Telugu Global
NEWS

మర్రి శశిధర్‌ను కావాలనే సైడ్ చేశారా..? కారణం బాబేనా?

మర్రి శశిధర్ రెడ్డి.. తండ్రి చెన్నారెడ్డి వారసత్వపు పగ్గాలు చేపట్టి రాజకీయాల్లోకి వచ్చినా…. ఆ తర్వాత తనకంటూ ఒక మార్గాన్ని నిర్మించుకున్న వ్యక్తి. తన రాజకీయ జీవితంలో ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని…. పార్టీ కష్టకాలంలో కూడా వెన్నంటే ఉన్న వ్యక్తి. ఇప్పుడు టికెట్ కోసం వేచిచూస్తూ ఉండటం పార్టీలోని వ్యక్తులనే ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణ ఎన్నికల సంఘాన్నే ధీటుగా ఎదిరించి…. వారి లోపాలను ఎత్తి చూపుతూ నిన్నటి వరకు కోర్టులు చుట్టూ తిరిగిన శశిధర్ రెడ్డికి […]

మర్రి శశిధర్‌ను కావాలనే సైడ్ చేశారా..? కారణం బాబేనా?
X

మర్రి శశిధర్ రెడ్డి.. తండ్రి చెన్నారెడ్డి వారసత్వపు పగ్గాలు చేపట్టి రాజకీయాల్లోకి వచ్చినా…. ఆ తర్వాత తనకంటూ ఒక మార్గాన్ని నిర్మించుకున్న వ్యక్తి. తన రాజకీయ జీవితంలో ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని…. పార్టీ కష్టకాలంలో కూడా వెన్నంటే ఉన్న వ్యక్తి. ఇప్పుడు టికెట్ కోసం వేచిచూస్తూ ఉండటం పార్టీలోని వ్యక్తులనే ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణ ఎన్నికల సంఘాన్నే ధీటుగా ఎదిరించి…. వారి లోపాలను ఎత్తి చూపుతూ నిన్నటి వరకు కోర్టులు చుట్టూ తిరిగిన శశిధర్ రెడ్డికి టికెట్ ఎందుకు రావట్లేదు..! పొత్తులో పోయిందా..? లేక కొడుకు వేరే పార్టీలో ఉన్నాడని పార్టీకి కోపమా..?

మర్రి శశిధర్ రెడ్డి గత కొన్నేండ్లుగా సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన శశిధర్‌రెడ్డి మూడో స్థానానికి పడిపోయారు. ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన పరిణామాల్లో శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్‌లో చేరి (ఇప్పటికీ ఆయన అధికారికంగా పార్టీ మారలేదు) ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.

ప్రస్తుతం మహాకూటమి పేరుతో టీడీపీ, కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలైనందున ఈ సీటుపై గత కొన్ని రోజులుగా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇది మా సిట్టింగ్ స్థానం కాబట్టి మాకే కేటాయించాలని టీడీపీ కోరుతోంది. అంతే కాకుండా గత ఎన్నికల్లో శశిధర్ ‌రెడ్డి మూడో స్థానానికే పరిమితమై కేవలం 19 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నాడని.. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని ఆ పార్టీ కాంగ్రెస్‌ను పట్టుబడుతోంది. టీడీపీ తరపున కూన వెంకటేష్ గౌడ్‌ బరిలో దిగాలనే ఆశతో ఉన్నారు. చంద్రబాబు కూడా ఈ సీటు టీడీపీ కేటాయిస్తే తలసానిపై విజయం సాధించి చూపెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని కారణాలతో సనత్‌నగర్ సీటుపై కాంగ్రెస్ ఏమీ తేల్చుకోలేక పోతోంది. దీంతో ఇవాళ విడుదలైన కాంగ్రెస్ రెండో జాబితాలో కూడా శశిధర్‌రెడ్డికి సీటు కేటాయించలేదు.

మరోవైపు శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్య కొన్నాళ్ల క్రితం టీజేఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో ముఖ్యనేతగా ఉంటూ తన కొడుకును వేరే పార్టీలో చేర్పించాడని.. పార్టీ నుంచి టికెట్ రాదనే ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నాడని పలువురు పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కోర్టులో కేసులపై పోరాడుతూనే…. మరో వైపు వేరే పార్టీవైపు చూస్తున్నాడనే పిర్యాదులు అధిష్టానానికి చేరాయి.

నాకు ఇదే చివరి ఎన్నికలు…. ఆ తర్వాత పోటీ చేయను అని శశిధర్‌రెడ్డి పలుమార్లు మీడియా ముందు చెప్పారు. అయినా సరే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ సీటును టీడీపీకే కేటాయించడానిక మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సనత్‌ నగర్ సీటును తలసాని వర్సెస్ చంద్రబాబు అని ఇప్పటికే స్థానిక టీడీపీ వర్గాలు ఫిక్సయిపోయాయి. దీంతో శశిధర్‌రెడ్డి ఆశలు గల్లంతే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

First Published:  14 Nov 2018 7:47 AM GMT
Next Story