Telugu Global
NEWS

టీజేఎస్ ఎందుకు పోటీ చేస్తున్నట్టు?

కూటమి ధర్మాన్ని నేతలు విస్మరిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు రాని నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. అధిష్టానం ఒత్తిడుల మేరకు నామినేషన్లు బలవంతంగా ఉపసంహరించుకున్న అభ్యర్థులు ఇప్పుడు తమకు జరిగిన అన్యాయాన్ని మాత్రం మరువడం లేదు. ఫలితంగా మహాకూటమి అభ్యర్థులకు సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మంత్రి హరీష్ రావు ఇలాకాలో కూటమికి సహాయ నిరాకరణ అవుతోంది. ఇది కాంగ్రెస్ కు శరాఘాతంగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు అనుకోని వరంలా మారింది. పొత్తులో భాగంగా హుస్నాబాద్ సీటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి […]

టీజేఎస్ ఎందుకు పోటీ చేస్తున్నట్టు?
X

కూటమి ధర్మాన్ని నేతలు విస్మరిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు రాని నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. అధిష్టానం ఒత్తిడుల మేరకు నామినేషన్లు బలవంతంగా ఉపసంహరించుకున్న అభ్యర్థులు ఇప్పుడు తమకు జరిగిన అన్యాయాన్ని మాత్రం మరువడం లేదు. ఫలితంగా మహాకూటమి అభ్యర్థులకు సహాయ నిరాకరణ ఎదురవుతోంది.

మంత్రి హరీష్ రావు ఇలాకాలో కూటమికి సహాయ నిరాకరణ అవుతోంది. ఇది కాంగ్రెస్ కు శరాఘాతంగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు అనుకోని వరంలా మారింది. పొత్తులో భాగంగా హుస్నాబాద్ సీటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి దక్కింది. మొదటి నుంచి ఈ సీటును దక్కించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ తరపున పట్టుబట్టాడు.

ప్రవీణ్ రెడ్డి అప్పటికే 150 గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. దాదాపు 35 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.. తీరా అధిష్టానం ప్రవీణ్ రెడ్డికి మొండిచెయ్యి చూపడంతో ఆ బాధ నుంచి తేరుకోవడం లేదు. పొత్తు ధర్మాన్ని పాటించి కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి రావాలని చాడ వెంకట్ రెడ్డి కోరినా ప్రవీణ్ రెడ్డి సహాయ నిరాకరణే చేస్తున్నారట.. దీంతో హుస్నాబాద్ లో కూటమికి సానుకూల వాతావరణం కనిపించడం లేదు. తప్పని పరిస్థితుల్లో ఒంటరి ప్రచారం పైనే సీపీఐ దృష్టిసారించింది.

సిద్ధిపేటలో కూటమి తరఫున టీజేఎస్ అభ్యర్థిగా మరికంటి భవానీ రెడ్డి బరిలోకి దిగారు. కాగా కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పెద్దల బుజ్జగింపులతో ఆరుగురు నామినేషన్లు ఉపసంహరించుకోగా దరిపల్లి చంద్రం మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రేసులో ఉన్నారు. భవనీరెడ్డి వెంట ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే ఉంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆమెతో కలిసి ప్రచారంలో పాల్గొనడం లేదు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ ను నమ్ముకున్నందుకు తమకు అన్యాయం చేశారని స్థానికంగా బలంగా ఉన్న తమలో ఒకరిని ఎంపిక చేస్తే కలిసి పనిచేసేవారిమని, స్థానికేతురాలికి టిక్కెట్ ఇవ్వడం తమను కలిచివేసేందని ఒక ముఖ్య నాయకుడు వాపోయాడు.

అదేవిధంగా దుబ్బాకలో కూటమి తరఫున టీజేఎస్ నుంచి చిందం రాజ్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా నిలిచిన ముత్యం రెడ్డి టీఆర్ఎస్ బాటపట్టాడు. నియోజకవర్గ నేతలంతా నిస్తేజంలో మునిగిపోయారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ముద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆఖరి వరకు తన ప్రయత్నం విడకపోవడంతో చివరికి స్నేహ పూర్వకపోటీ ఒప్పందంతో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నాడు.

మళ్లీ ఈవీఎంలలో హస్తం గుర్తు కనిపించేలా చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఇక్కడ టీజేఎస్, కాంగ్రెస్ ఎవరికి వారే పోటీలో ఉన్నారు. ఇలా అసంతృప్తులు, అలకలు మధ్య పోటీలో నిలిచిన సిరిసిల్ల జిల్లాలోని అభ్యర్థులకు ఏమేరకు విజయం వరిస్తుందో వేచి చూడాలి మరి.

First Published:  24 Nov 2018 5:58 AM GMT
Next Story