ఈరోజు సాయంత్రం రానున్న మరో సర్వే
తెలంగాణ ఎన్నికల్లో మైండ్‌గేమ్ నడుస్తోంది. సర్వేల పేరిట జనాల్లో తికమక సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. మొన్నటివరకు ప్రజా కూటమి గెలుస్తోందని ఢిల్లీ నుంచి ఓ సర్వే పుట్టుకొచ్చింది. కూటమి విజయం ఖాయమంటూ ఈ సర్వే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. ఆ తర్వాత ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ రంగంలోకి దిగారు. పది మంది స్వతంత్రులు గెలుస్తారని బాంబు పేల్చారు. ఆయన పేరిట సర్వేలు తిరగడం మొదలైంది. ఎవరికీ అనుకూలంగా వారు లగడపాటి సర్వే అంటూ […]
తెలంగాణ ఎన్నికల్లో మైండ్‌గేమ్ నడుస్తోంది. సర్వేల పేరిట జనాల్లో తికమక సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. మొన్నటివరకు ప్రజా కూటమి గెలుస్తోందని ఢిల్లీ నుంచి ఓ సర్వే పుట్టుకొచ్చింది. కూటమి విజయం ఖాయమంటూ ఈ సర్వే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. ఆ తర్వాత ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ రంగంలోకి దిగారు. పది మంది స్వతంత్రులు గెలుస్తారని బాంబు పేల్చారు. ఆయన పేరిట సర్వేలు తిరగడం మొదలైంది. ఎవరికీ అనుకూలంగా వారు లగడపాటి సర్వే అంటూ ప్రచారం మొదలుపెట్టారు.
ఎన్నికల రణం క్లైమాక్స్ చేరడంతో గులాబీ సేన కూడా సర్వే లీకులు మొదలెట్టింది. తెలుగులో నెంబర్ వన్ చానల్‌లోఈ సర్వే వ్యూహాత్మకంగా ప్రసారం చేసినట్లు కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ సర్వే పేరిట టీఆర్ఎస్‌కు 94 నుంచి 104 సీట్లు వస్తాయని… కూటమికి కేవలం 16 నుంచి 21 స్థానాలు వస్తాయని తేల్చారు. ఈ సర్వే చేసిన సంస్థ విశ్వసనీయత, చేయించిన వారి క్రెడిబులిటీని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఇదే టైమ్‌లో కేంద్ర ఇంటిలిజెన్స్ సర్వే పేరిట 11 పేజిల రిపోర్టు ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 58, టీడీపీ 9 సీట్లు గెలుస్తుందని తేల్చారు. ఇవే కాకుండా పల్స్ ఆఫ్ ఓటర్ అంటూ ఓ సర్వే తిరుగుతోంది. ఒకశాతం తేడాతో 20 నుంచి 30 నియోజకవర్గాల్లో రాతలు మారే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఈ సర్వేలో కనిపిస్తున్నాయి.
మరోవైపు నెంబర్ వన్ చానల్ ప్రసారం చేసిన సర్వేకు పోటీగా కూటమికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఓ చానల్ మంగళవారం ప్రైమ్‌ట్రైమ్‌లో ఓ సర్వేను రన్ చేయబోతున్నట్లు సమాచారం. కూటమికి ఊపు తెచ్చేలా ఈ సర్వేను వండుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇప్పటికే వివిధ నియోజక వర్గాల్లో సర్వేల పేరిట తిరుగుతున్న సర్వే రాయుళ్లు మాత్రం తెలంగాణలో ఈ సారి పెద్ద ఎత్తున సైలెంట్ ఓటింగ్ జరగబోతుందని తేలుస్తున్నారు. కొందరు ఎంత గుచ్చిగుచ్చి అడిగినా తాము ఏ పార్టీకి ఓటు వేసేది మాత్రం చెప్పడం లేదని అంటున్నారు. పోలింగ్ డే రోజు వీరు ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది. మొత్తానికి సర్వేల పేరుతో తెలంగాణ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.