Telugu Global
NEWS

టీడీపీ, కాంగ్రెస్ సహకరించుకుంటేనే.... ఎల్‌బీ నగర్ దక్కేను....!

జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఎల్‌బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పూర్తిగా నగర ఓటర్లతోనే నిండిపోయింది. గత ఎన్నికల్లో బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య టీడీపీ తరపున ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన మహాకూటమి తరపున మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఆశావాహులు ఎక్కువయ్యారు. టీడీపీ నుంచి సామా రంగారెడ్డి చివరి వరకు టీడీపీ టికెట్ కోసం పట్టుబట్టారు. ఆయన ఏకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ధర్నాలు, నిరసన […]

టీడీపీ, కాంగ్రెస్ సహకరించుకుంటేనే.... ఎల్‌బీ నగర్ దక్కేను....!
X

జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఎల్‌బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పూర్తిగా నగర ఓటర్లతోనే నిండిపోయింది. గత ఎన్నికల్లో బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య టీడీపీ తరపున ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన మహాకూటమి తరపున మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఆశావాహులు ఎక్కువయ్యారు.

టీడీపీ నుంచి సామా రంగారెడ్డి చివరి వరకు టీడీపీ టికెట్ కోసం పట్టుబట్టారు. ఆయన ఏకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేశారు. కాని చివరకు ఈ స్థానాన్ని మహాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కేటాయించారు.

ఇక సామా రంగారెడ్డికి పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నం టీడీపీ టికెట్ ఇచ్చారు. అయితే అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ కూడా మల్‌రెడ్డి రంగారెడ్డికి బీ-ఫాం ఇవ్వడంతో సామా రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ఎల్‌బీ నగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగాని రామ్మోహన్ గౌడ్‌ టికెట్ దక్కించుకున్నారు.

హైదరాబాద్ నగరానికి ముఖద్వారం వంటి ఎల్‌బీనగర్ నియోజక వర్గం 2009 ఎన్నికలకు ముందు ఏర్పడింది. ఎల్‌బీనగర్, చంపాపేట్, కర్మాన్‌ఘాట్, వనస్థలిపురం, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, గడ్డిఅన్నారం డివిజన్లు ఈ నియోజక వర్గం పరిధిలోకి వస్తాయి.

ప్రభుత్వ ఉద్యోగులు, ఆంధ్రా సెటిలర్లు, చిన్న వ్యాపారులు, కూలీలు ఎక్కువగా ఈ నియోజక వర్గంలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఫ్లై ఓవర్లు…. అంతర్గత రహదారులు, డ్రెయిన్లు తదితర మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు మూటగట్టుకున్నారు. మరోవైపు తెలుగుదేశం క్యాడర్ పూర్తిగా ఆయన వెనుకలేదు. అయితే ఈ సారి మహాకూటమి తరపున ఆయన మిర్యాలగూడ వెళ్లిపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌కు సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్న నియోజక వర్గ ఇంచార్జి రామ్మోహన్ గౌడ్.. గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. దురుసుతనం ఎక్కువ అనే పేరున్నా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. కేసీఆర్ ప్రభుత్వ విజయాలు తనకు ఓట్లు తెచ్చిపెడతాయని ఆయన ఆశిస్తున్నారు.

ఇక గత ఎన్నికల్లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గత రెండేళ్లుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో తనకంటూ సొంత క్యాడర్‌ను ఏర్పరచుకున్నారు. అయితే చివరి వరకు ఈ టికెట్ ఆశించిన టీడీపీ అభ్యర్థి సామా రంగారెడ్డి సహకరిస్తేనే ఈయన గెలుపు సాధ్యమవుతుంది.

ఎల్‌బీనగర్‌లో ఈ దఫా మహాకూటమి పార్టీల సఖ్యత పైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో టీజేఎస్, సీపీఐ క్యాడర్ కూడా ఉంది. ఈ రెండు పార్టీలు సహకరించినా టీడీపీనే కీలకంగా మారనున్నది. మరి మహాకూటమి అధికార టీఆర్ఎస్‌ను ఎంత ధీటుగా ఎదుర్కుంటుందనే విషయం త్వరలోనే తెలిసిపోనుంది.

First Published:  22 Nov 2018 1:49 AM GMT
Next Story