Telugu Global
NEWS

అలిగిన ఈటల...!

తెలంగాణలో ఇప్పుడు 33 జిల్లాలకు తోడు మరో నాలుగైదు జిల్లాలు రానున్నాయా అనే చర్చ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగును, మహబూబ్ నగర్ లోని నారాయణ పేటను ప్రత్యేక జిల్లాలుగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు కేసీఆర్ కసరత్తు కూడా ప్రారంభించారు. వీటికితోడు కొత్తగా మాజీ మంత్రి ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ కేంద్రంగా మాజీ ప్రధాని పీవీ పేరుమీదుగా జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.ఈ మేరకు హుజూరాబాద్ తో […]

అలిగిన ఈటల...!
X

తెలంగాణలో ఇప్పుడు 33 జిల్లాలకు తోడు మరో నాలుగైదు జిల్లాలు రానున్నాయా అనే చర్చ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగును, మహబూబ్ నగర్ లోని నారాయణ పేటను ప్రత్యేక జిల్లాలుగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు కేసీఆర్ కసరత్తు కూడా ప్రారంభించారు.

వీటికితోడు కొత్తగా మాజీ మంత్రి ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ కేంద్రంగా మాజీ ప్రధాని పీవీ పేరుమీదుగా జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.ఈ మేరకు హుజూరాబాద్ తో పాటు హుస్నాబాద్, మానకొండూర్ నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలపడం హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే హరీష్ రావు ప్రాతినిథ్యం వహించే సిద్ధిపేట, సిరిసిల్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేటీఆర్ లు పట్టుబట్టి వారు సొంత జిల్లాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక తానేం వీరికంటే తక్కువ అనుకున్నారో ఏమో ఈటల రాజేందర్ కూడా తాను పోటీచేసిన నియోజకవర్గం హుజూరాబాద్ ను ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు.

అయితే ఇది కేసీఆర్ ను విభేదించి డిమాండ్ చేస్తున్నారా? అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఈటలకు కేసీఆర్ స్పీకర్ పదవి ఇస్తాడనే ఊహాగానాల నేపథ్యంలో ఇలా సడన్ గా ఈటల తన ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని పోరుబాటకు సంఘీభావం ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది.

హుజూరాబాద్ జిల్లా కోసం గత వారం రోజులుగా…. హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో న్యాయవాదులు ధర్నా, రాస్తారోకోలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు సాధ్యసాధ్యాలపై ఈటల రాజేందర్ నిపుణులతో చర్చిస్తున్నారు.

ఇటీవల ఈటల విజయోత్సవ ర్యాలీ సందర్భంగా హుజూరాబాద్ ను జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఈటల దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. గతంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం గురించి కూడా సన్నిహితులతో చర్చించారు.

హుజూరాబాద్ ను జిల్లాగా మార్చేందుకు మండలాలు సరిపోవడం లేదన్న భావనతో…. వావిలాల, చల్లూరు మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. గతంలో వావిలాల మండలం కోసం ఇక్కడి ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. చివరకు ఇల్లందకుంట మండలాన్ని ఏర్పాటు చేశారు.

అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎల్కతుర్తి, కమలాపూర్, భీమరదేవరపల్లి మండలాలతోపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ ను హుజూరాబాద్ లో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలాన్ని హుజూరాబాద్ లో కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

త్వరలో క్యాబినెట్ కూర్పు నేపథ్యంలో తెరమీదికి పీవీ హుజూరాబాద్ జిల్లాను తెరపైకి తీసుకురావడంలో ఈటల స్ట్రాటజీ ఏంటనేది అందరూ చర్చించుకుంటున్నారు. హుజూరాబాద్ జిల్లాను ఇప్పటికప్పుడు చేయాల్సిన అవసరం అంతగా లేకపోయినా క్యాబినెట్ లో తన బెర్తును ఖరారు చేసుకునేందుకు తెరమీదికి జిల్లా ఏర్పాటు తీసుకొచ్చారా? లేక ప్రజలు కోరుతున్నట్లు జిల్లాను ఏర్పాటు చేసేందుకేనా? అనేది చర్చనీయాంశంగా మారింది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఈటెల కోరిక మేరకు పీవీ హుజూరాబాద్ జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.

First Published:  23 Dec 2018 7:24 AM GMT
Next Story