార్డ్ డ‌ల్హౌసి కంట ప‌డ‌క ముందు పంజాబ్ రీజియ‌న్ లో సిక్కుల‌ పాల‌న‌లో ఉండేది. క‌థాలాంగ్‌, పోట్రెయిన్‌, తెరాహ్‌, బ‌క్రోటా, బంగోరా కొండ‌ల‌ను క‌లిపి ప‌ట్ట‌ణంగా విస్త‌రింప చేశాడు డ‌ల్హౌసి.

అచ్చ‌మైన ప‌చ్చ‌ద‌నం

ఈ ప్ర‌దేశం ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చెందిన‌ప్ప‌టికీ కాలుష్య కోర‌ల్లో ఇంకా చిక్కుకోలేదు. అచ్చంగా అత్యంత స‌హ‌జంగా ఉండే ప్ర‌క్రుతి ఒడి. సిక్కు రాజులు బార్మౌర్ రాజ‌ధానిగా చేసుకుని పాలించారు. ఇక్క‌డి గ‌ద్ది, గుజ్జ‌ర్ ఆదివాసీ తెగ‌ల నివాస ప్రాంతం.

డ‌ల్హౌసి ప‌ట్ట‌నాన్ని దాటితే పురాత‌న‌ చంబ‌ను చూస్తాం. డ‌ల్హౌసి మార్కెట్‌ని రాజ్య‌మేలేది కూడా ఆదివాసీల క‌ళాకృతులే. ఇక్క‌డ పురాత‌న ఆల‌యాలు ఎన‌భైకి పైగా ఉన్నాయి. క్రీ.శ ఏడ‌వ శ‌తాబ్దం నుంచి ప‌ద‌వ శ‌తాబ్దం మ‌ధ్య‌లో నిర్మించిన ఆల‌యాలు.

శిల్ప‌రీతుల‌ను ఎంజాయ్ చేయ‌డానికి ఆల‌యాల‌ను కూడా టూర్‌లో క‌లుపుకోవ‌చ్చు. కానీ అన్నింటినీ చూడ‌డం అయ్యే ప‌ని కాదు. గైడ్ స‌హాయంతో ముఖ్య‌మైన వాటిని మాత్ర‌మే చూడ‌గ‌లం.

ఇక్క‌డ చూడాల్సిన ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లో సుభాష్ బౌలి ఒక‌టి. 1937లో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌కి ఆరోగ్యం బాగోలేన‌ప్పుడు ఇక్క‌డ ఏడు నెల‌ల పాటు గ‌డిపాడు.

డ‌ల్హౌసిలో చూడాల్సిన ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లో ఖ‌జ్జైర్ ఒక‌టి. ఇది పూర్తిగా ప్ర‌కృతి సౌంద‌ర్య వీక్ష‌ణ‌మే, అయితే ఇక్క‌డ పన్నెండ‌వ శ‌తాబ్దం నాటి ఖ‌జ్జినాగ్ ఆల‌యం ఉంది. కాలాతాప్‌లో కాలాతాప్‌- ఖ‌జ్జైర్ సాంక్చురీ చూడ‌వ‌చ్చు. దైన్‌కుండ్‌లో శిఖ‌రం ఆర్మీ ఆధీనంలో ఉంది. వారి అనుమ‌తితో వెళ్లాలి. ఈ కొండ‌ను సింగింగ్ హిల్ అంటారు. గాలి మంద్రంగా వీస్తున్న‌ప్పుడు వ‌చ్చే ర‌వం అంద‌మైన రాగాన్ని త‌ల‌పిస్తుంద‌ని ఆ పేరు వ‌చ్చింది.

ప్ర‌కృతి సౌంద‌ర్యాలే కాకుండా అద్భుత‌మైన క‌ట్ట‌డాల గురించి చెప్పాలంటే సెయింట్ ఫ్రాన్సిస్ చ‌ర్చ్ ముఖ్య‌మైన‌ది. దీనిని 1894లో క‌ట్టారు. ఉడెన్ రూఫ్‌, బెల్జియం అద్దాలు, రాతి నిర్మాణాలతో వ‌ర్త్ సీయింగ్ స్పాట్‌. పంచ్‌పులా స‌ర‌స్సు ప‌ట్ట‌ణానికి నీరందించే స‌ర‌స్సు.

ఇక్క‌డ బ్రిటిష్ వారికి వ్య‌తిరేకంగా పోరాడిన స‌ర్దార్ అజిత్ సింగ్ విగ్ర‌హాన్నిమిస్ కాకూడ‌దు. గైడ్‌ని అడిగి మ‌రీ చూడాలి.

డ‌ల్హౌసి శివార్ల‌లో చ‌మేరా స‌ర‌స్సు ఉంది. ఇది స‌హ‌జ‌మైన స‌ర‌స్సు కాదు, రావి న‌ది ప్ర‌వాహ‌ మార్గంలో నిర్మించిన ఆర్టిఫీషియ‌ల్ లేక్‌. పూర్తిగా ప‌ర్వ‌తాల‌ మ‌యం, లోయ‌ల్లో ప్ర‌వ‌హించే నీటి మీద‌నే ఆధార‌ప‌డ‌కుండా నేల‌లో వాట‌ర్ లెవెల్ మెయింటెయిన్ కావ‌డానికి ఏర్పాటు చేసుకున్న బ్రిటిష్ కాలం నాటి ముందు చూపుకు ప్ర‌తీక ఆ స‌ర‌స్సు.

ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ల్ల‌గా కొరికే చ‌లిలో స్వెట్ట‌ర్ల‌ను స‌ర్దుకుంటూ విహ‌రించిన దేహాలు స్వెట్ట‌ర్‌ని విప్పి ఒళ్లు విరుచుకునే చాన్స్ ఇచ్చే ప్ర‌దేశం గ‌ర‌మ్ స‌డ‌క్‌. పేరులోనే ఉంది వెచ్చ‌ద‌నం. డ‌ల్హౌసి మొత్తానికి సూర్యుడి కిర‌ణాలు నేరుగా ప‌డే ప్ర‌దేశం ఇదొక్క‌టే. గాంధీ చౌక్ నుంచి సుభాష్ చౌక్ వ‌ర‌కు ఉన్న రోడ్డే గ‌ర‌మ్ స‌డ‌క్‌.

ఈ రోడ్డులో వెళ్లేట‌ప్పుడు సూర్యుడు వెచ్చ‌ద‌నంతో అల‌రిస్తుంటే గోడ‌ల మీద టిబెట్ రాక్ పెయింటింగ్స్ మురిపిస్తాయి. డ‌ల్హౌసిలో డిసెంబ‌ర్‌లో నిర్వ‌హించే ట్రెక్ టూర్‌ల‌కు అడ్వెంచ‌ర్ టూరిస్టులు రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతారు.

-మంజీర‌

Next Story