Telugu Global
NEWS

కోదాడ టీడీపీ ఓట్లు.... కాంగ్రెస్‌కా? టీఆర్ఎస్‌కా?

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో జత కట్టిన కాంగ్రెస్, టీడీపీలకు క్షేత్రస్థాయిలో తిప్పలు తప్పేట్టు లేవు. గత ఐదేండ్లుగా టికెట్ వస్తుందనే ఆశతో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మధ్య ఉన్న చాలా మంది నాయకులకు పొత్తు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అలాంటి నియోజక వర్గమే సూర్యపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత 1978లో ఏర్పడిన ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి సారి జనతాపార్టీ గెలుపొందింది. ఆ తర్వాత ఎన్నికల్లో వీరపల్లి లక్ష్మణరావు ఇండిపెండెంట్ […]

కోదాడ టీడీపీ ఓట్లు.... కాంగ్రెస్‌కా? టీఆర్ఎస్‌కా?
X

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో జత కట్టిన కాంగ్రెస్, టీడీపీలకు క్షేత్రస్థాయిలో తిప్పలు తప్పేట్టు లేవు. గత ఐదేండ్లుగా టికెట్ వస్తుందనే ఆశతో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మధ్య ఉన్న చాలా మంది నాయకులకు పొత్తు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అలాంటి నియోజక వర్గమే సూర్యపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం.

దేశంలో ఎమర్జెన్సీ తర్వాత 1978లో ఏర్పడిన ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి సారి జనతాపార్టీ గెలుపొందింది. ఆ తర్వాత ఎన్నికల్లో వీరపల్లి లక్ష్మణరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. 1985 నుంచి 1999 వరకు మూడు పర్యాయాలు తెలుగుదేశానికి చెందిన వేనేపల్లి చందర్‌రావు, 1999 నుంచి 2009 వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత 2009లో ఈ సీటు తెలుగుదేశం ఖాతాలోనే పడింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి 2009లో హుజూర్‌నగర్ సెగ్మెంటుకు మారారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2014లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ భార్య పద్మావతీ రెడ్డి 13,137 ఓట్ల మెజార్టీతో కోదాడ అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున బొల్లం మల్లయ్యయాదవ్ పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఉద్యమ పార్టీగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ పార్టీ తరపున కన్మంతరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయగా కేవలం 13,404 ఓట్లు మాత్రమే పొందారు.

రాహుల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యాక ఒక కుటుంబంలో ఒకే సీటు అనే నియమాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల బరిలో తమ వారసులను కూడా నిలబెట్టాలని ఢిల్లీలో గట్టి ప్రయత్నాలే చేశారు. కాని రాష్ట్రంలో ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలకు మాత్రమే ఆ ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తప్పకుండా టికెట్ ఇవ్వాలనే కారణంతోనే పద్మావతికి టికెట్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక టీఆర్ఎస్ పార్టీ తరపున సీనియర్ నేత వేనేపల్లి చందర్‌రావుకు టికెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన శ్రీధర్ రెడ్డి.. ఆ తర్వాత ఐదేండ్లుగా కోదాడ నియోజకవర్గాన్నే నమ్ముకొని ఉన్నారు. నియోజకవర్గ ఇంచార్జిగా కూడా ఉండటంతో తనకే టికెట్ దక్కుతుందని అనుకున్నారు. కాని మంత్రి తుమ్మలకు సన్నిహితుడైన వేనేపల్లికి టికెట్ ఇప్పించుకోవడంలో సఫలమయ్యారు. దీంతో శ్రీధర్ రెడ్డి కూడా కాస్త ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మహాకూటమి పొత్తుతో కోదాడ సీటును టీడీపీ వదులుకోవడంతో ఆ పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్యయాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు ఈ సారి ఎలాగైనా టికెట్ దక్కుతుంది అనుకున్న మల్లయ్య మహాకూటమి పొత్తులో దెబ్బతిన్నారు. గత రెండు రోజులుగా పార్టీ మారాలనే యోచనలో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం ఉంటే తప్పకుండా కాంగ్రెస్ మరోసారి గెలిచే అవకాశం ఉంది. అయితే బొల్లం మల్లయ్యయాదవ్‌ను టీఆర్ఎస్‌లోకి రప్పించి ఓట్లను చీల్చే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నాయకులు కొందరు మల్లయ్యయాదవ్‌కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మంచి పదవి దక్కుతుందని ఆఫర్ కూడా చేసినట్లు సమాచారం. అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బతగిలినట్లే. మరోవైపు టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న శ్రీధర్ రెడ్డిని కూడా బుజ్జగించాల్సిన అవసరం ఉంది. ఇన్ని సమీకరణల మధ్య కాంగ్రెస్ పార్టీ సిట్టింగు సీటును కాపాడుకుంటుందా లేదా అనేది చూడాల్సిందే.

First Published:  14 Nov 2018 5:55 AM GMT
Next Story