Telugu Global
NEWS

చంద్రబాబుతో కలిసి పోటీ చేయమని కేటీఆర్‌కు సలహా ఇచ్చాను

లగడపాటి సర్వేలు బోగస్‌ అంటూ కేటీఆర్‌ విడుదల చేసిన వాట్సాప్‌ చాటింగ్‌పై లగడపాటి రాజగోపాల్‌ మీడియా ముందుకు వచ్చి స్పందించారు. డిసెంబర్‌ ఏడు సాయంత్రమే మాట్లాడుదామనుకున్నానని…. కానీ కేటీఆర్‌ వాట్సాప్‌ లీక్‌ చూసిన తర్వాత స్పందించాల్సి వచ్చిందన్నారు. తనకు వ్యక్తిత్వమే ముఖ్యమని లగడపాటి చెప్పారు. పొరపాటుగా గానీ, ప్రయోజనం కోసం గానీ మాట్లాడడం తన జీవితంలో లేదన్నారు. ఒత్తిడితో లగడపాటి తప్పుడు సర్వేలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పడం సరికాదన్నారు. సెప్టెంబర్‌ 16న వాట్సాప్‌లో తనకు, కేటీఆర్‌కు మధ్య […]

చంద్రబాబుతో  కలిసి పోటీ చేయమని  కేటీఆర్‌కు సలహా ఇచ్చాను
X

లగడపాటి సర్వేలు బోగస్‌ అంటూ కేటీఆర్‌ విడుదల చేసిన వాట్సాప్‌ చాటింగ్‌పై లగడపాటి రాజగోపాల్‌ మీడియా ముందుకు వచ్చి స్పందించారు.

డిసెంబర్‌ ఏడు సాయంత్రమే మాట్లాడుదామనుకున్నానని…. కానీ కేటీఆర్‌ వాట్సాప్‌ లీక్‌ చూసిన తర్వాత స్పందించాల్సి వచ్చిందన్నారు. తనకు వ్యక్తిత్వమే ముఖ్యమని లగడపాటి చెప్పారు. పొరపాటుగా గానీ, ప్రయోజనం కోసం గానీ మాట్లాడడం తన జీవితంలో లేదన్నారు.

ఒత్తిడితో లగడపాటి తప్పుడు సర్వేలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పడం సరికాదన్నారు. సెప్టెంబర్‌ 16న వాట్సాప్‌లో తనకు, కేటీఆర్‌కు మధ్య సంభాషణ జరిగిందన్నారు. సర్వే విషయం మాట్లాడేందుకు కేటీఆర్‌ కామన్ ఫ్రెండ్ ఇంటి వద్దకు వచ్చారన్నారు. సెప్టెంబర్‌లో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని అప్పట్లో తేలిందన్నారు. అప్పటికింకా కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ కలవలేదన్నారు.

చంద్రబాబుతో కలిసి పోటీ చేయమన్నాను….

65 శాతం మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని కూడా కేటీఆర్‌కు తాను చెప్పానన్నారు. వీలైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందిగా సూచించానన్నారు. దాని వల్లే ఈరోజు ఇండిపెండెంట్లను గెలిపించే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబును కలుపుకుంటే టీఆర్‌ఎస్‌కు వార్‌ వన్‌సైడ్‌ అవుతుందని కూడా కేటీఆర్‌కు తాను చెప్పానన్నారు.

కేటీఆర్‌ మాత్రం సింగిల్‌గానే వెళ్తామన్నారని లగడపాటి వివరించారు. కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌ అన్ని కలిశాయంటే పోటీ తీవ్రంగా ఉంటుందని కేటీఆర్‌కు చెప్పానన్నారు. కేటీఆరే… 23 నియోజక వర్గాల పేర్లు సూచించి వాటిలో సర్వే చేయాల్సిందిగా కోరారన్నారు. ఒక్క పైసా తీసుకోకుండా సర్వే చేసి పంపించానన్నారు. నవంబర్ 11న మరికొన్ని కలుపుకుని 37 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారన్నది సర్వే చేసి పంపించాలన్నారు.

ఆ 37 స్థానాల్లో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు వస్తున్నాయన్నాను. అందుకు స్పందించిన కేటీఆర్‌… వాస్తవ పరిస్థితికి సర్వే విరుద్దంగా ఉందని… డిసెంబర్‌ 11న చూద్దామంటూ వాట్సాప్‌లో సమాధానం ఇచ్చారని లగడపాటి వివరించారు.

కేటీఆర్‌ బాధపడ్డారేమో అని వెంటనే దిగులుపడవద్దు… మీరు పరిస్థితిని చక్కదిద్దుతున్నారని వాట్సాప్‌లో కేటీఆర్‌కు చెప్పానన్నారు. ప్రతిపక్షనాయకులపై ఎన్నికల సమయంలో పోలీస్ ఫోర్స్ వాడవద్దని కూడా సలహా ఇచ్చానన్నారు.

నవంబర్‌ 20న మహాకూటమిలో సీట్ల పంపకంపై గందరగోళం నడుస్తున్న సమయంలో మరోసారి వాట్సాప్‌లో కేటీఆర్‌కు సర్వే రిపోర్టు పంపించానని లగడపాటి వివరించారు. ఆ రోజు పంపిన వాట్సాప్‌లో టీఆర్‌ఎస్‌కు 65-70, మహాకూటమికి 35-40 వస్తాయని నవంబర్ 20న కేటీఆర్‌కు సమాచారం పంపానన్నారు. అందుకు కేటీఆర్ స్పందిస్తూ ఇంతకంటే బెటర్‌గా ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారన్నారు.

తొలుత చేదు నిజం పంపిస్తే కేటీఆర్‌కు నచ్చలేదని… నవంబర్ 20న మంచి నిజం చెప్పినా అది కేటీఆర్‌కు చాలలేదన్నారు. అందుకే అప్పటి నుంచి అనేక రిపోర్టులు వచ్చినా కేటీఆర్‌తో షేర్ చేసుకోలేదన్నారు.

టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందనుకున్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చిందన్నారు. ఉదయమే రిపోర్ట్ వచ్చిందని వరంగల్ కూడా కాంగ్రెస్‌ వైపు వెళ్లిపోయిందన్నారు.

ఎస్టీలంతా కాంగ్రెస్‌ వైపు వన్‌సైడ్‌గా వెళ్లిపోతున్నారు, పోటీ హోరాహోరీగా సాగుతోందని తెలియగానే ప్రజలు తమకు నెరవేరని హామీలపై చర్చించడం మొదలుపెట్టారని లగడపాటి వివరించారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక గెలుపోటములకు సిద్ధపడే ఉండాలన్నారు. తనకు, కేటీఆర్‌కు మధ్య ఎలాంటి గొడవ లేదన్నారు. కేటీఆరే తన స్నేహితుడి ఇంట్లో తనను కలిసి సర్వే చేయాలని సాయం కోరారన్నారు.

ఆ సమయంలో చంద్రబాబును కలుపుకోవాలని తాను సూచించానన్నారు. టీడీపీ ఓటు బ్యాంకు గతంలో టీఆర్‌ఎస్‌కు వెళ్లిపోయిందని… కానీ చంద్రబాబుకు కాంగ్రెస్‌ అండ దొరకగానే టీడీపీ ఓటు బ్యాంకు తిరిగి వెనక్కు రావడం మొదలైందన్నారు.

First Published:  5 Dec 2018 1:10 AM GMT
Next Story