Telugu Global
NEWS

పవన్‌ సీమ వైపు రాకపోవడం వెనుక అసలు వ్యూహం

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గత కొద్ది నెలలుగా కేవలం గోదావరి జిల్లాలకే తన రాజకీయాన్ని పరిమితం చేశారు. సాధారణ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే గడువున్నా సరే పవన్‌ కల్యాణ్‌ మాత్రం గోదావరి జిల్లాల పైనే ఫోకస్ మొత్తం పెడుతున్నారు. రాయలసీమతో పాటు ఇతర ఆంధ్రా జిల్లాల వైపు కూడా చాలాకాలంగా ఆయన కన్నెత్తి చూడడం లేదు. ఇలా పవన్‌ కల్యాణ్ ఆ రెండు జిల్లాలకే పరిమితం అవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో […]

పవన్‌ సీమ వైపు రాకపోవడం వెనుక అసలు వ్యూహం
X

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గత కొద్ది నెలలుగా కేవలం గోదావరి జిల్లాలకే తన రాజకీయాన్ని పరిమితం చేశారు. సాధారణ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే గడువున్నా సరే పవన్‌ కల్యాణ్‌ మాత్రం గోదావరి జిల్లాల పైనే ఫోకస్ మొత్తం పెడుతున్నారు.

రాయలసీమతో పాటు ఇతర ఆంధ్రా జిల్లాల వైపు కూడా చాలాకాలంగా ఆయన కన్నెత్తి చూడడం లేదు. ఇలా పవన్‌ కల్యాణ్ ఆ రెండు జిల్లాలకే పరిమితం అవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో గోదావరి జిల్లాకు చెందిన కాపులంతా పవన్‌ పిలుపుతో టీడీపీకే ఓటేశారు. దాంతో ఆ రెండు జిల్లాల్లో టీడీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రాంతాలవారిగా చూస్తే రాయలసీమ, దక్షిణకోస్తాలో కాపు ఉప వర్గమైన బలిజలు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు.

ఒకవేళ పవన్ కల్యాణ్ రాయలసీమతోపాటు దక్షిణకోస్తాపై ఎక్కువ ఫోకస్ పెడితే బలిజలు జనసేన వైపు నిలబడుతారు. అప్పుడు అది టీడీపీకి పెద్ద దెబ్బ అవుతుంది. గోదావరి జిల్లాల్లో మాత్రం కాపులు ఈసారి టీడీపీకి ఓటేసే అవకాశమే లేకుండాపోయింది.

దాని వల్ల అక్కడ కాపు ఓటు బ్యాంకు వైసీపీ వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలన్నదే జనసేన వ్యూహంగా భావిస్తున్నారు. జనసేన లేకుంటే గోదావరి జిల్లాల్లో కాపులు వైసీపీ వైపు అధికంగా మొగ్గు చూపవచ్చు.

కాబట్టి వారు అలా వైసీపీ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు పవన్‌ కల్యాణ్‌ గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ఉండవచ్చంటున్నారు. దాంతో పాటు జనసేనకు గ్యారంటీగా కొన్ని సీట్లు వచ్చే జిల్లాలుగా గోదావరి జిల్లాలను లెక్కిస్తున్నారు.

మొత్తం మీద పవన్‌ కల్యాణ్ తన రాజకీయాన్ని ఆ రెండు జిల్లాలకే ఎక్కువగా పరిమితం చేయడం ద్వారా గోదావరి జిల్లాల్లో వైసీపీ బలపడకుండా…. రాయలసీమ, దక్షిణకోస్తాలో టీడీపీకి బలిజ ఓటు బ్యాంకు దూరం కాకుండా సాయపడుతున్నట్టుగా ఉందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  27 Nov 2018 10:37 PM GMT
Next Story